డబుల్‌ పేమెంట్‌పై బయటపడ్డ నిజం

ABN , First Publish Date - 2020-08-15T08:40:18+05:30 IST

డబుల్‌ పేమెంట్ల విషయంలో తప్పు బయటపడడంతో గత్యంతరం లేకే ప్రభుత్వం ఒప్పుకొందని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు...

డబుల్‌ పేమెంట్‌పై బయటపడ్డ నిజం

  • గత్యంతరం లేకే ప్రభుత్వం ఒప్పుకొంది
  • మంత్రి బుగ్గన బంధువు కనుసన్నల్లోనే
  • ప్రభుత్వంపై మాజీ మంత్రి ఉమా ఫైర్‌

అమరావతి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): డబుల్‌ పేమెంట్ల విషయంలో తప్పు బయటపడడంతో గత్యంతరం లేకే ప్రభుత్వం ఒప్పుకొందని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు. సామాజిక పింఛన్ల సొమ్ము రూ.1400 కోట్లు రెండుసార్లు కిందిస్థాయి అధికారుల ఖాతాలకు బదిలీ చేశారని ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే, అంత మొత్తం బదిలీ చేయలేదని, రూ.649 కోట్లు మాత్రం అలా వెళ్లాయని, తర్వాత వాటిని వెనక్కు తీసుకున్నామని సీఎ్‌ఫఎంఎస్‌ అంగీకరించింది. దీనిపై ఉమా స్పందించారు.


‘‘సాంకేతిక పొరపాటు వల్ల ఇలా జరిగిందని చెప్పడం సిగ్గుచేటు. ఈ తప్పునకు ఎవరు బాధ్యత తీసుకొంటారు? గత ఏడాది ఇలాగే రూ.70 కోట్లకు బదులు రూ.700 కోట్లు చెల్లింపులు జరిగితే అప్పుడు సీఈవోగా ఉన్న వ్యక్తిని సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకొన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డికి బంధువైన రమణారెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి సోదరుడు శ్రీనివాసరావు ఈ చెల్లింపుల వ్యవహారంలో అంతాతామై నడిపిస్తున్నారు. కొంత మంది ప్రోగామర్లను పెట్టుకొని ట్రెజరీ కోడ్‌కు విరుద్ధంగా లోపాయికారీ చెల్లింపులు చేస్తున్నారు. రూ.1400 కోట్లు రెండుసార్లు చెల్లింపులు చేసిన మాట నిజం. అందులో ఎంత వెనక్కు తెప్పించారో ఆర్థిక మంత్రి చెప్పాలి’’ అని ఉమా డిమాండ్‌ చేశారు. కొందరు కంట్రాక్టర్లకు కూడా ఇదే మాదిరిగా డబుల్‌ చెల్లింపులు జరిగినట్లు వింటున్నామని, ఈ మొత్తం వ్యవహారం బయటకు రావడానికి వీలుగా ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కొందరికి డబుల్‌ పేమెంట్లు చేసే ప్రభుత్వం వేల మంది రాజధాని రైతులకు ఇవ్వాల్సిన కౌలు ఎందుకు ఇవ్వడం లేదని ఉమా ప్రశ్నించారు. 


కాంట్రాక్టర్లకు కాదు: సీఎ్‌ఫఎంఎస్‌

కాంట్రాక్టర్లకు రూ.1400 కోట్ల మేర డబుల్‌ పేమెంట్‌ చేశారన్న దేవినేని వ్యాఖ్యలను కాంప్రహెన్సివ్‌ సీఎ్‌ఫఎంఎస్‌ సీఈవో హరేందిరా ప్రసాద్‌ శుక్రవారం ఓ ప్రకటనలో ఖండించారు. 


Updated Date - 2020-08-15T08:40:18+05:30 IST