ఏపీ రాజధాని కేసుల విచారణ వాయిదా

ABN , First Publish Date - 2021-08-23T18:41:55+05:30 IST

ఏపీ రాజధాని కేసుల విచారణను నవంబర్ 15కు హైకోర్టు వాయిదా వేసింది.

ఏపీ రాజధాని కేసుల విచారణ వాయిదా

అమరావతి: ఏపీ రాజధాని కేసుల విచారణను నవంబర్ 15కు హైకోర్టు వాయిదా వేసింది. చీఫ్ జస్టీస్ అరూప్ కుమార్ గోస్వామి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం  ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సీఆర్డీయే రద్దు, అధికార వికేంద్రీకరణ చట్టాలను సవాల్ చేస్తూ గతంలో పిటిషన్లు దాఖలయ్యాయి. మూడు రాజధానుల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా పదుల సంఖ్యలో రైతులు, ఇతర పక్షాలు పిటిషన్లు వేశాయి. కోవిడ్ కారణంగా విచారణ వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో మళ్లీ విచారణ మొదలైంది.


గతంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్ర కుమార్ మహేశ్వరీ ఆధ్వర్యంలో త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుల విచారణ ప్రారంభించింది. దాదాపు 70 శాతం వరకు వాదనలు జరిగాయి. అటు రైతులు, ఇటు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ క్రమంలో జస్టిస్ మహేశ్వరీ బదిలీ కావడంతో కొత్తగా వచ్చిన న్యాయమూర్తి గోస్వామి ఈ కేసుల విచారణ చేపట్టారు.


ఏప్రిల్‌లో కేసుల విచారణకు న్యాయస్థానం సిద్ధమైనప్పటికీ.. కరోనా నేపథ్యంలో ఢిల్లీ నుంచి  న్యాయవాదులు రావడం ఇబ్బందనే ఉద్దేశంతో విచారణ వాయిదా వేశారు. అయితే రాష్ట్ర హైకోర్టులో కేసుల విచారణ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో జరుగుతోంది. సోమవారం విచారణ ప్రారంభమైంది. అయితే కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విచారణ వాయిదా వేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. కాగా కోర్టు నిర్ణయానికే వదిలివేస్తున్నట్లు ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. దీంతో విచారణను నవంబర్ 15 నాటికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

Updated Date - 2021-08-23T18:41:55+05:30 IST