‘పల్లె పోరు’కు సై

ABN , First Publish Date - 2021-01-09T08:02:31+05:30 IST

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

‘పల్లె పోరు’కు సై

  • సర్కారుపై ఎస్‌ఈసీ ‘యుద్ధం’
  • ఉదయం 6.30 నుంచి 3.30 వరకు పోలింగ్‌.. వెంటనే ఫలితాలు, ఉప సర్పంచ్‌ ఎన్నిక
  • ఎస్‌ఈసీ నిమ్మగడ్డ సంచలన నిర్ణయం.. అంతకు ముందు సీఎస్‌ బృందంతో చర్చలు
  • ‘కరోనా-టీకా’ నేపథ్యంలో ఎన్నికలకు నో.. తర్వాత కొద్ది సేపటికే ఎస్‌ఈసీ ప్రొసీడింగ్స్‌
  • నా హయాంలో జరపరాదన్నదే మీ ఉద్దేశం!.. అప్పుడు సెకండ్‌ వేవ్‌, ఇప్పుడు టీకా
  • ఎన్నికల వాయిదాకు ఏవో ఒక కారణాలు.. సెకండ్‌ వేవ్‌ రాలేదు.. కేసుల సంఖ్య తగ్గింది
  • ఒకప్పుడు రోజుకు పది వేలు... ఇప్పుడు 295 కేసులే.. విద్యా, వ్యాపారాలన్నీ ఓపెన్‌!
  • రాజకీయ సభలూ జరుపుతున్నారు.. ఎన్నికల నిర్వహణకు టీకా అడ్డుకాదు: ఎస్‌ఈసీ
  • ఇది అధికార దురహంకారం.. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ
  • పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి విమర్శ... నేడు సుప్రీంకోర్టుకు ప్రభుత్వం?
  • కేటగిరీ 1, 2లో రాష్ట్రంలో కొద్ది మందే 
  • కేటగిరీ-3పై ఇప్పటికీ స్పష్టత లేదు 
  • 2022 చివరి దాకా వ్యాక్సినేషన్‌!
  •  ఎన్నికల నిరవధిక వాయిదా కుదరదు 
  • ఎస్‌ఈసీ స్పష్టీకరణ


సై... అంటున్న ఎన్నికల కమిషన్‌! ససేమిరా అంటున్న సర్కారు! రెండు వ్యవస్థల మధ్య ‘పంచాయతీ’ పతాక స్థాయికి చేరుకుంది. పరస్పర లేఖాస్త్రాలు, సంప్రదింపుల అనంతరం...  ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌  సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూలు విడుదల చేశారు. వాయిదా కోసం సర్కారు చెబుతున్నవన్నీ సాకులే అనిఅభిప్రాయపడ్డారు.మరోవైపు...  ఎస్‌ఈసీపై సర్కారు మండిపడింది. ప్రొసీడింగ్స్‌ రద్దు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. 


అమరావతి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘పంచాయతీ పోరు’కు ముహూర్తం పెట్టేశారు. ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో నాలుగు విడతలుగా గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే కౌంటింగ్‌, ఫలితాల ప్రకటన... ఉప సర్పంచి ఎన్నిక జరుగుతుందని తెలిపారు. శుక్రవారం రాత్రి దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. శనివారం నుంచే రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్‌) అమలులోకి వస్తుందని ప్రకటించారు. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తూనే... కరోనా వ్యాక్సిన్‌ కార్యక్రమం విజయవంతం కోసం తీసుకునే చర్యలను స్వాగతిస్తామని తెలిపారు.


చర్చలు ముగిసిన వెంటనే...

