నిరసన హోరు

ABN , First Publish Date - 2021-12-08T14:41:27+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా..

నిరసన హోరు

డిమాండ్ల సాధనకు కదంతొక్కిన ఉద్యోగులు

నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు

అన్ని కార్యాలయాల వద్ద నిరసనలు

సమస్యల పరిష్కారానికి డిమాండ్‌

ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమం 

ఆగదని సంఘాల నేతల ప్రకటన

మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు

పీఆర్సీ ప్రకటించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం: బొప్పరాజు

పీఆర్‌సీ నివేదికను తక్షణం బయటపెట్టాలి: బండి డిమాండ్‌

1న జీతాల కోసం ఆందోళన 

ఇదే తొలిసారని ఆవేదన


(ఆంధ్రజ్యోతి-న్యూస్ నెట్‌వర్క్‌): రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ కాంప్లెక్సులు.. ఉద్యోగుల నిరసనలతో హోరెత్తాయి. పీఆర్సీ ప్రకటన, సీపీఎస్‌ రద్దు, డీఏ బకాయిల విడుదల సహా 71 సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి పిలుపు మేరకు ఉద్యోగులు కదంతొక్కారు. 


సమస్యల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమం ప్రారంభించారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా తొలిరోజు మంగళవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కొన్ని చోట్ల మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయాల ఎదుట నిలబడి తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ‘ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు.. ఎక్కడికక్కడ ఉద్యోగులను సమాయత్తపరిచారు. ఉద్యోగులు పెట్టుకున్న నల్ల బ్యాడ్జీలపైనా నినాదాలను పొందుపరిచారు. ‘‘పీఆర్సీ, డీఏలు వెంటనే ప్రకటించాలి. సీపీఎస్‌ రద్దు చేయాలి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయ్యాలి’’ అంటూ  బ్యాడ్జీల మీద నినాదాలు రాశారు.  


జిల్లాల్లో ఉద్యమం ఇలా..

విజయనగరం: జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామంలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నిరసన తెలిపారు. కలెక్టరేట్‌, ఆర్డీవో కార్యాలయం, పార్వతీపుంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం, మండల రెవెన్యూ, పరిషత్‌ కార్యాలయాల వద్ద నల్ల బ్యాడ్జీలతో ఆందోళనలో పాల్గొన్నారు. 


కృష్ణాజిల్లా: ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. విజయవాడలో సబ్‌ కలెక్టరేట్‌, ఇరిగేషన్‌, రవాణా శాఖ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించారు. ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ సెక్రటరీ జనరల్‌ వైవీ రావు తదితరులు ఉద్యోగులతో మాట్లాడారు. 


పశ్చిమ గోదావరి: జిల్లా కేంద్రం ఏలూరు కలెక్టరేట్‌, ఏజెన్సీ ప్రాంతమైన కేఆర్‌ పురం, పోలవరం వరకు ఉద్యోగులు నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. జిల్లాలోని 50 శాఖలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసనలో పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన హౌసింగ్‌, ఆగ్రో సిబ్బంది కూడా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.   


గుంటూరు: భోజన విరామ సమయంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్‌లో ఆందోళన నిర్వహించారు. 11వ పీఆర్‌సీ నివేదిక బహిర్గతం చేయాలని ఏపీజేఏసీ గుంటూరు జిల్లా నేత సంగీతరావు డిమాండ్‌ చేశారు. 


తూర్పుగోదావరి: జిల్లాలో లక్షన్నర మంది ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. జిల్లా కేంద్రం నుంచి గ్రామస్థాయి వరకు కార్యాలయాల్లో  నిరసన చేపట్టారు.   ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఈ నెల 13 నుంచి ఉద్యమం తీవ్రతరం చేస్తామని తెలిపారు. 


అనంతపురం: జిల్లా కలెక్టర్‌, ఆర్‌డీవో ఆఫీస్‌, తహసీల్దార్‌ కార్యాలయాలు, వైద్య ఆరోగ్య శాఖ, నీటిపారుదల శాఖ, ఐసీడీఎస్‌, ప్రభుత్వ పాఠశాలలతోపాటు మిగతా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్‌ దివాకర్‌రావు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు.  


చిత్తూరు: ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. డీఈవో కార్యాలయ సిబ్బందితో పాటు ఆయా సంఘాల నాయకులు పాఠశాలల్లో నల్లబ్యాడ్జీలతో నిరసనలు తెలిపారు.


కడప: జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఏపీజేఏసీ అమరాతి చైర్మన్‌ జీవన్‌ కుమార్‌ మాట్లాడుతూ సీఎం జగన్‌ ప్రకటించిన విధంగా 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.  


నెల్లూరు: కలెక్టరేట్‌,  ట్రెజరీ కార్యాలయం వద్ద ఏపీ జేఏసీ, ఏపీజేఏసీ-అమరావతి నాయకులు నిరసన తెలిపారు. ఏపీజేఏసీ-అమరావతి జిల్లా అధ్యక్షుడు అల్లంపాటి పెంచలరెడ్డి, ఏపీజేఏసీ జిల్లా అధ్యక్షుడు మన్నేపల్లి పెంచలరావు, ట్రెజరీ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్రప్రధాన కార్యదర్శి కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు. 


శ్రీకాకుళం: మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నిరసన తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలతో పాటు మండల పరిషత్‌ కార్యాలయాల వద్ద ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ పాల్గొన్నారు. మరోవైపు ఉద్యోగ సంఘాల నేతలతో కలెక్టర్‌ శ్రీకేశ్‌ బాలాజీ లఠ్కర్‌ సమావేశమయ్యారు.

Updated Date - 2021-12-08T14:41:27+05:30 IST