ఇదేమి విపరీతం!

ABN , First Publish Date - 2020-05-27T09:37:03+05:30 IST

ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల్లో కొన్ని తప్పులు దొర్లడం సహజం! రాజ్యాంగం, చట్టాలకు లోబడని వాటిని న్యాయస్థానాలూ తోసిపుచ్చడం సర్వసాధారణం! అలాంటప్పుడు... ప్రభుత్వం ముందు మిగిలిన అవకాశాలు రెండే

ఇదేమి విపరీతం!

  • నిబంధనలు, చట్టాలతో పని లేదు
  • మానవ హక్కులకు విలువ లేదు
  • తీర్పు చెప్పిన కోర్టుపైనా దూషణలు
  • ఇలా జరగడం ఇదే తొలిసారి
  • ఎక్కడి దాకా వెళ్తుందో అనే ఆందోళన
  • బెంబేలెత్తుతున్న బ్యూరోక్రసీ 

(అమరావతి - ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల్లో కొన్ని తప్పులు దొర్లడం సహజం! రాజ్యాంగం, చట్టాలకు లోబడని వాటిని న్యాయస్థానాలూ తోసిపుచ్చడం సర్వసాధారణం! అలాంటప్పుడు... ప్రభుత్వం ముందు మిగిలిన అవకాశాలు రెండే రెండు! ఒకటి... హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం!  లేదా... సుప్రీంకోర్టును ఆశ్రయించడం! ఇదేదీ కాకుండా...  ‘అంతా మా ఇష్టం! మాకు తోచిందే చేస్తాం! కోర్టు తీర్పులను లెక్క చెయ్యం’ అనే వైఖరి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తోంది. తమకు నచ్చని తీర్పులు చెప్పిన కోర్టులను అధికార పార్టీ ఎంపీ మొదలుకుని నేతలు, అభిమానుల వరకు సోషల్‌ మీడియాలో దుమ్మెత్తిపోయడం ఇప్పుడే జరుగుతోం ది. ఇది జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది.


తప్పును తప్పు అనకూడదట...

కోర్టుల్లో నమోదయిన కేసులు, వస్తున్న తీర్పుల్లో కొన్ని మౌలికమైన, మానవ హక్కులకు సంబంధించిన కీలకాంశాలు ఇమిడి ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. నర్సీపట్నం డాక్టర్‌ సుధాకర్‌ విషయానికొస్తే.. ఆయన సర్వీసు నియమావళిని ఉల్లంఘించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రకటించారు. సస్పెండ్‌ చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు... విశాఖ నగరం నడి వీధిలో డాక్టర్‌ సుధాకర్‌ను కొట్టారు. పెడరెక్కలు విరిచి, ఆస్పత్రిలో పడేశారు. కొన్ని గంటల్లోనే ఆయనను ‘పిచ్చాసుపత్రి’లో చేర్చారు. బయటివారిని అనుమతించకుండా చికిత్స చేయడం, తనకు ఇక్కడ సరైన చికిత్స అందడం లేదని మరో ఆస్పత్రికి తరలించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోకుండా.. మేం ఇలాగే చేస్తాం అనడం ఇవన్నీ పెను వివాదానికి కారణమయ్యాయి. అంతేకాదు... ఇది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే. డాక్టర్‌ సుధాకర్‌కు నిజంగానే మానసిక స్థితి సరిగా లేకపోతే వైద్యులు, పోలీసులు ఆయన పట్ల వ్యవహరించాల్సిన తీరు అది కాదని హైకోర్టు ఆదేశాలతో వెల్లడయింది. వాస్తవానికి ఈ సంఘటన జరిగిన రెండ్రోజుల తర్వాత హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆయన్ను కోర్టు ముందు హాజరుపరచాలని కూడా పేర్కొంది. కానీ, అప్పటికప్పుడు ఒక కమిటీవేసి, ఆయనకు మానసిక స్థితి సరిగాలేదని హైకోర్టు వరకు ప్రయాణించడం కష్టమని ఒక అఫిడవిట్‌ సమర్పించారు. అయితే, జరుగుతున్న తంతును స్వయంగా పరిశీలించడానికి హైకోర్టు ఒక న్యాయాధికారిని ఆస్పత్రికి పంపింది. డాక్టర్‌ సుధాకర్‌ వాంగ్మూలాన్ని నమోదు చేయించింది. జరిగిన వివాదం, ఆయన శరీరంపై గాయాలపై ప్రభుత్వం చెప్పిందొకటి, వాంగ్మూలంలో ఉన్నది మరొకటి కావడం, మరిన్ని తికమకలు గుర్తించడం, పోలీసులపై సుధాకర్‌ అనేక ఆరోపణలు చేయడంతో... ఈ కేసును హైకోర్టు స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐకి అప్పగించింది. ఈ చికిత్సలో కొన్ని  రాజకీయమైన అంశాలు కూడా ముడిపడి ఉన్నాయన్న విమర్శలు లేకపోలేదు. హైకోర్టు తగినంత సమయం ఇచ్చినా...ప్రభుత్వం తప్పు దిద్దుకోలేదు. డాక్టర్‌ సుధాకర్‌ పట్ల మానవతా దృక్పథంతో కాకుండా,  ‘మమ్మల్నే విమర్శిస్తావా’ అనే కసి, కోపమే కనిపించిందనే అభిప్రాయం వెల్లడైంది. సీబీఐ విచారణకు ఆదేశించిన తర్వాత కూడా ఈ ధోరణిలో ఎలాంటి మార్పు కనిపించడంలేదు. వాస్తవాలేమిటో బయటి ప్రపంచానికి తెలియకుండా కట్టడిచేశారు. ఈ సంఘటనను ప్రభుత్వం, అధికార యంత్రాంగం మానవ హక్కులపై చేస్తున్న దాడిగా అభివర్ణిస్తూ అంతర్జాతీయ పత్రికల్లో సైతం వార్తాకథనాలు వెలువడటంతో ఏపీ పరువు మరోసారి ప్రపంచవ్యాప్తంగా పోయినట్లయింది.