‘కలిసి మాట్లాడుకోండి’ అని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్‌ సింఘాల్‌ శుక్రవారం మధ్యాహ్నం ఎస్‌ఈసీ నిమ్మగడ్డతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత, వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నేపథ్యంలో ఇప్పట్లో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని స్పష్టం చేశారు. టీకా కార్యక్రమంలో భారీ సంఖ్యలో సిబ్బంది పాల్గొంటారని, పోలీసు సిబ్బంది కూడా కరోనా నియంత్రణలో బిజీగా ఉన్నందున ఎన్నికల బందోబస్తు ఏర్పాటు చేయలేమని తెలిపారు. ఐదు కోట్ల మందికి రెండు పర్యాయాలు టీకా ఇవ్వాల్సి ఉందని చెప్పారు. సచివాలయం కార్యదర్శుల నుంచి జిల్లా స్థాయి అధికారుల దాకా ఈ పనిలోనే నిమగ్నమై ఉంటారని చెప్పారు. దీనిపై మూడు పేజీల లేఖను నిమ్మగడ్డకు అందించారు. ‘జాతీయ విపత్తుల చట్టాన్ని ఉల్లంఘిస్తూ... స్థానిక ఎన్నికలు నిర్వహించలేం’ అని అందులో స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు తీర్పు ప్రతి అందిన మూడు రోజుల్లో తమ వైఖరిని తెలియచేశామని చెప్పారు. అయితే.... రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరాన్ని ఎస్‌ఈసీ వారికి వివరించారు. ‘ఏప్రిల్‌లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తాం’ అంటూ వైసీపీ అగ్రనేత, ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ప్రకటనను వారి దృష్టికి తీసుకొచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్‌ను పూర్తిగా చూపించి... ‘‘ఎన్నికలు నిర్వహించే బాధ్యత కమిషన్‌దా? ప్రభుత్వానిదా? ఒకవైపు ఈ ప్రక్రియ నడుస్తుండగానే... ఏప్రిల్‌లో జరుపుతాం, తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక తర్వాతే జరుపుతాం అని ఎలా ప్రకటిస్తారు?’’ అని ప్రశ్నించారు. ఈ సమావేశం ముగిసిన కొన్ని గంటల్లోనే నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూలు ప్రకటించేశారు. దీనిపై ప్రొసీడింగ్స్‌ విడుదల చేశారు. 


ఎన్నికలు ఎందుకంటే...

‘‘హైకోర్టు ఆదేశాల ప్రకారం తీర్పు బహిర్గతమైన మూడు రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చర్చలకు రావాలి. 5వ తేదీన తీర్పు ప్రతి బహిర్గతమైంది. 7వ తేదీతో మూడు రోజుల గడువు ముగిసింది. అయినా... అధికారులెవరూ రాలేదు’’ అని ఎస్‌ఈసీ తన ప్రొసీడింగ్స్‌లో తెలిపారు. కనీసం, శుక్రవారమైనా (8వ తేదీ) చర్చలకు రావాలని తన వంతు బాధ్యతగా లేఖ రాశామని తెలిపారు. ప్రభుత్వం శుక్రవారమే ఒక లేఖ పంపి... కరోనా వ్యాక్సినేషన్‌ నేపథ్యంలో ఎన్నికలను నిర్వహించలేం అనే తన పాత వైఖరినే పునరుద్ఘాటించిందని చెప్పారు. తర్వాత శుక్రవారం చీఫ్‌ సెక్రటరీ నేతృత్వంలోని అధికార బృందం చెప్పిన అభిప్రాయాలన్నీ సావధానంగా విన్నామని తెలిపారు.


కరోనా అదుపులోకి వచ్చినా...

కరోనా సెకండ్‌ వేవ్‌, శీతాకాలంలో మరింత ముప్పు అంటూ... ఎన్నికల నిర్వహణకు సర్కారు ఎప్పటికప్పుడు ఏవో ఒక కారణాలు చెబుతూనే ఉందని తాజా ప్రొసీడింగ్స్‌లో నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ‘‘ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కరోనా పరిస్థితిని గమనిస్తూనే ఉన్నాం. ప్రభుత్వం చెప్పినట్లుగా మన దేశంలో సెకండ్‌వేవ్‌ రాలేదు. శీతాకాలం కేసులూ పెరగలేదు. శుక్రవారం నమోదైన కరోనా కేసుల సంఖ్య 295 మాత్రమే. రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 2822 మాత్రమే ఉన్నాయి. విద్యా, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలన్నీ మొదలయ్యాయి. ఇక... ఎలాంటి భౌతికదూరం పాటించకుండానే రాజకీయ సమావేశాలూ భారీగా జరుగుతున్నాయి’’ అని తెలిపారు. ఇక... రాష్ట్రంలో ‘సెకండ్‌ స్ట్రెయిన్‌’ కేసు ఒకేఒక్కటి, రాజమండ్రిలో నమోదైందని చెప్పారు. మొత్తంగా కరోనా పరిస్థితి నియంత్రణలో ఉందంటూ... ‘కరోనా వారియర్స్‌’ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. 


