ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతున్న ఏపీ సర్కార్

ABN , First Publish Date - 2021-11-28T00:12:33+05:30 IST

అప్పుల మీద అప్పులు చేస్తూ.. దొడ్డిదారిలో తప్పులు చేస్తూ అన్ని పరిమితులు దాటేసి రాజ్యాంగ విరుద్ధంగా కార్పొరేషన్‌ల ద్వారా

ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతున్న ఏపీ సర్కార్

అమరావతి: అప్పుల మీద అప్పులు చేస్తూ.. దొడ్డిదారిలో తప్పులు చేస్తూ అన్ని పరిమితులు దాటేసి రాజ్యాంగ విరుద్ధంగా కార్పొరేషన్‌ల ద్వారా అప్పుల వేట ప్రారంభించిన ఏపీ సర్కార్ అన్ని కట్టుబాట్లను తెంచేస్తోంది. స్వీయ క్రమశిక్షణ గీతను చెరిపేసింది. గ్యారంటీల గోల్ మాల్‌లతో పాటు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులను మార్చేసింది. రాష్ట్ర సర్కార్ ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతోందని తేల్చిన కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రోజే మరో లక్ష కోట్ల రుణం తీసుకునే వెసులుబాటును కల్పించుకుంటూ ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. 


ఒక్క చాన్స్‌’ అంటూ అధికారంలోకి అడుగుపెట్టిన రోజు నుంచే జగన్‌ సర్కారు ‘ఆర్థిక విధ్వంసం’ మొదలైందని తేలిపోయింది. ఆర్థిక విషయాల్లో బడ్జెట్‌ అంటే లెక్కలేదు, అసెంబ్లీకి విలువలేదు, రాజ్యాంగానికి గౌరవం అసలే లేదని ‘కాగ్‌’ స్పష్టంగా తేల్చి చెప్పింది. ప్రజా ధనాన్ని రాష్ట్ర భవిష్యత్తుకు ఏమాత్రం ఉపయోగపడని విధంగా ఖర్చు చేస్తున్న వైనం.. ఖర్చులపై శాసన సభ తన నియంత్రణ కోల్పోయిన తీరుపై విస్మయం, అభ్యంతరం వ్యక్తం చేసింది.   


జగన్‌ సర్కార్‌ అధికారంలోకొచ్చిన మొదటి ఏడాది... 2019-20లో ఆర్థిక నిర్వహణపై కాగ్‌ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీనిలో ఒక్క ప్రశంస కూడా లేదు. పైగా... జగన్‌ సర్కార్‌ ఆర్థిక అరాచకాలను పూర్తిగా కాకపోయినా, కొన్ని పార్శ్వాలను కాగ్‌ బయటపెట్టింది. దొంగ అప్పుల కోసం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేశారో, బడ్జెట్‌లో కేటాయింపులు ఎంత గుడ్డిగా ఉన్నాయో విడమరిచి చెప్పింది. ఖజానా నుంచి డబ్బులు ఖర్చు చేయడంలో జరిగిన రాజ్యాంగ ఉల్లంఘనలు, పీడీ ఖాతాల గోల్‌మాల్‌ వ్యవహారాల గురించి కళ్లకు కట్టింది.

Updated Date - 2021-11-28T00:12:33+05:30 IST