రాజధాని కేసులు : గెజిట్‌ నోటిఫికేషన్‌ వచ్చాకే విచారణ.. : త్రిసభ్య ధర్మాసనం

ABN , First Publish Date - 2021-11-29T18:50:06+05:30 IST

నవ్యాంధ్ర రాజధానిపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది...

రాజధాని కేసులు : గెజిట్‌ నోటిఫికేషన్‌ వచ్చాకే విచారణ.. : త్రిసభ్య ధర్మాసనం

అమరావతి : నవ్యాంధ్ర రాజధానిపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. రెండు చట్టాల ఉపసంహరణపై ఇప్పటికే ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపింది. త్రిసభ్య ధర్మాసనం దీనిపై సుమారు అరగంటకుపైగా విచారించింది. పిటిషన్ల తరపున న్యాయవాదులు శ్యామ్‌దివాన్‌, సురేష్‌ వాదనలు వినిపించారు. ఉపసంహరణ బిల్లుల్లో కూడా ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులను తీసుకువస్తామని చెప్పిందన్నారు. ఏపీకి అమరావతి మాత్రమే రాజధాని అని.. మాస్టర్‌ ప్లాన్‌ కూడా అదే చెబుతోందని పిటిషనర్‌ తరపు లాయర్లు కోర్టుకు వినిపించారు. అందువల్ల ఈ పిటిషన్లపై విచారణ కొనసాగించాలేమని లాయర్లు శ్యామ్‌దివాన్‌, సురేష్‌ వెల్లడించారు.


మరోవైపు.. బిల్లులపై గవర్నర్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వలేదని.. అందుకే గెజిట్‌ నోటిఫికేషన్‌ వచ్చాక విచారణ జరుపుతామని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. రాజధాని కేసుల విచారణ కారణంగా చట్టానికి లోబడి అభివృద్ధి చేసుకునేందుకు అడ్డంకిగా ఉన్న మధ్యంతర ఉత్తర్వులను తొలగిస్తున్నట్లు ధర్మాసనం తేల్చిచెప్పింది. మరోవైపు.. ప్రభుత్వ శాఖలు, కార్యాలయాల తరలింపుపై మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ వచ్చే నెల 27కు ధర్మాసనం వాయిదా వేసింది.

Updated Date - 2021-11-29T18:50:06+05:30 IST