వారం దాటినా.. అందని జీతాలు

ABN , First Publish Date - 2021-04-09T08:22:35+05:30 IST

ఏప్రిల్‌ నెలలో వారం రోజులు గడిచిపోయినా.. ఎక్సైజ్‌ శాఖలో 1500 మంది ఉద్యోగులకు ఇంకా జీతాలే రాలేదు. వేతనాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి...

వారం దాటినా.. అందని జీతాలు

  • ఎక్సైజ్‌ శాఖలో 1500 మంది నిరీక్షణ 
  • ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో ఆలస్యం
  • సీఎ్‌ఫఎంఎస్‌ మ్యాపింగ్‌లో జాప్యం
  • ప్రక్రియ పూర్తికి మరో 2, 3 రోజులు


అమరావతి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): ఏప్రిల్‌ నెలలో వారం రోజులు గడిచిపోయినా.. ఎక్సైజ్‌ శాఖలో 1500 మంది ఉద్యోగులకు ఇంకా జీతాలే  రాలేదు. వేతనాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. పదో తారీఖు వస్తున్నా జీతాలు ఎప్పుడొస్తాయో తెలియని అయోమయం. ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే ఉద్యోగులకు ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఎక్సైజ్‌ శాఖ నుంచి విడిపోయిన ఎస్‌ఈబీ ఉద్యోగులకు జీతాలు అందగా.. వీరు మాత్రం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎస్‌ఈబీ తీసుకున్న జాగ్రత్తలను ఎక్సైజ్‌ శాఖ అధికారులు పట్టించుకోకపోవడమే ఇందుకు కారణం. ఎక్సైజ్‌ శాఖ రెండుగా విడిపోయి ఎక్సైజ్‌ 30 శాతం, ఎస్‌ఈబీ 70 శాతం ఉద్యోగులను పంచుకున్న విషయం తెలిసిందే. ఎస్‌ఈబీ ఏర్పడి చాలాకాలం అయినా జీతాలు వేసే బాధ్యతను మొన్నటి వరకూ ఎక్సైజ్‌ శాఖే తీసుకుంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఎస్‌ఈబీ తన ఉద్యోగులకు విడిగా జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంది. ఇందుకోసం ఆ శాఖ అధికారులు వారి ఉద్యోగుల వివరాలను సీఎ్‌ఫఎంఎ్‌సలో కొత్తగా మ్యాపింగ్‌ చేశారు. మార్చి సగం నుంచే ఈ చర్యలు ప్రారంభించారు. దీంతో ఎక్సైజ్‌ ఉద్యోగులకు కూడా కొత్తగా మ్యాపింగ్‌ చేయాల్సిన అవసరం వచ్చింది. కాగా ఆ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తీరా నెలాఖరులో మ్యాపింగ్‌ హడావిడి చేశారు. ప్రక్రియ పూర్తికాకపోవడంతో జీతాలు ఆగిపోయాయి. ఈ ప్రక్రియ పూర్తవ్వడానికి రెండు మూడు రోజులు సమయం పట్టే అవకాశముంది. దీంతో సోమవారం అయినా జీతాలు చేతికి అందుతాయా? లేదా? అని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఎక్సైజ్‌ శాఖకు ప్రస్తుతం రెగ్యులర్‌ కమిషనర్‌ లేరు. ఆ శాఖ స్పెషల్‌ సీఎ్‌సయే ఆ బాధ్యతలు చూస్తున్నారు. కమిషనర్‌ తర్వాతి స్థాయి అధికారులు జీతాల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కింది స్థాయి ఉద్యోగులు పైఅధికారులను అప్రమత్తం చేసే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదని తెలిసింది. ఫలితంగా 1500 మంది ఉద్యోగులు జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఎక్సైజ్‌ శాఖ  విభజన తర్వాత ఎస్‌ఈబీ అధికారులు, ఉద్యోగులపై పనిభారం ఎక్కువగా పడింది. 


Updated Date - 2021-04-09T08:22:35+05:30 IST