అప్పుల కోసం అడ్డదారి!

ABN , First Publish Date - 2021-04-15T09:33:36+05:30 IST

రాష్ట్రప్రభుత్వం అడ్డదారిలో అప్పుల వేటసాగిస్తోంది. బిల్లు ల చెల్లింపులు ఆపితే గాని స్కీములు నడపలేని.. ప్రతి నెలా అప్పు పుడితే గాని వేతనాలు, పింఛన్లు చెల్లించలేని దుస్థితిలో

అప్పుల కోసం అడ్డదారి!

18 ఏళ్ల నాటి జీవోలకు వక్రభాష్యాలు

రిస్క్‌ తక్కువ రుణాలకు నో గ్యారెంటీ

దీంతో కొత్త అప్పులకు మార్గం సుగమం


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రప్రభుత్వం అడ్డదారిలో అప్పుల వేటసాగిస్తోంది. బిల్లు ల చెల్లింపులు ఆపితే గాని స్కీములు నడపలేని.. ప్రతి నెలా అప్పు పుడితే గాని వేతనాలు, పింఛన్లు చెల్లించలేని దుస్థితిలో ఉన్న రాష్ట్రానికి..  బ్యాంకులు ఏం చూసి కొత్త అప్పులు ఇస్తున్నాయి.. ఏం చెప్పి ఆర్థిక శాఖ కొత్త రుణాలకు బ్యాంకులను ఒప్పిస్తోంది..? ఈ మిస్టరీ ఏమిటో తేలిపోయింది. 18 ఏళ్ల క్రితం రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన రెండు జీవోలను ఆధారం చేసుకుని, అందులో ఉన్న ఒక నిబంధనను వక్రీకరించి తమ ప్రభుత్వానికి దాదాపు రూ.40 వేల కోట్ల వరకు గ్యారెంటీ ఇచ్చే అవకాశం ఉందంటూ బ్యాంకులను నమ్మిస్తున్న విషయం బయట్టబయలైంది.


గత ఏడాది బ్యాంకుల నుంచి తెచ్చిన రూ. 21,500 కోట్ల అప్పు కూడా గ్యారెంటీల పరిధిలోకి రాదని రాష్ట్రప్రభుత్వం తేల్చేసింది. ‘ఎందుకంటే ఈ అప్పులు తేవడం కో సం ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్పొరేషన్‌కు ఎక్సైజ్‌ ట్యాక్స్‌ను మళ్లిస్తున్నాం.. అది సొంత ఆదాయ వనరు కాబట్టి ప్రభుత్వ గ్యారెంటీల పరిధిలోకి అవేవీ రావు’ అని చెప్పుకొంటోంది. ఇలా తెచ్చిన ప్రతి అప్పునూ పూచీకత్తుల పరిమితికి వెలుపల చూపించేందుకు ఏదో ఒక కారణం వెతుక్కుంటోంది.


ఆ జీవోల్లో ఏముంది?

2003లో ఇచ్చిన జీవో 445 ప్రకారం రాష్ట్రప్రభుత్వం అంతకుముందు రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఆడిటర్‌ జనరల్‌ (ఏజీ) నిర్ధారించిన ఆదాయం సగటులో 90 శాతానికి మించి రుణాలకు గ్యారంటీ ఇవ్వకూడదు. ఆ తర్వాత ఇచ్చిన జీవో 446లో.. గ్యారెంటీలు ఇవ్వడానికి మార్గదర్శకాలు విడుదల చేశారు. అనంతరం రెండేళ్లకు కేంద్రం తెచ్చిన ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం రాష్ట్రంలో కూడా అమల్లోకి వచ్చింది.


దాని ప్రకారం కూడా.. రుణాల కోసం ప్రభుత్వం ఇచ్చే గ్యారెంటీ.. ఆదాయంలో 90 శాతానికి మించకూడదు. అంతకు మించి ఇవ్వాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. ఇవన్నీ ఎందుకనుకున్న జగన్‌ ప్రభుత్వం.. జీవో 446లో ఉన్న 4వ నిబంధనను పూర్తిగా వక్రీకరించి కార్పొరేషన్లకు సంబంధించిన రిస్క్‌ తక్కువ రుణాలేవీ తన గ్యారెంటీల పరిధిలోకి రావని కొత్త వాదన అందుకుంది.


