Abn logo
Nov 28 2020 @ 04:21AM

అంతర్గత ఆడిట్‌ నివేదికలు

చట్టసభలకే ఇవ్వగలం

వాటి బహిర్గతం రాజ్యాంగ విరుద్ధం

హైకోర్టుకు నివేదించిన కాగ్‌


అమరావతి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగం మేరకు తమ నివేదికలను పార్లమెంటు, శాసనసభల ముందుంచేందుకు అనువుగా కేంద్రప్రభుత్వ ఆడిట్‌ నివేదికలను రాష్ట్రపతికి, రాష్ట్ర ప్రభుత్వ ఆడిట్‌ నివేదికలను గవర్నర్‌కు సమర్పిస్తామని, చట్టసభలకు మాత్రమే పరిమితమైన ఇలాంటి అంతర్గత నివేదికలను బహిర్గతం చేయడం రాజ్యాంగ విరుద్ధమని కాగ్‌ (కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) హైకోర్టుకు నివేదించింది. దీంతో అమరావతి నిర్మాణాల కోసం చేసిన ఖర్చు వివరాలను హైకోర్టుకు అందించలేమని పరోక్షంగా చెప్పినట్లయింది. అమరావతి నిర్మాణాలను నిలిపేయడం చట్టవిరుద్ధమని, వాటిని కొనసాగించేలా ఆదేశించాలని కోరుతూ మండవ రమేశ్‌ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిల్‌పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. అకౌంటెంట్‌ జనరల్‌ను ప్రతివాదిగా చేర్చి.. అమరావతి నిర్మాణాలకు అయిన ఖర్చు, నిర్మాణాలు నిలిపేయడం వల్ల సంభవించే నష్టం తదితర వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది.


ఆ మేరకు పాలనా అకౌంటెంట్‌ జనరల్‌ తరఫున రాష్ట్ర డిప్యూటీ అకౌంటెంట్‌ జనరల్‌ ఆదిత్య ఆర్‌.భోజ్గదియా హైకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. రాజ్యాంగం ప్రకారం స్వతంత్ర సంస్థ అయిన కాగ్‌.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లెక్కలను ఆడిట్‌ చేస్తుందని తెలిపారు. కార్యనిర్వాహక వ్యవస్థలు సమర్పించే నిజగణాంకాల ఆధారంగా తాము ఆడిట్‌ నిర్వహిస్తామని.. రాజ్యాంగంలోని అధికరణ 151 (2) మేరకు ఆ నివేదికలను శాసనవ్యవస్థ ముందు ఉంచేందుకు అనువుగా వాటిని గవర్నర్‌కు సమర్పిస్తామని అందులో వివరించారు.

Advertisement
Advertisement
Advertisement