పోలీసుల మరణం తీరని లోటు: డీజీపీ

ABN , First Publish Date - 2021-08-23T22:40:13+05:30 IST

శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఏ‌ఆర్ పోలీసులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతి

పోలీసుల మరణం తీరని లోటు: డీజీపీ

అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఏ‌ఆర్ పోలీసులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని రాష్ట్ర డీజీపీ కార్యాలయం తెలిపింది. కలకత్తాలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏఆర్ ఎస్‌ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుల్లు, ఒక కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. తక్షణమే ఘటనా స్థలాన్ని చేరుకొని, వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని రేంజి డీఐజీ, జిల్లా ఎస్పీని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి వివరాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో నలుగురు పోలీసులు మరణం చెందడం పోలీస్ కుటుంబానికి తీరని లోటని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. మరణించిన పోలీస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని డీజీపీ తెలిపారు. ప్రభుత్వం, పోలీస్ శాఖ వారి కుటుంబలకు అండగా ఉంటుందని డీజీపీ పేర్కొన్నారు. 




 శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలాస మండలం సుమ్మాదేవి రైల్వే గేటు దగ్గర జీపు టైరు పేలడంతో నలుగురు ఎస్కార్ట్ పోలీసులు దుర్మరణం చెందారు. వారిని ఏఆర్ కానిస్టేబుళ్లుగా గుర్తించారు. వారు ఓ ఆర్మీ జవాను అంత్యక్రియల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న వాహనం టైరు పేలి, అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్ఐ కృష్ణం నాయుడు, హెడ్ కానిస్టేబుల్స్ జనార్థనరావు, ఆంటోనీ, కానిస్టేబుల్ బాబూరావులు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-08-23T22:40:13+05:30 IST