‘వకీల్‌ సాబ్‌’ సినిమాపై సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వును సవరించిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌

అమరావతి: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్‌ సాబ్’‌ సినిమా టికెట్‌ రేట్ల పెంపుపై సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వును  హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సవరించింది. టికెట్ ధరలు కేవలం ఈ రోజు(శనివారం) వరకే అమలు చేయాలని డివిజన్‌ బెంచ్‌ అభిప్రాయపడింది. రేపటి(ఆదివారం) నుంచి ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ధరలు ఉంటాయని డివిజన్‌ బెంచ్‌ పేర్కొంది. ఆన్‌లైన్‌లో బుక్‌ అయిన టికెట్ల విషయంలో రేపటి(ఆదివారం) షోల వరకు హైకోర్టు వెసులుబాటు కల్పించింది. అంతకుముందు ‘వకిల్ సాబ్’ సినిమా టికెట్లకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమానులు ఏపీ హైకోర్టు‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే వారికి సానుకూలంగా తీర్పును ఇస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. మూడు రోజుల పాటు టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చంటూ సింగిల్ జడ్జి తీర్పు నిచ్చారు. ఏపీలోని 13 జిల్లాల జాయింట్ కలెక్టర్స్‌కు, అలాగే ఏపీ ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్‌ బెంచ్‌లో ప్రభుత్వం హౌస్‌మోషన్‌‌లో పిటిషన్‌ వేసింది. 

అసలేం జరిగింది:

పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘వకీల్‌సాబ్‌’ చిత్రంపై రాజకీయ క్రీనీడ పడింది. కొత్త చిత్రాల విడుదల సమయంలో ఇప్పటి వరకు కొనసాగిన సంప్రదాయానికి జగన్‌ ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలూ ఇవ్వకుండానే బ్రేకులు వేసింది. కొత్త చిత్రాలు విడుదలైనప్పుడు వారం రోజుల వరకు టికెట్‌ ధరలు పెంచుకునే వెసులుబాటు ఉంది. ప్రముఖ హీరోల చిత్రాలకు ప్రీమియర్‌ షోలు కూడా ప్రదర్శించే అవకాశమూ ఉంది. అన్ని చిత్రాల మాదిరిగానే దీనికీ బెనిఫిట్‌ షో, ధరల పెంపునకు అనుమతి ఉంటుందని ఎగ్జిబిటర్లు భావించారు. కొంతమంది ఏడో తేదీన ప్రీమియర్‌ షోల టికెట్లను పలు థియేటర్లలో విక్రయించారు. ఈ నేపథ్యంలో రాత్రికే రాత్రే బెనిఫిట్ షోలు వేయకూడదని, టికెట్స్ రేట్స్ పెంచకూడదని ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవోని అతిక్రమించి అధిక ధరలకు టికెట్లు విక్రయించినా, బెనిఫిట్ షోలు ప్రదర్శించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో మెగాభిమానులు ప్రభుత్వంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం తీరుకు నిరసిస్తూ.. డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమానులు ఏపీ హైకోర్టు‌ను ఆశ్రయించగా సింగిల్ బెంచ్ మూడు రోజుల వరకు టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చంటూ ఉత్వర్తులు జారీ చేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం మళ్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

Advertisement