బస్సుల రాకపోకలు, భారీ జరిమానాలపై మంత్రి నాని స్పందన

ABN , First Publish Date - 2020-10-24T17:29:15+05:30 IST

టాలీవుడ్ హీరో మహేశ్‌బాబు నటించిన ‘భరత్‌ అనే నేను’ సినిమాలో వాహనదారులకు

బస్సుల రాకపోకలు, భారీ జరిమానాలపై మంత్రి నాని స్పందన

అమరావతి : టాలీవుడ్ హీరో మహేశ్‌బాబు నటించిన ‘భరత్‌ అనే నేను’ సినిమాలో వాహనదారులకు సీఎం భరత్‌ విధించే జరిమానాలు గుర్తుకు తెచ్చే విధంగా ఏపీలో జగన్ సర్కార్ దిమ్మతిరిగే రీతిలో ఫైన్లు ఖరారుచేస్తూ ఉత్తర్వులు జారీచేసిన విషయం విదితమే. మోటార్‌ వాహనాల నిబంధనలను ఉల్లంఘించినవారికి విధించే జరిమానాలను భారీగా పెంచింది. మోటార్‌ సైకిళ్లు, సెవెన్‌ సీటర్‌ కార్ల వరకు ఒక కేటగిరీగా, భారీ వాహనాలు మరో కేటగిరీగా వాహన జరిమానాలు సవరిస్తూ ఇటీవలే ఆదేశాలిచ్చింది. ఈ భారీ జరిమానాలపై పలు యూనియన్లు, ప్రతిపక్షాల నుంచి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విమర్శలపై తాజాగా రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఇవాళ మీడియా ముందుకొచ్చిన ఆయన జరిమానాలు, తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు రాకపోకలపై మరోసారి క్లారిటీగా వివరించారు.


సరిహద్దుల వద్దే బస్సులు!

ట్రాఫిక్ జరిమానాల పెంపుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారిపై చర్యలు తప్పవు. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ చెక్‌పోస్టుల దగ్గర ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశాం. పంచలింగాల, గరికపాడు చెక్‌పోస్టు వద్ద ఏపీ బస్సులు ఉంటాయి. వాడపల్లి, పైలాన్, జీలుగుమిల్లి, కల్లుగూడెం చెక్‌పోస్టుల వద్ద ఏపీ బస్సులు అందుబాటులో ఉంచాము. సరిహద్దు వద్దకు వస్తే చెక్‌పోస్టుల వద్ద విరివిగా ఏపీ బస్సులు దొరుకుతాయి. రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందానికి తీవ్రంగా ప్రయత్నించాం. జూన్ 18 నుంచి తెలంగాణ అధికారులతో ఏపీ అధికారులు చర్చిస్తున్నారు. కర్ణాటక, తమిళనాడుకు బస్సులను పునరుద్ధరించాం. టీఎస్ఆర్టీసీకి సెలవులు కారణంగా జాప్యం జరిగింది’ అని మంత్రి నాని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో ఆటో డ్రైవర్లు, వాహనదారులు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో  ధర్నా నిర్వహించారు. మోటార్ వాహనాల నిబంధనల ఉల్లంఘన పేరుతో విపరీతంగా పెంచిన ఫైన్లను ఆపాలని.. జీవో నెంబర్ 21 రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2020-10-24T17:29:15+05:30 IST