స్మార్ట్‌ టీవీల కొను‘గోల్‌’మాల్‌!

ABN , First Publish Date - 2020-08-13T07:26:16+05:30 IST

స్మార్ట్‌ టీవీల కొను‘గోల్‌’మాల్‌!

స్మార్ట్‌ టీవీల కొను‘గోల్‌’మాల్‌!

చైనా కంపెనీ టీసీఎల్‌పై మక్కువ 

బ్రాండెడ్‌ సంస్థలు పట్టని సర్కారు

టెండర్ల ప్రక్రియ నుంచే అక్రమాలు 

‘రిటైల్‌’ కంటే అధిక ధరకు ఆర్డర్‌ 

రివర్స్‌ టెండరింగ్‌ రద్దుకు ఎత్తులు 

సమగ్ర శిక్ష కార్యాలయంలో స్కెచ్‌ 

10 వేల బడుల్లో 3నెలల్లో ఏర్పాటు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

లద్దాఖ్‌ ఘర్షణల తర్వాత చైనాకు చెందిన 59 యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే ఏసీలు, టీవీలు సహా 12 రకాల వస్తువులను నియంత్రించేందుకు చర్యలు ప్రారంభించింది. చైనా దురాక్రమణపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత పెల్లుబుకుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ దేశానికి చెందిన కంపెనీపై అలవిమాలిన ప్రేమను కురిపిస్తోంది. చైనా కంపెనీ టీసీఎల్‌ నుంచి రూ.45 కోట్ల విలువైన స్మార్ట్‌టీవీలు కొనేందుకు సిద్ధమైంది. సర్కారీ బడులకు సరఫరా చేయనున్న స్మార్ట్‌ టీవీల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందస్తు స్కెచ్‌ కు అనుగుణంగానే టెండర్ల ప్రక్రియ నడిచినట్లు సమాచారం. బ్రాండెడ్‌ కంపెనీలను కాదని చైనాకు చెందిన టీసీఎల్‌ కంపెనీపై మక్కువ చూపడం వెనుక ముడుపులే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టెండర్‌ డాక్యుమెంట్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్‌ రూపకల్పన దశ నుంచే ట్విస్టుల పర్వం మొదలైందని చెబుతున్నారు. తొలుత టెండర్‌ డాక్యుమెంట్‌ ప్రకారం.. 350-500 మధ్య బ్రైట్‌నె్‌సతో నెట్‌ ఉండాలని పేర్కొన్నారు. ఆ తర్వాత దాన్ని 300కు తగ్గించారని తెలుస్తోంది. ఈ టీవీలు తరగతి గదిలో ఏర్పాటు చేయాల్సి ఉండగా బ్రైట్‌నెస్‌ తగ్గిస్తే విజిబిలిటీ ఎలా వస్తుందన్న ప్రశ్నకు సంబంధిత అధికారుల నుంచి సమాధానం కరువైందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


టీవీల కొనుగోలు టెండర్ల ప్రక్రియకు ముందుగానే ఎల్‌జీ, పానాసోనిక్‌, శామ్‌సంగ్‌ తదితర బడా బ్రాండెడ్‌ కంపెనీలు ప్రభుత్వాన్ని సంప్రదించాయి. టెండర్‌ డాక్యుమెంట్‌లో స్పెసిఫికేషన్లకు సంబంధించి పలు ప్రతిపాదనలను సమర్పించాయి. సెల్‌కాన్‌, మైక్రోమాక్స్‌ వంటి కంపెనీలు కూడా ప్రయత్నాలు చేశాయి. కానీ ప్రభుత్వం వీటిని పరిగణనలోకి తీసుకోలేదు. వాస్తవానికి టెండర్‌ ఫ్లోట్‌ కాకుండానే టీసీఎల్‌ కంపెనీకే ఆర్డర్‌ వస్తుందన్న ప్రచారం జరిగింది. టీవీ రేటును రూ.45వేలుగా ప్రభుత్వం నిర్ణయించగా టీసీఎల్‌ రూ.8వేలు తక్కువకు అంటే ఒక్కో 55 అంగుళాల ఎల్‌ఈడీ స్మార్ట్‌టీవీని రూ.37వేలకు కోట్‌ చేసింది. మైక్రోమాక్స్‌ కంపెనీ రూ.76వేలకు కోట్‌ చేసిందని, ఈ రెండింటి మధ్య ధరలో చాలా వ్యత్యాసం ఉందని, సమయం కూడా తక్కువ ఉండటంతో పాటు మీరు పార్టిసిపేట్‌ చేయలేదు కాబట్టి రివర్స్‌ టెండరింగ్‌ అవసరం లేదని అధికారులు తేల్చేశారు. ఇదే స్పెసిఫికేషన్‌తో రూ.31వేల రిటైల్‌ వాల్యూతో బడా కంపెనీలు ఓపెన్‌ మార్కెట్‌లో స్మార్ట్‌ టీవీలు విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. టీవీల కొనుగోళ్లకు సంబంధించిన స్కెచ్‌ సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో రూపుదిద్దుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘నాడు-నేడు’ అమలు చేస్తున్న దాదాపు 10వేల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా, స్మార్ట్‌ టీవీల కొనుగోళ్లకు సంబంధించిన టెండర్‌ బిడ్‌ మొత్తం వాల్యూ రూ.80 కోట్లుగా చూపిస్తోంది.

Updated Date - 2020-08-13T07:26:16+05:30 IST