అన్నదాతను ఆదుకునేవారేరీ?

ABN , First Publish Date - 2021-01-18T08:39:04+05:30 IST

గతేడాది వరుస విపత్తులు రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. ఆగస్టు నుంచి నవంబరు వరకు అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లతో లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

అన్నదాతను ఆదుకునేవారేరీ?

వరుస విపత్తులతో రైతాంగం కుదేలు

రెండు సార్లు వచ్చిన కేంద్ర బృందాలు

ఒక్కపైసా విదల్చని కేంద్ర ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వ సాయమూ అరకొరే..!

నష్టం ఎకరానికి 20 వేలు..  ఇచ్చింది 2-4 వేలే


(అమరావతి-ఆంధ్రజ్యోతి): గతేడాది వరుస విపత్తులు రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. ఆగస్టు నుంచి నవంబరు వరకు అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లతో లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రోడ్లు, చెరువులు, విద్యుత్‌ శాఖకు భారీగా నష్టం వాటిల్లింది. ఈ నష్టాల్ని కేంద్ర ప్రభుత్వం పంపిన అధికారుల బృందం చూసిందీ.. వెళ్లింది. కానీ ఒక్క పైసా కూడా సాయం విదల్చలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా విపత్తుల నిర్వహణకు రూ.2 వేల కోట్లు కేటాయించామని ఘనంగా చెప్పినా.. రైతులకు చేసింది అరకొర సాయమే. విపత్తు నష్టాల్ని అంచనా వేసేందుకు నవంబరు 9,10 తేదీల్లో కృష్ణా, గుంటూరు, అనంతపురం, ఉభయ గోదావరి జిల్లాల్లో కేంద్ర బృందాలు పర్యటించాయి.


అలాగే నివర్‌ తుఫాన్‌ నష్టాన్ని అంచనా వేసేందుకు మరోసారి కేంద్ర బృందం డిసెంబరు 17,18 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు, కడప, గుంటూరు జిల్లాల్లో పర్యటించింది. వారం రోజుల్లో నివేదికలను కేంద్ర హోంశాఖకు అందిస్తామని బృందాలు ప్రకటించాయి. కానీ ఇంతవరకు కేంద్రం నుంచి రూపాయి కూడా విపత్తు సహాయం రాష్ట్రానికి వచ్చిన దాఖలా లేదు. మరోవైపు ఆగస్టు నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం  రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీగా ఇచ్చింది రూ.914 కోట్లే! ఇతర సహాయంతో కలిపినా, వెయ్యి కోట్లు మించలేదు. విపత్తులతో ఎకరానికి రూ.20వేలపైగా నష్టం వాటిల్లగా,  స్కేల్‌ ఆఫ్‌ రిలీఫ్‌ కింద కనీసం ఎకరానికి 6 నుంచి 15వేల దాకా ఇవ్వాల్సి ఉండగా, 2వేలు చొప్పున కూడా ఇవ్వలేదు. అయితే కేంద్రం నుంచి ఇప్పటివరకు పంట నష్టానికి పరిహారం ఏమీ రాకపోవడంతో రాష్ట్రం ఇచ్చిందే తీసుకుని, కేంద్ర సాయంపై ఆశలు వదులుకున్నామని రైతులు చెప్తున్నారు. 


కేంద్ర బృందాల నివేదికలేవీ? 

ఆగస్టు, సెప్టెంబరులో భారీ వర్షాలు, అక్టోబరులో కాకినాడ వద్ద తీరం దాటిన వాయుగుండం కారణంగా 387మండలాల్లో రూ.6,386కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి నివేదిక ఇచ్చింది. తాత్కాలిక పునరుద్ధరణ పనులకు రూ.840 కోట్లు, శాశ్వత పనులకు రూ.4,439 కోట్లు అవసరమని పేర్కొంది. కానీ కేంద్రం నుంచి నిధులేమీ రాలేదు. నివర్‌ తుఫాన్‌ నష్టాన్ని పరిశీలించిన తర్వాత కూడా జాతీ య విపత్తు పునరావాస నిధి నుంచి నిధులేమీ ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. 


నష్టం అంచనాల్లోనూ భారీ తేడాలు

విపత్తుల నష్టం అంచనాలు కూడా కంటితుడుపు చర్యగా మారాయి. పంట నష్టం విషయంలో ప్రాథమిక, తుది అంచనాలకు చాలా వ్యత్యాసం వచ్చింది. ఆగస్టు-అక్టోబరు మధ్య విపత్తులకు 5.30లక్షల ఎకరాల్లో రూ.903కోట్ల విలువైన వరి, 60వేలపైగా ఎకరాల్లో ఉద్యాన పంటలకు రూ.483 కోట్లు నష్టం వాటిల్లినట్లు అప్పట్లో అధికారులు అంచనా వేశారు. తర్వాత నివర్‌, బురేవి తుఫాన్ల వల్ల రూ.5,342.84 కోట్లు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని 205 మండలాలపై నివర్‌ తుఫాన్‌ ప్రభావం చూపిందని తేల్చారు. అయితే నష్టం అంచనాల మదింపులో 5లక్షల ఎకరాలను తగ్గించారు. చివరికి 12 లక్షల ఎకరాల పంట నష్టానికిగాను 8.34 లక్షల మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని విడుదల చేసి, రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది.  


రాష్ట్ర సాయమూ అరకొరే

విపత్తుల నిర్వహణకు రూ.2వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం బడ్జెట్‌లో చూపింది. కానీ రూ.1,500కోట్లే కేటాయించినట్లు చెప్తున్నారు. అది కూడా ప్రస్తుతం మైనస్‌ బ్యాలెన్స్‌లో ఉందని సమాచారం. ఆగస్టు-అక్టోబరు మధ్య విపత్తులకు పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.135కోట్లు, అక్టోబరులో వాయుగుండంతో నష్టపోయిన రైతులకు రూ.133కోట్లు, నవంబరులో నివర్‌ తుఫాన్‌కు పంటలు దెబ్బతిన్న రైతులకు రూ.646కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. అది కూడా ఎకరానికి రూ.2-4వేలు మించి రైతులకు అందించలేదు. ఇళ్లల్లోకి నీరు చేరిన గృహాలకు రూ.2వేలు చొప్పున, నిత్యావసర వస్తువుల ఇవ్వగా, నివర్‌ తుఫాన్‌కు నెల్లూరు జిల్లాకు మాత్రమే పునరావాస కేంద్రాల్లో ఉన్న నిరాశ్రయులకు రూ.500 చొప్పున రూ.34.11లక్షలు విడుదల ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకోసం రూ.399 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెప్తున్నారు.  

Updated Date - 2021-01-18T08:39:04+05:30 IST