‘సలహా’పై కన్నెర్ర!

ABN , First Publish Date - 2020-08-13T07:39:28+05:30 IST

‘సలహా’పై కన్నెర్ర!

‘సలహా’పై కన్నెర్ర!

ఏపీ టిడ్కోలో 19మందికి ఉద్వాసన

త్వరలో మిగతా సీఎల్టీసీలపైనా వేటు

టీడీపీ హయాంలో రావడమే కారణం!


(అమరావతి- ఆంధ్రజ్యోతి)

ఏపీ టిడ్కోలో (ఆంధ్రప్రదేశ్‌ టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌) సీఎల్టీసీలుగా (సిటీ లెవెల్‌ టెక్నికల్‌ కన్సల్టెంట్లు) పనిచేస్తున్నవారిలో 19 మంది నిపుణులు, అనుభవజ్ఞులను ఒక్క కలం పోటుతో తొలగించేశారు! రాష్ట్రంలోని 13 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఏపీ టిడ్కో నిర్మిస్తున్న 51,568 గృహాల నిర్మాణం బేస్‌మెంట్‌ స్థాయికి దిగువనే ఉండటమనే కారణంతో వీరిని తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే అసలు లోగుట్టు వేరే ఉందని కార్పొరేషన్‌ వర్గాలే అంటున్నాయి. పైగా ఈ ఇష్టారాజ్య ఉద్వాసనల పర్వంలో కొద్దిరోజుల్లోనే మరో 50 మంది ని, ఆ తర్వాత మిగిలిన వారిని విడతలవారీగా సాగనంపేందుకు రంగం సిద్ధమవుతోందని చెబుతున్నాయి. ఉద్వాసనకు గురైన వారిలో ఏపీ టిడ్కో ఉద్యోగుల సంఘం నేతలూ ఉండడం విశేషం! సీఎల్టీసీల ఉద్వాసనకు ఒక సీనియర్‌ మంత్రి ఒత్తిడే కారణమైందని తెలుస్తోంది. ఏపీ టిడ్కోలోని టెక్నికల్‌ సెల్స్‌లో పట్టణ ప్రణాళిక, అభివృద్ధి తదితర రంగాల నిపుణులుగా కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియమితులైన సీఎల్టీసీల వేతనాలను నిజానికి కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. అయినప్పటికీ వారిని ఆకస్మికంగా తొలగించడం, తద్వారా ఖాళీ అయ్యే ఆయా పోస్టుల్లో ‘తమ వారిని’ నియమించుకోవాలన్న ఆ మంత్రి కుతంత్రం ఉందని తెలుస్తోంది! సీఎల్టీసీల నియామకానికి, టీడీపీ ప్రభుత్వానికి సంబంధం లేదని ఉన్నతాధికారులు నచ్చజెప్పబోయినప్పటికీ సదరు మంత్రి హుకుం జారీ చేశారని వినవస్తోంది. అదేమంటే, వారంతా గత సర్కార్‌ హయాంలో నియమితులయ్యారు కాబట్టి వారందరినీ సాగనంపాల్సిందేనని తేల్చిచెప్పినట్టు సమాచారం. దీంతో చేసేదేమీ లేక దశలవారీగా రాష్ట్రంలోని మొత్తం 172 మంది సీఎల్టీసీల తొలగింపునకు ఉన్నతాధికారులు సమాయత్తమవుతున్నారని వినవస్తోంది!


చిన్నాచితకా ఉద్యోగులు కారు..

దేశంలోని పట్టణాలన్నింటినీ మురికివాడల రహితంగా మార్చడంతోపాటు వాటిల్లోని పేదలందరికీ సొంత గూడు కల్పించి, వారి ఆర్థికాభ్యున్నతికి దోహదపడాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (అర్బన్‌)ను కేంద్రం అమలు పరుస్తోంది. పట్టణ స్థానిక సంస్థల్లో ఈ పథకం అమలు ఏపీ టిడ్కో నేతృత్వంలో జరుగుతోంది. అర్హులైన పేదల ఎంపిక మొదలుకుని వారి సామాజిక స్థితిగతులను మెరుగుపరచడం, ఆయా పథకాల డీపీఆర్‌ల తయారీ బాధ్యతలను చూసేందుకు అన్ని యూఎల్‌బీల్లో టెక్నికల్‌ సెల్స్‌ను నెలకొల్పారు. వీటిల్లో పని చేసేందుకు అనుభవం, నైపుణ్యం ఉన్న వారిని టెక్నికల్‌ కన్సల్టెంట్లుగా 7 ఏళ్ల నుంచి కాంట్రాక్ట్‌ పద్ధతిలో తీసుకుంటున్నారు.  

Updated Date - 2020-08-13T07:39:28+05:30 IST