పరిమితికి మించి తెచ్చే అప్పులకు ప్రభుత్వం హామీగా ఉండకూడదని తెలిసీ ఆ నిబంధనకు తూట్లు పొడుస్తూ ఆ జీవోలకు వక్రభాష్యాలు చెబుతోంది. ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్‌ పేరుతో కార్పొరేషన్లు తీసుకునే అప్పులను రిస్క్‌ ఎనాలిసిస్‌ చేసి రిస్క్‌ శాతాన్ని బట్టి ఆ అప్పులకు పూచీకత్తు ఇవ్వాలా వద్దా అనే అంశంపై రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని జీవో 446లో సూచించారు. వంద శాతం రిస్క్‌ ఉన్న అప్పులను ప్రభుత్వం అప్పుల్లో ప్రతి ఏటా చూపించాలని ఆ నిబంధనల్లో పేర్కొన్నారు. రిస్క్‌ శాతం 75 నుంచి 100 శాతం ఉన్న అప్పులను ఆయా కార్పొరేషన్లు చెల్లించలేవని అర్థం కాబట్టి వాటిని ప్రభుత్వమే చెల్లించాలనేది దాని సారాంశం. అందుకే ప్రభుత్వ రుణాల్లో వాటిని చూపించాలని సూచించారు.


రిస్క్‌ 75 శాతం లోపు ఉన్న అప్పులు అంటే.. వాటిని ఆయా కార్పొరేషన్లు సొంతంగా చెల్లించుకోగలవని అర్థం. వాటిని ఏడాది అప్పుల్లో చూపించాల్సిన అవసరం లేదని సదరు 4వ నిబంధన చెబుతోంది. ఈ నిబంధనను జగన్‌ సర్కారు మరో రకంగా అన్వయించి.. అడ్డదారిలో వేల కోట్ల అప్పులు తెచ్చుకోవడానికి ఉపయోగించుకుంటోంది. రిస్క్‌ శాతం తక్కువ ఉన్న అప్పులను కార్పొరేషన్లే చెల్లించుకోగలవు కాబట్టి ఆ మేరకు మిగిలే గ్యారెంటీ పరిమితిని తిరిగి అప్పులు తెచ్చుకోవడానికి వాడుకునేందుకు సిద్ధమవుతోంది.


అవన్నీ ప్రభుత్వమే చెల్లిస్తోంది.. 

ప్రస్తుతం ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్‌ చేస్తున్న కార్పొరేషన్లలో పీఎ్‌ఫసీ లాంటి ఒకటీ అరా కార్పొరేషన్లు తప్ప మిగిలిన కార్పొరేషన్ల అప్పులన్నింటి నీ రాష్ట్రప్రభుత్వమే తిరిగి చెల్లిస్తోంది. ఎందుకంటే అవన్నీ రిస్క్‌ అధికంగా ఉన్న అప్పులు. ఉదాహరణకు.. పౌరసరఫరాల కార్పొరేషన్‌ ద్వారా రూ. 20,000 కోట్లు అప్పు చేసేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనిని తానే చెల్లిస్తోంది. ఎందుకంటే ఆ కార్పొరేషన్‌కు ఆదాయం లేదు. సబ్సిడీల రూపంలో పోయే ఖర్చు ఉంటుంది కాబట్టి! కానీ ప్రభుత్వం లెక్కలో ఆ కార్పొరేషన్‌కు రూ.15 వేల కోట్ల విలువైన ఆస్తులున్నాయి కాబట్టి ఆ అప్పులను ఆ కార్పొరేషన్‌ చెల్లించుకోగలదు.


మిగిలిన రూ.5,000 కోట్ల గ్యారెంటీకి మాత్రమే తాము బాధ్యత వహిస్తామని కొత్త వాదన వినిపిస్తోంది. దీంతో కొత్తగా ఆ కార్పొరేషన్‌ నుంచి ప్రభుత్వ హామీపై రూ.15 వేల కోట్లు రుణం తీసుకునే వెసులుబాటు ఉందని చూపుతోంది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం పూచీకత్తులు 90 శాతానికి మించితే రాష్ట్రపతి ఆమోదం కావాలి. అయితే 90 శాతానికి మించాయో లేదో నిర్ధారించేంది రాష్ట్ర ప్రభుత్వమే కాబట్టి ఇలాంటి నిబంధనలను అడ్డం పెట్టుకుని రుణాలు దూసి తెచ్చేందుకు సమాయత్తమవుతోంది.

Updated Date - 2021-04-15T09:33:36+05:30 IST