పార్లమెంట్‌లో ఏపీ...

ABN , First Publish Date - 2021-07-31T09:13:43+05:30 IST

సర్టిఫైడ్‌ సేంద్రియ వ్యవసాయంలో ప్రపంచంలోనే భారత్‌ అగ్రస్థానంలో ఉందని, అత్యధిక సేంద్రియ సాగు రైతులు మన దేశంలోనే ఉన్నారని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వెల్లడించారు

పార్లమెంట్‌లో ఏపీ...

సేంద్రియ సాగులో భారత్‌ అగ్రస్థానం


న్యూఢిల్లీ, జూలై 30(ఆంధ్రజ్యోతి): సర్టిఫైడ్‌ సేంద్రియ వ్యవసాయంలో ప్రపంచంలోనే భారత్‌ అగ్రస్థానంలో ఉందని, అత్యధిక సేంద్రియ సాగు రైతులు మన దేశంలోనే ఉన్నారని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వెల్లడించారు. శుక్రవారం రాజ్యసభలో వైసీపీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. పంటల సాగు విస్తీర్ణంలో ఐదోస్థానంలో ఉన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2015-16 నుంచి సేంద్రియ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున ్నట్లు తెలిపారు.  


ఈ-కామర్స్‌ కంపెనీల దూకుడుకు కళ్లెం

దేశంలో ఈ కామర్స్‌ కంపెనీల అనుచిత వ్యాపార విధానాలకు కళ్లెం వేయడానికి వినియోగదారుల సంరక్షణ నిబంధనలను మరింత కఠిన తరం చేయబోతున్నట్లు కేంద్ర వాణిజ్యశాఖ సహాయ మంత్రి సోమ్‌ ప్రకాశ్‌ వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు లిఖిత పూర్వకంగా జ వాబిచ్చారు. అసాధారణ డిస్కౌంట్లు, అత్యంత తక్కువ రేట్లకు ఆన్‌లైన్‌లో ఉత్పత్తులు పెట్టడం ద్వారా మార్కెట్‌పై సాధించిన ఆధిపత్యాన్ని ఈ-కామర్స్‌ కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని మంత్రి తెలిపారు. 


ఉచితంగా 8లక్షల టన్నుల ఆహారధాన్యాలు

ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకం కింద గత ఏడాది మే, జూన్‌ నెలల్లో కరోనా కారణంగా వలస కార్మికులు, రేషన్‌ కార్డులు లేనివారికి 8లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేసినట్లు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు లిఖిత పూర్వకంగా జవాబిచ్చారు.


పీఎంకేఎంవై పింఛన్లకు 31.8 లక్షల రిజిస్ర్టేషన్లు

ప్రధాన మంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన(పీఎం-కేఎంవై) పథకం కింద పింఛను లబ్ధిపొందడానికి ఏపీ నుంచి 31,861మంది, తెలంగాణలో 9,048మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వెల్లడించారు. శుక్రవారం రాజ్యసభలో బీజేపీ సభ్యుడు వైఎస్‌ సుజనా చౌదరి అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. దేశవ్యాప్తంగా రైతుల పేర్ల నమోదు ప్రక్రియ జరుగుతోందని, ఈ నెల 27 వరకు 21,40,650 మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు.


సెప్టెంబరులో మంగళగిరి ఎయిమ్స్‌ పూర్తి: కేంద్రం

ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్‌ నిర్మాణ ప్రాజెక్టును ఈ ఏడాది సెప్టెంబరులోగా పూర్తి చేయడానికి కాలవ్యవధిని సవరించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ వెల్లడించారు. ఈ మేరకు లోక్‌సభలో వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి శుక్రవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మొదటి దశలో చేపడుతున్న ఓపీడీ బ్లాక్‌, హాస్టళ్లతో సహా నివాస సముదాయం పనులు 99 శాతం పూర్తయ్యాయని, రెండో దశలో చేపడుతున్న ఆస్పత్రి, అకాడమిక్‌ క్యాంపస్‌ నిర్మాణ పనులు 71 శాతం పూర్తయ్యాయని వివరించారు.


కరోనా వల్ల అనాథలుగా 119 మంది పిల్లలు

కరోనా వల్ల తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలు ఆంధ్రప్రదేశ్‌లో 119 మంది ఉన్నారని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ స్మృతి ఇరానీ లోక్‌సభకు తెలిపారు. ఈ సంఖ్య అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 158 మం ది కాగా, ఏపీ రెండో స్థానంలో ఉండడం గమనార్హం. తెలంగాణలో 23 మంది పిల్లలు అనాథలవ్వగా, దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 645 ఉన్నట్లు తెలిపారు.

Updated Date - 2021-07-31T09:13:43+05:30 IST