ఏదో ఒక కారణం... 

అప్పట్లో కరోనా కేసులు, సెకండ్‌ వేవ్‌ను కారణంగా చూపిన సర్కారు... ఇప్పుడు టీకా కార్యక్రమం ఉన్నందున పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం కుదరదంటోందని ఎస్‌ఈసీ తన ప్రొసీడింగ్స్‌లో పేర్కొన్నారు. ఇదే ప్రభుత్వం గతంలో ‘ఎన్నికలు నిర్వహించాల్సిందే’ అంటూ బలంగా పోరాడిందని గుర్తు చేశారు. మరోవైపు... ‘‘తిరుపతి ఉప ఎన్నికల తర్వాత... ఏప్రిల్‌ లేదా మే నెలల్లోనే స్థానిక ఎన్నికలు జరుగుతాయి. అందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి.. అంటూ ప్రభుత్వంలోని ఒక కీలక వ్యక్తి గురువారం ఒక ప్రకటన చేశారు. ప్రస్తుత ఎన్నికల కమిషనర్‌  పదవీకాలం (మార్చి 31వ తేదీ) ముగిసేదాకా స్థానిక ఎన్నికలు నిర్వహించకూడదన్నదే ప్రభుత్వ అభిప్రాయమని ఇలాంటి ప్రకటనల ద్వారా అర్థమవుతోంది’’ అని నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ తన ప్రొసీడింగ్స్‌లో వెల్లడించారు. ఎన్నికల వాయిదాపై ప్రభుత్వం చేస్తున్న వాదనల వెనుక హేతుబద్ధత, ప్రజా ప్రయోజనాలు లేవని... కేవలం ‘రాజకీయ ఉద్దేశాలు’ మాత్రమే ఉన్నాయని స్పష్టమవుతోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన టీకా కార్యక్రమానికి ఎన్నికల నిర్వహణ ఎంతమాత్రం అడ్డంకి కాబోదని తాము విశ్వస్తున్నామని తెలిపారు.


సహకరించడం మీ బాధ్యత

స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించాలని... ఇది రాజ్యాంగబద్ధమైన విధి అని నిమ్మగడ్డ చెప్పారు. తమకున్న అభ్యంతరాలు పక్కన పెట్టాలని సూచించారు. గతంలో జరిగిన హింసాత్మక ఘటనల దృష్ట్యా... పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించే బాధ్యత జిల్లా  కలెక్టర్లదేనని... దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వారికి స్పష్టమైన సూచనలు ఇవ్వాలని సూచించారు. త్వరలో సీఎస్‌, డీజీపీతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని భావిస్తోందని తెలిపారు. షెడ్యూలు విడుదలకు సీఎ్‌సకు నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఒక లేఖ కూడా రాశారు. ‘‘ఏప్రిల్‌, మేలోనే ఎన్నికలు జరుపుతామని ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు ఏకపక్షంగా ప్రకటిస్తున్నారు. అందువల్ల...  దీనిపై మళ్లీ మళ్లీ సంప్రదింపులు జరపడం అనవసరం’’ అంటూ షెడ్యూలు జారీ చేస్తున్నట్లు ప్రకటించారు.


సుప్రీం చెప్పినా... 

‘‘ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనందున... తదుపరి తేదీల  ప్రకటనకు ముందు ఎస్‌ఈసీ రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఈసీతో సంప్రదింపులు జరపాలి. పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు నుంచే కోడ్‌ అమలులోకి వస్తుంది. ఇప్పుడు అమలులోనే అభివృద్ధి కార్యక్రమాలను కోడ్‌ మళ్లీ వచ్చదాకా యథాతథంగా అమలు చేయవచ్చు. కొత్త పథకాలకు మాత్రం తప్పనిసరిగా ఎస్‌ఈసీ ముందస్తు అనుమతి తీసుకోవాలి’’ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని నిమ్మగడ్డ గుర్తు చేశారు. అయినప్పటికీ... ప్రభుత్వం ఎలాంటి అనుమతి తీసుకోకుండానే కొత్త పథకాలను ప్రకటించి, అమలు చేస్తోందన్నారు. దీనిపై సీఎ్‌సకు తాము లేఖలు రాసినా... స్పందించలేదని తెలిపారు.


