అగ్రరాజ్యంతో ‘ఉన్నత విద్య’ ఒప్పందం

ABN , First Publish Date - 2020-08-13T07:25:04+05:30 IST

అగ్రరాజ్యంతో ‘ఉన్నత విద్య’ ఒప్పందం

అగ్రరాజ్యంతో ‘ఉన్నత విద్య’ ఒప్పందం

బ్లాక్‌ చైన్‌, కృత్రిమ మేథలో పరిశోధనలు

రూ.32 లక్షలు మంజూరు చేసిన అమెరికా

చేతులు కలిపిన జేఎన్‌టీయూకే, మిస్సోరి వర్సిటీ 

విదేశాల నుంచి మన విద్యార్థులకు ఫెలోషిప్స్‌

మున్ముందు మరిన్ని వర్సిటీలతో ఒప్పందాలు

‘ఆంధ్రజ్యోతి’తో అమెరికాలోని ఏపీ ఉన్నత విద్య

కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ కుమార్‌ అన్నవరపు వెల్లడి


అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యకు సంబంధించి కీలకమైన రంగాల్లో పరిశోధనలు, అధ్యయనం కోసం రాష్ట్రంలోని జేఎన్‌టీయూ కాకినాడ అమెరికాలోని మిస్సోరి యూనివర్సిటీతో ఒప్పందం చేసుకుంది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న బ్లాక్‌ చైన్‌, కృత్రిమ మేథ(ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌) రంగాల్లో ఈ రెండు విద్యా సంస్థలు పరిశోధనలు చేయనున్నాయి. దీనికిగాను అమెరికా రూ.32,88,560 (44 వేల డాలర్లు)లను రాష్ట్రానికి మంజూరు చేసింది. ఈ నిధులతో జేఎన్‌టీయూ కాకినాడతో కలిసి సంయుక్తంగా పరిశోధనలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అమెరికాలోని ప్రతిష్ఠాత్మక మిస్సోరి విశ్వవిద్యాలయం.. జేఎన్‌టీయూ కాకినాడతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఉన్నతవిద్యకు అంతర్జాతీయ గుర్తింపు కల్పించే ప్రయత్నాల్లో భాగంగా మిస్సోరి వర్సిటీతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయని అమెరికాలోని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్య కోఆర్డినేటర్‌ డాక్టర్‌ కుమార్‌ అన్నవరపు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం.. ఈ రెండు సంస్థల అధ్యాపకులు, విద్యార్థులు సంయుక్త పరిశోధనలు చేయనున్నారు. జేఎన్‌టీయూకే ప్రొఫెసర్లు, విద్యార్థులు మిస్సోరి వర్సిటీకి వెళ్లి, అక్కడి ప్రొఫెసర్లు ఇక్కడికి వచ్చి పరిశోధనల్లో పాలుపంచుకుంటారు.  ఈ పరిశోధనలు ఏడాదిపాటు జరగనున్నాయి. పరిశోధనా ఫలితాలను సమీక్షించుకున్న తర్వాత ఈ ఒప్పందాన్ని మున్ముందు కొనసాగించనున్నారు. ఇలా ఐదేళ్లపాటు పరిశోధనల కోసం అమెరికా నుంచి నిధులు అందనున్నాయి. అదేవిధంగా బిగ్‌ డేటా, డేటా మైనింగ్‌లో భద్రతకు సంబంధించి ఎదురవుతున్న సవాళ్లు, వాటిని ఎలా ఎదుర్కోవాలన్న అంశాలపై పరిశోధనలు సాగుతాయి. మిస్సోరి విశ్వవిద్యాలయం ఈ ఏడాది దక్షిణ భారతదేశం నుంచి ఒకే ఒక విశ్వవిద్యాలయం..అదీ రాష్ట్రంలోని జేఎన్‌టీయూకేతో ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. 


ఉన్నత విద్యకు అందలం

రాష్ట్రంలో ఉన్నత విద్యా రంగానికి అంతర్జాతీయంగా గుర్తింపు, ప్రాచుర్యం కల్పించేదిశగా సర్కారు దృష్టి సారించిందని కుమార్‌ అన్నవరపు చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడంతో పాటు మన విద్యార్థులకు విదేశీ విద్యను సులభంగా అందించే ప్రయత్నం చేయడం, వారికి ఫెలోషిప్పులు ఇచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ ఒప్పందాల వల్ల రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకే కాకుండా మన విద్యార్థులకు కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ట్రిన్నింగ్‌ ప్రోగ్రామ్‌ కింద ఏపీ విద్యార్థులు రెండేళ్లు విదేశీ వర్సిటీల్లో చదువుకునే సౌలభ్యం కలుగుతుంది.  


మరిన్ని వర్సిటీల ఆసక్తి

రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలతో సంయుక్త పరిశోధనలు, ఇతర సహకార భాగస్వామ్యం కుదుర్చుకోడానికి ప్రపంచంలోని పలు వర్సిటీలు ఆసక్తి చూపుతున్నాయని డాక్టర్‌ కుమార్‌ అన్నవరపు తెలిపారు. అమెరికాలో దాదాపు 4,800 విశ్వవిద్యాలయాలు ఉండగా.. వీటిలో ఇప్పటికే 36 వర్సిటీలు రాష్ట్రంలోని వర్సిటీలతో కలిసి పనిచేయడానికి సిద్ధమవుతున్నట్టు చెప్పారు. త్వరలోనే ఆయా వర్సిటీలతోనూ ఒప్పందం కుదరనుంది. ఆస్ట్రేలియా, సింగపూర్‌, కొరియా తదితర దేశాలకు చెందిన పలు విశ్వవిద్యాలయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నాయి.

Updated Date - 2020-08-13T07:25:04+05:30 IST