సీట్ల భర్తీకి ఓకే

ABN , First Publish Date - 2021-11-12T17:01:59+05:30 IST

ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా కింద ఉన్న 70శాతం సీట్ల కేటాయింపునకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. యాజమాన్య కోటా కింద ఉన్న 30 శాతం సీట్ల విషయంలోనే మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి సంబంధించి..

సీట్ల భర్తీకి ఓకే

ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో కన్వీనర్‌ సీట్ల భర్తీకి ఓకే

మధ్యంతర ఉత్తర్వులను సవరించిన హైకోర్టు

యాజమాన్య కోటా సీట్లకే ఆ ఉత్తర్వులు పరిమితం

జీవో 55పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వు

ప్రపంచమంతా ప్రైవేటీకరణ జరుగుతుంటే రాష్ట్రానిది ప్రభుత్వీకరణా?: బెంచ్‌


అమరావతి(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా కింద ఉన్న 70శాతం సీట్ల కేటాయింపునకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. యాజమాన్య కోటా కింద ఉన్న 30 శాతం సీట్ల విషయంలోనే మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో.55ని సవాల్‌చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది.


ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో సీట్లను కన్వీనర్‌ ద్వారా భర్తీ చేసేందుకు వీలుకల్పిస్తూ... అక్టోబరు 7న ప్రభుత్వం జీవో 55 జారీచేసింది. దీనిని సవాల్‌ చేస్తూ రాయలసీమ డిగ్రీ కాలేజీల అసోసియేషన్‌ వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకురాగా వెబ్‌ ఆప్షన్‌ ద్వారా కళాశాలల ఎంపిక ప్రక్రియను కొనసాగించేందుకు అనుమతిస్తూ సీట్ల కేటాయింపును నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. జీవో 55ని సవాల్‌ చేస్తూ మాల మహానాడు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుర్రం రామారావు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు గురువారం విచారణకు వచ్చాయి. రాయలసీమ డిగ్రీ కాలేజీల అసోసియేషన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలువినిపిస్తూ యాజమాన్య కోటా సీట్లను కన్వీనర్‌ ఆధ్వర్యంలో భర్తీ చేస్తామనడం సరికాదన్నారు. యాజమాన్యాలు సీట్లు భర్తీ చేసుకోకుండా జీవోలోని రూల్‌-3(సి) నిలువరిస్తుందన్నారు. ప్రైవేటు కాలేజీల యా జమాన్యాల హక్కులను ప్రభుత్వం హరిస్తోందని తెలిపారు.


70శాతం సీట్ల భర్తీ విషయంలో తమకు అభ్యంతరం లేదని, కోర్టు మధ్యంతర ఉత్తర్వుల వల్ల మొత్తం సీట్ల కేటాయింపు నిలిచిపోయిందని తెలిపారు. ఈ వ్యాజ్యాలలో అత్యవసరంగా నిర్ణయాన్ని వెల్లడించాలని కోరారు. మాల మహానాడు ఐక్యవేదిక తరఫున సీనియర్‌ న్యాయవాది వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులతో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు నష్టపోతారన్నారు. 30శాతం సీట్లను యాజమాన్య కోటా కింద భర్తీ చేయడానికి వీల్లేదన్నారు. యాజమాన్య కోటా కింద సీటు పొందిన విద్యార్థి మూడొంతులు ఎక్కవ ఫీజు చెల్లించాల్సి ఉం టుందన్నారు. వీరికి ప్రభుత్వ పథకాలు అమలు కావని తెలిపారు. ఉపకార వేతనాలు చెల్లించకుండా తప్పించుకొనేందుకే రాష్ట్ర ప్రభుత్వం 30శాతం సీట్లను యాజమాన్య కోటా కింద కేటాయించిందన్నారు. ఉన్నత విద్యశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది రఘువీర్‌, ఉన్నత విద్యామండలి తరఫున న్యాయవాది సుదేశ్‌ ఆనంద్‌ వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యాజ్యాలకు విచారణార్హత లేదన్నారు.


ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కాలేజీ యాజమాన్యాలు కోర్టుకు రాలేదన్నారు. ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లోని యాజమాన్య కోటా సీట్ల భర్తీ విషయంలో కన్వీనర్‌ జోక్యం చేసుకోరని తెలిపారు. విద్యార్థులకు యాజమా న్య కోటా సీట్లు ఎంపిక చేసుకొనేందుకు వెసులుబాటు మాత్రమే కల్పిస్తామని, పేద విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదని చెప్పారు. సీట్ల భర్తీలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 2.13 లక్షల మంది వి ద్యార్థులు వెబ్‌ ఆప్షన్‌ ద్వారా కళాశాలలను ఎంపిక చేసుకున్నారని తెలిపారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వుల వల్ల సీట్ల కేటాయింపు నిలిచిపోయిందన్నారు. కన్వీనర్‌ కోటా సీట్ల కేటాయింపునకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం.. తీర్పును రిజర్వు చేసింది.


రాష్ట్రానిది ప్రభుత్వీకరణ మార్గమా?

ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి సంబంధించిన వ్యాజ్యం విచారణ సందర్భంగా ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ప్రైవేటు ఎయిడెడ్‌ పాఠశాలలు, కాలేజీలను ఆధీనంలోకి తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆన్‌లైన్‌ అడ్మిషన్ల పేరుతో ప్రైవేటు డిగ్రీ కాలేజీలను కూడా ఆధీనంలోకి తీసుకొనేందుకు ప్రయత్నిస్తోందా?’అని ప్రశ్నించింది. రాబోయే రోజుల్లో 9-12 తరగతులకు కూడా ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ విధానాన్ని తీసుకొచ్చి...అక్కడా యాజమాన్య కోటా ప్రవేశపెట్టి ప్రభుత్వ పథకాల అమలును నిలిపివేస్తారా? అని అడిగింది. విద్యార్థులకు అందిస్తున్న ఉపకార వేతనాలు, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాల భారాన్ని తగ్గించుకొనేందుకే డిగ్రీ ప్రవేశాల్లో కన్వీనర్‌ కోటా, యాజమాన్య కోటా విధానాన్ని తీసుకొచ్చినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. యాజమాన్య కోటాలో సీట్లు పొందిన విద్యార్థులకు ప్రభుత్వ పథకాలు నిలిపివేయడం సరికాదని పేర్కొంది. ప్రపంచం మొత్తం ప్రైవేటీకరణ జరుగుతుంటే.. .రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వీకరణ (గవర్నమెంటైజేషన్‌) జరుగుతోందని వ్యాఖ్యానించింది.

Updated Date - 2021-11-12T17:01:59+05:30 IST