అడిగింది 50 కోట్లు.. డీల్‌ 30కే!

ABN , First Publish Date - 2021-03-02T08:35:53+05:30 IST

రాష్ట్రంలోని పలువురు నేతలకు సోమవారం వేకువజామునే ఢిల్లీ నుంచి ఫోన్లు వచ్చాయి. ‘మీ వాట్సా‌ప్‌కు ఒక పేపర్‌ క్లిప్పింగ్‌ వచ్చింది.. అదెంత వరకు నిజమో కనుక్కోండి..

అడిగింది 50 కోట్లు.. డీల్‌ 30కే!

చీకటి డీల్‌’పై అగ్ర నేతలకు సమాచారం 

ఆ ఇద్దరు బీజేపీ నేతల పాత్రపై ఢిల్లీ పెద్దల వాకబు

నిజమేనా.. కనుక్కుని చెప్పండి

హస్తిన నుంచి వేకువనే ఫోన్లు

కరెక్టే.. మాకెప్పుడో తెలుసు!

నెల క్రితమే ఒప్పందం కుదిరింది!

రాష్ట్ర నాయకుల సమాధానం

‘ఆంధ్రజ్యోతి’ కథనంతో కలకలం


అమరావతి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పలువురు నేతలకు సోమవారం వేకువజామునే ఢిల్లీ నుంచి ఫోన్లు వచ్చాయి. ‘మీ వాట్సా‌ప్‌కు ఒక పేపర్‌ క్లిప్పింగ్‌ వచ్చింది.. అదెంత వరకు నిజమో కనుక్కోండి.. కాసేపట్లో  కాల్‌ చేస్తా’ అని అవతలి వ్యక్తి చెప్పేసి ఫోన్‌ పెట్టేశారు. వాట్సాప్‌ చూడగానే.. ‘కమలనాథుల చీకటి డీల్‌.. ఇద్దరు బీజేపీ నేతలు.. రూ.30 కోట్ల దందా’ అంటూ.. ’ఆంధ్రజ్యోతి’లో సోమవారం ప్రచురితమైన కథనం కనిపించింది. మొత్తం చదివిన సదరు నేతలు.. అరే.. ఇదంతా మనం విన్నదే కదా..? జరిగి నెల రోజులైంది కదా..! ఓహో తిరుపతిలో ఆ ఇంట్లో జరిగింది ఇదేనా..? అప్పుడు ఆశ్రమానికి ఈ వ్యక్తి వెళ్లింది ఇందుకేనా..? అంటూ తమకు తాము ప్రశ్నలు వేసుకున్నారు.


అయినా ఒకసారి చెక్‌ చేసుకుందామని ఆ భాగోతానికి సంబంధించిన వ్యక్తులకు ఫోన్లు చేశారు. ఆ వ్యవహారం గురించి తెలిసిన వారిని వాకబు చేశారు. ‘ఆంధ్రజ్యోతి’ కథనంలో ఒక నేత గురించి పూర్తి స్పష్టత రాగా.. రెండో నాయకుడి గురించి కొంత కన్ఫ్యూజన్‌ రావడంతో.. దానిపైనా స్పష్టత తీసుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారి పేరు కూడా తెలుసుకున్నారు. అంతలోనే ఢిల్లీ నుంచి మళ్లీ కాల్స్‌ వచ్చాయి. ‘దాదాపు కరెక్టే వచ్చింది.. కాకపోతే యాభై కోట్లు అడిగారట.. చివరికి డీల్‌ కుదిరింది మాత్రం 30కే’ అని రాష్ట్ర నేతలు స్పష్టంగా చెప్పేశారు. గతంలో ఒక మాజీ ప్రధానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన తిరుపతి నేతకు ఢిల్లీలోని ఒక పెద్దాయన ఫోను చేయడంతో.. ’అదంతా నెల రోజుల క్రితమే జరిగింది. కాకపోతే పేపర్లో రావడం ఇదే మొదటిసారి’ అని వివరించినట్లు తెలిసింది. రాజధాని ప్రాంతానికి చెందిన మరో నాయకుడు స్పందిస్తూ.. ‘కనుక్కున్నా సార్‌.. ఆ ఇద్దరూ ఈ పని చేశారట.. పార్టీకి చెడ్డపేరు తెచ్చే పనులు ఇంకా చేశారు’ అని చెబుతుండగా.. ‘ప్రస్తుతం ఇదేంటో చెప్పండి’ అని అవతలి వ్యక్తి అడిగారు. ‘అంతా నిజమేనంటున్నారు సార్‌.. నమ్మదగిన వ్యక్తులే చెబుతున్నారు.. పార్టీలో కూడా కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది’ అని ఈయన చెప్పినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో ఉంటున్న ఓ రాయలసీమ నేతకు కూడా ఢిల్లీ నుంచి ఫోన్‌ వచ్చింది. ‘అదంతా నాకు తెలుసు సార్‌.. చాలా రోజులుగా జరుగుతోంది ఈ వ్యవహారం’ అని ఆయన బదులిచ్చారు. దీంతో ఓ నిర్ధారణకు వచ్చిన హస్తిన పెద్దలు.. పార్టీ అగ్ర నేతలతోపాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఫీడ్‌ బ్యాక్‌ పంపినట్లు సమాచారం. 


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం..

అవినీతి అంటేనే మండిపడే నేతలు సారథ్యం వహిస్తున్న బీజేపీలో.. ఇద్దరు నేతలు కోట్ల రూపాయలు దందా చేశారన్న ‘ఆంధ్రజ్యోతి’ కథనం తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. సోమవారం ఏ ఇద్దరు.. ఎక్కడ మాట్లాడుకున్నా కమలనాథుల చీకటి డీల్‌’ గురించే. ఒకరికొకరు ఫోన్లు చేసుకోవడం, ఇతర పార్టీల నేతలు సైతం బీజేపీలోని కొందరు నేతలకు ఫోన్లు చేయడం.. వాట్సా్‌పలో పేపర్‌ క్లిప్పింగ్‌ పంపి.. ఇది నిజమేనా అని అడగడంతో సంచలనమైంది. ఇతర పార్టీల నేతలు ఆ ఇద్దరు నేతల వ్యవహారంపై మరింత లోతుగా ఆరా తీసేందుకు బీజేపీలోని ఒక వర్గం నేతలకు ఫోన్లు చేసి అసలు విషయం తెలుసుకున్నారు. 

Updated Date - 2021-03-02T08:35:53+05:30 IST