ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలాంటి దుర్మార్గం పీఆర్సీ చూడలేదు: బొప్పరాజు

ABN , First Publish Date - 2022-01-18T19:34:20+05:30 IST

11వ పీఆర్సీకి సంబంధించి అశాస్త్రీయంగా ఇచ్చిన జీవోను వ్యతిరేకిస్తున్నామని ఏపీ జేఏసీ నేత బొప్పరాజు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలాంటి దుర్మార్గం పీఆర్సీ చూడలేదు: బొప్పరాజు

విజయవాడ: 11వ పీఆర్సీకి సంబంధించి అశాస్త్రీయంగా ఇచ్చిన జీవోను వ్యతిరేకిస్తున్నామని, నిన్నటి రోజును ఉద్యోగులు, ఉపాధ్యాయలకు చీకటి దినంగా భావిస్తున్నామని ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలాంటి దుర్మార్గం పీఆర్సీ చూడలేదన్నారు. ఎవరితో చర్చలు జరపకుండా ఈ విధమైన జీవో ఇవ్వడం సరికాదన్నారు. సీఎం జగన్ ఫిట్ మెంట్ ప్రకటించి, సీయస్‌తో ఇతర అంశాలు మాట్లాడాలని చెప్పి వెళ్లిపోయారని, ఈ కొత్త మెలికలు లేకుండా మిశ్రా ప్రతిపాదనలు అమలు చేయాలి కానీ అధికారుల కమిటీ చెప్పిన విధంగా ప్రభుత్వం నిర్ణయం చేయడం అన్యాయమన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన రాయతీలు రద్దు చేయడం ఒక రికార్డు అని, గతంలో ఎవ్వరూ ఇలా రద్దు చేసిన దాఖలాలు లేవన్నారు. కేంద్రం పేరు చెప్పి కొత్త నిబంధనలు అమల్లోకి ఎలా తెస్తారని ఆయన ప్రశ్నించారు. 11వ పీఆర్సీ అమలుకు..‌ కేంద్రం విధానాలకు ఎలా ముడి పెడతారన్నారు. 


డిఏలను అడ్డు పెట్టుకుని పీఆర్సీ ప్రకటించారని, ఈ పీఆర్సీని వ్యతిరేకిస్తూ, జీవోలను రద్దు‌ చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని బొప్పరాజు స్పష్టం చేశారు. ఉద్యోగుల హక్కులకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఇరు జేఏసీల పక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాయన్నారు. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు అందరూ ఈ పోరాటంలో పాల్గొంటారని, ప్రజలకు జరగబోయే అసౌకర్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. సూపరింటెండెంట్ స్థాయి వ్యక్తికి రూ. 49వేలు వస్తే... కొత్త పీఆర్సీ ప్రకారం రూ. 47వేలే వస్తాయన్నారు. ఇలా ప్రతి క్యాడర్‌లో ఉద్యోగులు నష్టపోతారన్నారు. ఆనాడు సీఎం ఫిట్మెంట్ ఒక్కటే ప్రకటించి.. మిగతా అంశాలను సీయస్‌తో మాట్లాడమన్నారు కానీ తర్వాత ఎవరూ తమతో చర్చలు జరపలేదన్నారు. గురువారం సమావేశం ఏర్పాటు చేసి.. జేఏసీ నేతలతో చర్చించి పోరాటాన్ని ప్రకటిస్తామని బొప్పరాజు స్పష్టం చేశారు.

Updated Date - 2022-01-18T19:34:20+05:30 IST