Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్.. అశోక్ గజపతిరాజుకు గ్రీన్‌ సిగ్నల్‌

అమరావతి: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మాన్సాస్‌ చైర్మన్‌గా మాజీ కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు కొనసాగింపునకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నలిచ్చింది. అశోక్‌గజపతిరాజును పునర్‌ నియమిస్తూ సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై  ప్రభుత్వం, సంచయిత గజపతిరాజు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించారు. సీజే ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌లో పిటిషన్లపై విచారణ జరిగింది. ప్రభుత్వం, సంచయిత వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. మాన్సాస్‌ చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు కొనసాగుతారని సింగిల్ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సీజే బెంచ్‌ సమర్థించింది.


గతంలో అశోక్ గజపతిరాజుపై రాష్ట్ర ప్రభుత్వం రహస్య ఉత్తర్వులతో విరుచుకుపడింది. ఆయనను సింహాచల దేవస్థానం చైర్మన్‌గా తొలగించింది. అలాగే... విజయనగరం సంస్థానాధీశులకు చెందిన మహారాజా అలక్‌ నారాయణ్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌(మాన్సాస్‌) ట్రస్టు అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఈ రెండు పదవుల్లో ఆయన అన్న, మాజీ మంత్రి పూసపాటి ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజును నియమిస్తూ అర్ధరాత్రి రహస్య ఉత్తర్వులిచ్చింది.


ప్రభుత్వం జీవోపై అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్‌పర్సన్‌గా సంచయిత గజపతి నియామక జీవోను హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టివేసింది. అశోకగజపతిరాజును పునర్నియమించాలంటూ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలో ప్రభుత్వం మళ్లీ హైకోర్టును ఆశ్రయించగా..న్యాయస్థానం అశోక్ గజపతిరాజుకు అనుకూలంగా తీర్పువెలువరించింది. 

Advertisement
Advertisement