ఉద్యోగుల పోరుబాట

ABN , First Publish Date - 2022-01-24T06:00:37+05:30 IST

రివర్స్‌ పీఆర్సీ, సీపీఎస్‌ రద్దు తదితర అంశాలపై ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు.

ఉద్యోగుల పోరుబాట
సమావేశంలో మాట్లాడుతున్న ఎన్‌జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవులు

పీఆర్సీ సాధన సమితి ఏర్పాటు

ఏక తాటిపైకి అన్ని ఉద్యోగ సంఘాలు

రేపు కలెక్టరేట్‌ వద్ద ర్యాలీ, నిరసన


చిత్తూరు, జనవరి 23: రివర్స్‌ పీఆర్సీ, సీపీఎస్‌ రద్దు తదితర అంశాలపై ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. తమకు జరుగుతున్న అన్యాయంపై సమరశంఖం పూరించడానికి ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఆదివారం చిత్తూరులోని ఎన్‌జీవో భవనంలో సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. జిల్లాలోని 78 సంఘాల నాయకులు, ఆర్టీసీ ఉద్యోగులు హాజరై భవిష్యత్తు కార్యాచరణకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఉద్యోగ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన సమితి ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్‌ కేవీ రాఘవులు మాట్లాడుతూ ఉద్యోగులకు పీఆర్సీ ద్వారా జరిగే నష్టాన్ని వ్యతిరేకిస్తూ వచ్చే నెల 7వ తేదీ నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు ప్రకటించారు. పీఆర్సీ, తదితర సమస్యలపై ఇదివరకు ప్రభుత్వానికి పలుమార్లు చర్చించినా ఫలితం లేకపోవడంతోనే సమ్మెకు వెళ్లాల్సి వస్తోందన్నారు. హక్కుల సాధన కోసం పోరాటాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురైనా కార్యాచరణ మేరకు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి హక్కులను సాధించుకుంటామని చెప్పారు. పీఆర్సీ సాధన సమితి చేపట్టనున్న కార్యక్రమాల్లో పెద్దసంఖ్యలో ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రసాదరెడ్డి, వీజీ రఘు, గంటా మోహన్‌, సుబ్రహ్మణ్యం, రమణ, శివయ్య, మధుసూదన్‌, చెంగల్రాయ మందడి, సుధాకర్‌, ఉమాపతి, సమీర్‌, పీఎంఆర్‌ ప్రభాకర్‌, చెంచురత్నం, రెడ్డిశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


కార్యాచరణ ప్రణాళిక ఇదే..


పీఆర్సీ సాధన నమితి ఆధ్వర్యంలో సోమవారం సీఎస్‌కు ఉద్యమ నోటీసు ఇస్తారు. ఈ నెల 25న జిల్లా కేంద్రమైన చిత్తూరులో ర్యాలీలు, ధర్నాలు. 26న తాలూకా కేంద్రాల్లోని అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాల సమర్పణ. 27, 28, 29, 30 తేదీల్లో జిల్లా కేంద్రంలో ఉదయం 9నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిలే నిరాహార దీక్ష, ఫిబ్రవరి 3న ఛలో విజయవాడ. 5న ఉద్యోగులు పనిచేసే ప్రభుత్వ కార్యాలయాల్లోనే సహాయ నిరాకరణ కార్యక్రమం చేపడతారు. 7వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లనున్నారు.


Updated Date - 2022-01-24T06:00:37+05:30 IST