జగన్ 11 కేసుల ఉపసంహరణపై హైకోర్టులో విచారణ..

ABN , First Publish Date - 2021-06-25T19:58:22+05:30 IST

జగన్మోహన్ రెడ్డి 11 కేసుల ఉపసంహరణకు సంబంధించి శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది.

జగన్ 11 కేసుల ఉపసంహరణపై హైకోర్టులో విచారణ..

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 11 కేసుల ఉపసంహరణకు సంబంధించి శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నివేదిక అందించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. కమిటీ నివేదికను పరిశీలించిన తర్వాతే ఉత్తర్వులు జారీ చేస్తామని న్యాయస్థానం పేర్కొంది.


టీడీపీ ప్రభుత్వ హయాంలో అనంతపురం, గుంటూరు జిల్లాల్లో జగన్‌పై నమోదైన 11 కేసులను విత్ డ్రా చేసుకున్నారని, నిబంధనలకు విరుద్ధంగా కరోనా లాక్ డౌన్ సమయంలో ఈ కేసులు విత్ డ్రా చేసుకున్నారని వచ్చిన ఫిర్యాదులపై  హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరిపింది. దీనిపై బుధవారం (ఈనెల 23న) విచారణ జరిగింది. ప్రతివాదులు ఉన్నవారికి నోటీసులు ఇస్తామని న్యాయస్థానం పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ శ్రీరామ సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకుని ఈ కేసులకు సంబంధించి నోటీసులు ఇవ్వడానికి వీల్లేదని అన్నారు. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ఇచ్చిన నివేదికను న్యాయపరమైన అంశాలుగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించారు.  క్రిమినల్ రివిజన్ పిటిషన్‌ను సుమోటోగా హైకోర్టు తీసుకోవడం దేశంలోనే అరుదైనదని ఏజీ అన్నారు. ఈ నేపథ్యంలో కేసు విచారణను హైకోర్టు శుక్రవారం నాటికి వాయిదా వేసింది.


అవినీతి, అక్రమాస్తుల కేసులు కాకుండా... జగన్‌పై రాష్ట్రవ్యాప్తంగా అనేక కేసులు నమోదయ్యాయి. ఉదాహరణకు... విపక్షంలో ఉండగా కృష్ణా జిల్లా నందిగామలో రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్‌ అప్పట్లో పోలీసు ఆంక్షలను ఉల్లంఘించారు. ఆస్పత్రిలోకి దూసుకెళ్లి... డాక్టర్ల చేతిలోని పత్రాలను లాక్కున్నారు. అప్పటి కలెక్టర్‌ అహ్మద్‌బాబును దుర్భాషలాడినట్లు జగన్‌పై కేసు నమోదైంది. జగన్‌ ముఖ్యమంత్రి కాగానే... ఆ కేసును ఎత్తివేశారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే సామినేని ఉదయభానులతో సహా దాదాపు అన్ని జిల్లాల్లో అనేక మంది అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న కేసులను ఉపసంహరింపచేశారు.


ఇందులో కొన్నింటిని జీవోలు జారీ చేసి ‘క్లోజ్‌’ చేయగా... మరికొన్నింటిని స్థానిక పోలీసు అధికారులే (ఎస్‌హెచ్‌వో) మూసివేశారు. జగన్‌పై నమోదైన పలు కేసుల్లో దిగువ కోర్టులు కేసు మెరిట్‌ను పరిశీలించకుండా, సరైన విధివిధానాలను పాటించకుండా ‘క్లోజ్‌’ చేసినట్లు హైకోర్టుకు ఫిర్యాదులు వచ్చాయి. ఇలా దిగువ కోర్టులపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించడానికి హైకోర్టులో ఒక ఉన్నతస్థాయి కమిటీ ఉంటుంది. జగన్‌పై ఎడాపెడా కేసులు ఎత్తివేశారంటూ అందిన ఫిర్యాదులను ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి... హైకోర్టుకు ఒక నివేదిక సమర్పించింది. ఈ 11 కేసుల్లో తొలి ప్రతివాదిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రెండో ప్రతివాదిగా ఎస్‌హెచ్‌వోని చేర్చారు. మూడో ప్రతివాదిగా ఒక్కో కేసులో ఒక్కొక్కరు (ఫిర్యాదుదారులు) ఉన్నారు. అన్ని కేసుల్లోనూ నాలుగో ప్రతివాదిగా జగన్‌ పేరే ఉంది.

Updated Date - 2021-06-25T19:58:22+05:30 IST