ప్రశ్నోత్తరాల సమయం పెట్టండి

ABN , First Publish Date - 2020-11-28T09:45:27+05:30 IST

‘‘కరోనా పేరు మీద శాసన మండలి సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చను కుదించే ప్రయత్నం చేయవద్దు.

ప్రశ్నోత్తరాల సమయం పెట్టండి

మీడియాను అనుమతించండి

 మండలి చైర్మన్‌కు టీడీపీ లేఖ


అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘‘కరోనా పేరు మీద శాసన మండలి సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చను కుదించే ప్రయత్నం చేయవద్దు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఈ సమావేశాల్లో చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రశ్నోత్తరాల సమయాన్ని పెట్టండి’’ అని మండలి చైర్మన్‌కు తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేసింది. ఆ పార్టీ ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, పి.అశోక్‌ బాబు, ఎంవీ సత్యనారాయణ రాజు ఈ మేరకు చైౖర్మన్‌ ఎంఏ షరీ్‌ఫకు శుక్రవారం ఒక లేఖ రాశారు. కరోనా చాటున ప్రశ్నోత్తరాల సమయం, స్వల్ప వ్యవధి చర్చలు లేకుండా తప్పించుకొనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని వారు ఆ లేఖలో ఆరోపించారు. అసెంబ్లీలోకి మీడియాను అనుమతించాలని మరో లేఖలో మండలి చైౖర్మన్‌కు టీడీపీ ఎమ్మెల్సీలు విజ్ఞప్తి చేశారు.


చట్ట సభల్లో వివక్ష లేకుండా మీడియాను అనుమతించడం కొన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్న సంప్రదాయమని, కాని వైసీపీ ప్రభుత్వం పనిగట్టుకొని కొన్ని మీడియా సంస్థలను అసెంబ్లీలోకి రాకుండా నిలిపివేసి కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు. చట్ట సభల్లో ఏం జరుగుతోందో తెలుసుకోవడం ప్రజల హక్కు అని, దానిని కాలరాయడానికి జరుగుతున్న ప్రయత్నాలను నిరోధించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-11-28T09:45:27+05:30 IST