తెలిసి తెలిసీ... 

ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు పూయాలనడమే ఒక అతి అయితే... హైకోర్టు చెప్పిన తర్వాత కూడా తీరు మార్చుకోకపోవడం అరాచకమని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రభుత్వం జనాకర్షణ పథకాలు చేపట్టి ప్రజల్లో అభిమానాన్ని, తద్వారా మళ్లీ అధికారాన్ని సంపాదించుకోవాలే కానీ... ఎటూచూసినా ప్రభుత్వ కార్యాలయమా, పార్టీ కార్యాలయమా అర్థంకానట్లుగా రంగులు వేయడం ఏమిటన్న విమర్శలు గత కొంతకాలంగా వస్తూనే ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన మూడు రంగులే గ్రామ సచివాలయాలకు ఉండాలని పంచాయతీరాజ్‌ శాఖ సర్క్యూలర్‌ జారీ చేసినప్పుడే అందరూ విస్మయం వ్యక్తం చేశారు. హైకోర్టు కాస్తా ఘాటుగానే స్పందించి ఆ రంగులు తొలగించి.... జాతీయ బిల్డింగ్‌ కోడ్‌ ప్రకారం పార్టీలతో సంబంధం లేని రంగులే వాడాలని సూచించింది. ఇందులో తమకు నచ్చని అంశం ఏముందోకానీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపుతట్టింది. అక్కడా... వ్యతిరేక స్పందనే రావడంతో జీఓను సవరించారు. సాక్షాత్తూ... అధికార యంత్రాగపు అధిపతి అయిన చీఫ్‌ సెక్రెటరీనే మళ్లీ అవే రంగులనే సూచిస్తూ కొత్తగా ఎర్రమట్టిరంగు జత చేశారు. ఇది అక్షరాలా కోర్టు ధిక్కరణే! అందుకే... హైకోర్టు దీనిపై అంత తీవ్రంగా స్పందించింది. ఆ తర్వాత కూడా ఈ తప్పు దిద్దుకునే దిశగా ఒక్క అడుగూ పడలేదు. రంగులు మార్చేందుకు కోర్టు ఇచ్చిన గడువు గురువారంతో ముగుస్తోంది. కానీ... ఇప్పటిదాకా ప్రభుత్వం దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంటే... ‘మీరు చెబితే మేం వినాలా? కోర్టులు అయితే మాకేంటి?’ అనే నిర్లక్ష్యపు ధోరణే కనిపిస్తోందని, ఈ వివాదం ఎక్కడిదాకా వెళుతుందో తెలియడంలేదని అధికార యంత్రాంగం బెంబేలెత్తిపోతోంది.

Updated Date - 2020-05-27T09:37:03+05:30 IST