‘చెయ్యిచ్చి’... చేయూత!

ABN , First Publish Date - 2020-08-13T07:45:49+05:30 IST

‘చెయ్యిచ్చి’... చేయూత!

‘చెయ్యిచ్చి’... చేయూత!

4 ఏళ్లలో రూ.75 వేల పేరిట మాయ

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల

ఇతర సంక్షేమ పథకాలు మూలకు

సంక్షేమ రుణాలన్నిటికీ స్వస్తి

స్వయం ఉపాధి నిధులు హుళక్కి

వెయ్యి కోట్ల పనిముట్లు నిలిపివేత

ఎస్సీ, ఎస్టీ కాలనీలకు కొత్త రోడ్లు బంద్‌

ఆగిన హాస్టళ్లు, గురుకులాల నిర్మాణం

అన్నీ అటకెక్కించి రూ.18,750తో సరి


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఒక చేత్తో ఇవ్వడం... మరో చేత్తో తీసుకోవడం! విచిత్రమేమిటంటే... ఇచ్చినదానికంటే, తీసుకున్నదే ఎక్కువ! ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఏటా రూ.18,750 నగదు చెల్లించే ‘చేయూత’ పథకంలో ఇదే మాయ దాగి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయా వర్గాల వారికి సామూహికంగా, వ్యక్తిగతంగా అందే ఇతర అనేక పథకాలను, అభివృద్ధి పనులను అటకెక్కించి... ఇప్పుడు కేవలం వ్యక్తిగత లబ్ధి చేకూర్చే పథకాన్ని మొదలుపెట్టి, అదే గొప్పగా చెప్పుకొంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. మహిళలకు చేయూతతో జరిగే లబ్ధికంటే, ఇతర పథకాలు అందకపోవడంవల్ల జరిగే సామూహిక నష్టమే ఎక్కువని చెబుతున్నారు.


బడుగు బలహీనవర్గాల కోసం రాష్ట్రంలో అనేక పథకాలు అమలులో ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటినీ జగన్‌ ప్రభుత్వం మూసేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, గురుకులాల భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, బీసీ భవనాలు, అంబేడ్కర్‌ భవనాల నిర్మాణాలను రద్దు చేసేశారు. గత ప్రభుత్వం మంజూరుచేసిన స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి సబ్సిడీలను ఇవ్వడంలేదు. ఇంటర్వ్యూలు నిర్వహించి స్వయం ఉపాధి రుణాలందిస్తామన్న ప్రభుత్వ పెద్దలు చేతులెత్తేశారు.  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఏటా రూ.3,900 కోట్లతో స్వయం ఉపాధి యూనిట్లు అందించాల్సి ఉంది. దీనికి అదనంగా రూ.1,000 కోట్లతో బీసీలకు పనిముట్లు పంపిణీ చేయాల్సి ఉంది. అవన్నీ వదిలేశారు. ఇక... గత ప్రభుత్వం ప్రతి ఎస్సీ, ఎస్టీ కాలనీలో సిమెంటు రోడ్ల కోసం మంజూరు చేసిన పనులన్నీ రద్దు చేశారు. వీటి విలువ రూ.2 వేల కోట్లు! ఎస్సీ, ఎస్టీ ఆవాసాల్లో సిమెంటు రోడ్లు, డ్రెయిన్లు ఇక కలగా మారనున్నాయని ఇప్పటికే చర్చ జరుగుతోంది. ప్రతి ఎస్సీ, ఎస్టీ కాలనీలో ఒక కమ్యూనిటీ హాలు నిర్మాణానికి గత ప్రభుత్వం ఉత్తర్వులిస్తే వాటన్నిటినీ రద్దు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్ల భవనాలు, గురుకులాల భవనాలన్నీ రద్దు చేశారు. చివరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలకు బడ్జెట్‌ కూడా తగ్గించేశారు. ఈ ఏడాది కరోనా కారణంగా హాస్టళ్లు, గురుకులాలు మూసేశారు. దీంతో వేల కోట్ల నిధులు మిగిలిపోయాయి. ఇప్పుడు ఈ నిధుల నుంచే మహిళల ఖాతాల్లో జమచేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు... చంద్రబాబు సర్కారు అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు వ్యవసాయ సబ్సిడీలు కూడా అంతంత మాత్రమే ఇస్తున్నారని చెబుతున్నారు. కుటుంబ యజమాని మరణిస్తే ఆయా వర్గాలకు చెందిన పేద కుటుంబాలు రోడ్డున పడేవి. అలాంటి వారికి ‘చంద్రన్న బీమా’తో ఆసరగా లభించేది. ఇప్పుడు ఈ పథకాన్నీ రద్దు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏడాది ఆలస్యంగా వైఎ్‌సఆర్‌ బీమా తెచ్చినప్పటికీ ఒక్కరికీ క్లెయిమ్‌లు రావడం లేదు.


పెన్షన్‌ హామీ ప్రకారమైనా నష్టమే..!

వైసీపీ సర్కారు 23 లక్షల మంది మహిళలకు ‘చేయూత’ అందిస్తోంది. అయితే, చంద్రబాబు సర్కారు ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ‘పసుపు కుంకుమ’తో ఇంతకు నాలుగు రెట్ల మంది లబ్ధిపొందారు. మరోవైపు... వైసీపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో 45 నీళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ రూ.3 వేల పెన్షన్‌ ఇస్తామని హామీ ఇచ్చింది. దానిని అమలుచేసిఉంటే ఏడాదికి ఒక్కో మహిళకు పెన్షన్‌ రూపంలో రూ.36 వేల వంతున ఐదేళ్లకు కలిపి రూ.1.80 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు నాలుగేళ్లలో రూ.75 వేలు ఇచ్చి సరిపెట్టబోతున్నారు. దీంతో ప్రతి మహిళ రూ.1.05 లక్షలు నష్టపోయినట్లే. ‘ఇప్పటికే ఉన్న కొన్ని పథకాలను రద్దు చేసి, మరికొన్నింటిని కలగాపులగం చేసి... ప్రజల ఖాతాల్లో అరకొర డబ్బులు వేస్తూ.. జగన్‌ జనాల దృష్టిలో దేవుడై పోవాలని భావిస్తున్నారు’’ అని విశ్లేషకులు చెబుతున్నారు.

Updated Date - 2020-08-13T07:45:49+05:30 IST