ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో పొగలు

ABN , First Publish Date - 2022-01-22T05:21:42+05:30 IST

ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో పొగలు

ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో  పొగలు

నెక్కొండ, జనవరి 21 : విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో(20806) బోగీ నుంచి పొగలు రావడంతో శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో వరంగల్‌ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్‌లో నిలిపారు. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు భయాందోళనతో హుటాహుటిన లగేజీలతో సహా రైలు దిగి ప్లాట్‌ఫామ్‌పైకి పరుగులు తీశారు. ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలు నెక్కొండ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న సమయంలో రైల్వేస్టేషన్‌ మెయిన్‌ లైన్‌లో గూడ్స్‌ రైలు ఆగి ఉండటంతో ఏపీ ఎక్‌ప్రె్‌సను లూప్‌లైన్‌(రెండో ప్లాట్‌ఫామ్‌ ఉన్న లైన్‌)కు మళ్లించారు. దీంతో డ్రైవర్‌ రైలు వేగాన్ని తగ్గించేందుకు బ్రేక్‌లు వేయడంతో రైలు ఇంజన్‌ నుంచి రెండో బోగి (ఎస్‌-6)లో బ్రేక్‌లు జామ్‌ అయి పొగలు వచ్చాయి. డ్రైవర్‌ పొగలను గుర్తించి రైలును రెండో ప్లాట్‌ఫాంపై నిలిపాడు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై రైలు దిగారు. సిబ్బంది అరగంటపాటు మరమ్మతులు చేసిన అనంతరం రైలును పంపించారు. సాంకేతిక లోపం తలెత్తడంతో బ్రేక్‌లు జామ్‌ అయి పొగలు వ్యాపించాయని రైల్వే అధికారులు తెలిపారు. నెక్కొండ స్టేషన్‌లోని రెండు అప్‌ ట్రాక్‌లలో మెయిన్‌ లైన్‌పై గూడ్స్‌, లూప్‌ లైన్‌పై ఏపీ ఎక్స్‌ప్రెస్‌  నిలవడంతో ఉదయం వేళల్లో సికింద్రాబాద్‌, న్యూఢిల్లీ వైపు వెళ్లాల్సిన పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను సమీప స్టేషన్లలో నిలపడంతో  రైళ్లు ఆలస్యంగా నడిచాయి.


Updated Date - 2022-01-22T05:21:42+05:30 IST