ఇప్పుడు ‘పంచాయతీ’ మాత్రమే!

కరోనా నేపథ్యంలో గత ఏడాది మార్చిలో మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలను ఎస్‌ఈసీ వాయిదా వేసింది. అప్పటికి... పురపాలక, నగరపాలక ఎన్నికలకు షెడ్యూలు విడుదల చేసినా నోటిఫికేషన్‌ వెలువడలేదు. పంచాయతీ ఎన్నికల షెడ్యూలు ఒకట్రెండు రోజుల్లో విడుదల చేయాల్సి ఉండగా... కరోనా నేపథ్యంలో దానినీ వాయిదా వేశారు. జడ్పీ, మండల, పురపాలక ఎన్నికల వాయిదాపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలపై వివాదం లేదు. పైగా... పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ గతంలోనే ఒక వ్యాజ్యం దాఖలైంది. దీనిపై హైకోర్టు ఎస్‌ఈసీ స్పందన అడిగింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ ప్రొసీడింగ్స్‌ జారీ చేసింది. ఎన్నికల నిర్వహణ కుదరదని సర్కారు తేల్చిచెప్పడం... కూర్చుని మాట్లాడుకోండని హైకోర్టు ఆదేశించడం  తెలిసిందే.


టీకాకు అడ్డంకి కాదు... 

కేటగిరీ-1 (హెల్త్‌కేర్‌ వర్కర్స్‌), కేటగిరీ-2 (పోలీసులు, పారిశుధ్య సిబ్బంది)లో ఉన్న వారికి టీకా వేయడంపైనే కేంద్రం ఇప్పటిదాకా స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలో కేటగిరీ-1లో 3.7 లక్షల మంది, కేటగిరీ-2లో 7 లక్షల మంది మాత్రమే ఉన్నారు. దీనికి స్థానిక ఎన్నికల నిర్వహణ ఏమాత్రం అడ్డం కాదు. సులువుగా ఈ పని పూర్తి చేయవచ్చు.


కేటగిరీ-3 (50 ఏళ్లకు పైబడిన వారు)లో దేశవ్యాప్తంగా 27 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఏపీలో వీరి సంఖ్య 93.2 లక్షలు. వీరికి టీకా ఎప్పుడు ఇస్తారనే అంశంపై ఇప్పటిదాకా స్పష్టత లేదు.


కేంద్ర ప్రభుత్వ నివేదికల ప్రకారం... వ్యాక్సిన్‌ మొదటి దశ ఈ ఏడాది సెప్టెంబరుకు పూర్తవుతుంది. 


టీకా వేయడం ఒక నిరంతర ప్రక్రియగా సాగే అవకాశముంది. 2022 చివరికి సంపూర్ణ వ్యాక్సిన్‌ లక్ష్యాన్ని చేరుకునే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అప్పటిదాకా ఎన్నికలు నిర్వహించబోమనడం సరికాదు.


తమ ప్రతినిధిని ఎన్నుకోవడం ప్రజల ప్రాథమిక హక్కు. ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేయడం కుదరదని గతంలో  అనేక తీర్పులు వెలువడ్డాయి.


తీవ్రస్థాయిలో కరోనా ఉన్నప్పటికీ... అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఆగలేదు.


వ్యాక్సినేషన్‌లాంటి కార్యక్రమాల విజయవంతంలో... కిందిస్థాయి ప్రజాప్రతినిధుల పాత్ర ఎంతో కీలకమని గత అనుభవాలు చెబుతున్నాయి.


కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ... మొత్తం నాలుగు విడతల్లో పోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించాం. ఇప్పటికే ఎన్నికలు నిర్వహించిన పలు రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లను కూడా సంప్రదించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. 


ఎన్నికల సిబ్బందికి పీపీఈ కిట్‌లు, ఫేస్‌ షీల్డ్‌లు, గ్లౌజులు అందించాలి. కొవిడ్‌ మార్గదర్శకాల అమలుకు సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శిక్షణ ఇవ్వాలి. 


అవసరమైతే... ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక ప్రాధాన్యమిచ్చి టీకాలు వేయించాలి. ఇది వారిలో విశ్వాసం పెరిగేందుకు దోహదపడుతుంది. 

Updated Date - 2021-01-09T08:02:31+05:30 IST