ఒక్కరోజు బడ్జెట్‌!

ABN , First Publish Date - 2021-05-19T09:10:11+05:30 IST

రాష్ట్ర శాసనసభలో గవర్నర్‌ ప్రసంగం, బడ్జెట్‌ ప్రవేశపెట్టడం.. ఆమోదించడం.. ఆనక నిరవధికంగా వాయిదాపడడం.. ఇవన్నీ ఒకే రోజు జరగనున్నాయి...

ఒక్కరోజు బడ్జెట్‌!

  • రేపే కేబినెట్‌ భేటీ, గవర్నర్‌ ప్రసంగం, అసెంబ్లీలో బడ్జెట్‌, ఆమోదం కూడా
  • వీలైతే కొన్ని బిల్లులకు ఆమోదముద్ర
  • బద్వేలు ఎమ్మెల్యే మృతికి సంతాపం
  • ఆ తర్వాత సభ నిరవధిక వాయిదా
  • మండలిలోనూ బడ్జెట్‌ ఆమోదం
  • ఆనక చైర్మన్‌ షరీ్‌ఫకు వీడ్కోలు


బడ్జెట్‌ సమావేశాలంటే... ఎంతో హడావుడి, అంతే ఆసక్తి! ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం, దానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై  రసవత్తర చర్చ, ఆపైన బడ్జెట్‌ ప్రవేశపెట్టడం, దానిపైనా వాడివేడి వాదనలు, చివరికి బడ్జెట్‌ ఆమోదం! వెరసి... సుదీర్ఘ కాలం సాగే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు! ఇప్పుడు... అదేమీ లేదు. గురువారం వర్చువల్‌గానే  ప్రసంగం... వెంటనే బడ్జెట్‌ ప్రవేశపెట్టి ఆమోదించడం... సభ వాయిదా!



అమరావతి, మే 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసనసభలో గవర్నర్‌ ప్రసంగం, బడ్జెట్‌ ప్రవేశపెట్టడం.. ఆమోదించడం.. ఆనక నిరవధికంగా వాయిదాపడడం.. ఇవన్నీ ఒకే రోజు జరగనున్నాయి. గురువారం ఉదయం 8.30 గంటలకు సచివాలయంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ సమావేశమవుతుంది. వార్షిక బడ్జెట్‌(2021-22)కు ఆమోదం తెలుపుతుంది. అనంతరం ఉదయం 11 గంటలకు శాసనసభ ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగిస్తారు. తర్వాత సభ కొద్దిసేపు వాయిదా పడుతుంది. తర్వాత సభాపతి తమ్మినేని సీతారాం అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం జరుగుతుంది. సభలో చేపట్టాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత సభలో బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. అసెంబ్లీ దానిని ఆమోదించగానే.. శాసనమండలి ఆమోదానికి పంపుతారు. శాసనసభలో వీలును బట్టి పలు బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అనంతరం కడప జిల్లా బద్వేలు వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతికి నివాళులు అర్పించాక.. శాసనసభ నిరవధికంగా వాయిదా పడుతుంది. అటు మండలిలోనూ బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారు. అనంతరం ఆంగ్ల మాధ్యమంపై ఉపసంఘం నివేదికను ప్రవేశ పెడతారు. మండలి చైర్మన్‌ షరీఫ్‌ ఈ నెలాఖరులో రిటైర్‌ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు గురువారమే వీడ్కోలు పలుకుతారు.


రెండో ఏడాదీ ఆన్‌లైన్లోనే గవర్నర్‌ ప్రసంగం

గవర్నర్‌ గురువారం ఉదయం శాసనసభ, శాసనమండలి సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాజ్‌భవన్‌ నుంచే వర్చువల్‌గా ప్రసంగిస్తారు. విశ్వభూషణ్‌ గవర్నర్‌గా నియమితులయ్యాక ఇప్పటివరకు శాసనసభలో అడుగుపెట్టలేదు. కొవిడ్‌ కారణంగా సందర్శించే అవకాశం రాలేదు. గత ఏడాది బడ్జెట్‌  సమావేశాల సందర్భంగా తొలి కరోనా వేవ్‌ రావడంతో అప్పుడు కూడా వర్చువల్‌గానే ప్రసంగించారు. ఇప్పుడూ సెకండ్‌ వేవ్‌ విజృంభణతో అదే పద్ధతి ఎంచుకున్నారు.


Updated Date - 2021-05-19T09:10:11+05:30 IST