పుణ్యమేమోగానీ.. రోగాలు రాకుంటే సరి

ABN , First Publish Date - 2020-11-28T09:43:39+05:30 IST

పుష్కర స్నానాలతో పుణ్యమొచ్చేమాటెలా ఉన్నా.. రోగాలు రావడం ఖాయమని భక్తులు వాపోతున్నారు.

పుణ్యమేమోగానీ.. రోగాలు రాకుంటే సరి

కలుషిత నీటిలోనే పుష్కర స్నానాలు

తుంగభద్రలో కలుస్తున్న కర్నూలు డ్రైనేజీ నీరు

సంకల్‌భాగ్‌ ఘాట్‌కు ముందే కలుషితం

అక్కడి నీటితోనే సీఎం జగన్‌ సంప్రోక్షణ


(కర్నూలు, ఆంధ్రజ్యోతి): పుష్కర స్నానాలతో పుణ్యమొచ్చేమాటెలా ఉన్నా.. రోగాలు రావడం ఖాయమని భక్తులు వాపోతున్నారు. కర్నూలు నుంచి వచ్చే మురుగు నీరు నేరుగా తుంగభద్ర నదిలో కలుస్తుండటమే ఇందుకు కారణం.  మురుగునీటిని శుద్ధి చేసేందుకు ప్లాంట్లు ఉన్నా అవి పనిచేయడం లేదు. పుష్కరాల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పైపులైన్ల ద్వారా కొంతమేర మురుగు నీటిని మళ్లిస్తున్నా.. సింహభాగం మాత్రం పంప్‌ హౌస్‌ కింద, సంకల్‌ భాగ్‌ ఘాట్‌కు కొన్ని మీటర్ల పైన నదిలో కలిసిపోతోంది. భక్తులంతా ఈ మురుగు నీటిలోనే స్నానాలాచరించి, ప్రోక్షణలు నిర్వహించడమేగాక పితృ దేవతలకు పిండ ప్రదానాలు కూడా చేసేశారు. పుష్కరాలను సంకల్‌భాగ్‌ నుంచి ప్రారంభించిన సీఎం జగన్‌ కూడా అక్కడే సంప్రోక్షణ చేసుకుని వెళ్లారు. 


పనిచేయని శుద్ధి ప్లాంట్లు

కర్నూలు జిల్లాలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలు లేవు. ప్రజల నివాసాల నుంచి విడుదలయ్యే మురుగు నీరంతా పరిసర నదుల్లోనే కలిసిపోతోంది.0.80 ఎంఎల్‌డీల చొప్పున సామర్థ్యంతో మూడు ఎస్టీపీ (మురుగునీటి శుద్ధి ప్లాంట్లు)లో వన్‌టౌన్లోని ప్లాంటు రెండున్నరేళ్ల క్రితమే మూతపడింది. పుష్కర పనుల్లో అండర్‌ గ్రౌండ్‌ పైపులైన్లు పగిలి రెండోది కూడా మూలనపడింది. మొత్తం మూడు ప్లాంట్లూ పనిచేసినా 2.4 ఎంఎల్‌డీ మాత్రమే శుద్ధి జరుగుతుంది.  


సమయం లేదట!

పుష్కరాలకు కేవలం నెలన్నర ముందే నిధులు విడుదలవడంతో పరిస్థితిని చక్కదిద్దలేకపోయామని అధికారులు చెబుతున్నారు. అయితే రూ.6లక్షలతో 18.5 కిలోమీటర్ల మేర  తాత్కాలిక పైపులైన్‌ ఏర్పాటు చేశారు. దానికున్న సమయం ఎస్టీపీ విషయంలో ఎందుకు లేదో చెప్పలేకపోతున్నారు. పంప్‌హౌస్‌ నుంచి నాలుగు అడుగుల పైపులైన్లను ఐదు కిలోమీటర్ల మేర అమర్చి మొత్తం మురుగునీటిని రాంబొట్ల ఘాట్‌కు ఆవల కలిపే అవకాశమున్నా అధికారులు పట్టించుకోలేదు. మురుగు నీరు నదిలో కలిసే కొన్ని మీటర్ల ముందు సన్నని పైపులైన్ల ద్వారా క్లోరిన్‌, ఆలం సొల్యూషన్‌, సోడియం హైపోను కలిపి... శుద్ధి జరిగిపోయిందంటూ అధికారులు చేతులు దులిపేసుకుంటున్నారు. అవే నీళ్లు తుంగభద్ర నదిలో కలిసిపోతున్నాయి. దానినే భక్తులు పుణ్య జలంగా భావించి.. స్నానాలాచరిస్తూ, బాటిళ్లలో, క్యాన్లలో నింపుకుని ఇళ్లకు తీసుకెళుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వాన్ని అభాసుపాలు చేస్తోంది.


నిధులు విడుదల చేయకే సమస్య

పుష్కరాలకు రూ.230 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.. కర్నూలు యూజీడీకి మాత్రం రూ.340 కోట్లు ఇవ్వలేకపోయిం ది. కేఎంసీ నుంచి నాలుగు నెలల క్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లినా పట్టించుకోలేదు. వాస్తవానికి కర్నూలు ప్రజల అవసరార్థం 56 ఎంఎల్‌డీ ఎస్టీపీల కోసం రూ.1600 కోట్లు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం కరుణిస్తే.. వచ్చే పుష్కరాలకైనా స్వచ్ఛమైన నదీ జలాలను జిల్లా యంత్రాంగం సిద్ధం చేయవచ్చు.

Updated Date - 2020-11-28T09:43:39+05:30 IST