రక్తమోడిన రహదారి

ABN , First Publish Date - 2020-10-19T10:39:18+05:30 IST

రక్తమోడిన రహదారి

రక్తమోడిన రహదారి

రేగుపాలెం వద్ద ఘోర ప్రమాదం

ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్‌ 

రెండేళ్ల చిన్నారితో సహా ముగ్గురు మృత్యువాత

మరొకరికి తీవ్ర గాయాలు


ఎలమంచిలి రూరల్‌ , అక్టోబరు 18: మండలంలోని రేగుపాలెం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి ముగ్గురు మృత్యువాత పడగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. వీరిలో రెండేళ్ల చిన్నారి కూడా వుంది. చూపరులకు కంటతడి పెట్టించిన ఈ విషాదకర ఘటనకు సంబంధించి సీఐ నారాయణరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.  


ఎలమంచిలిలోని మిలిటరీ కాలనీలో నివాసముంటున్న సిద్ధా కాంతం, ఆమె కోడలు సుజాత, మనుమడు లీలాసంతోష్‌తోపాటు సుజాత మనవరాలు (కూతురి కూతురు) రెండేళ్ల చిన్నారి అగ్గాల తన్వితశ్రీ ఆదివారం సాయంత్రం బైక్‌పై ఎస్‌.రాయవరం మండలం అడ్డరోడ్డులో ఉంటున్న సుజాత కన్నవారింటికి బయలుదేరారు. లీలాసంతోష్‌ బైక్‌ నడుపుతుండగా, తన్వితశ్రీ బైక్‌ ముందుభాగంలో కూర్చుంది. కాంతం, సుజాత వెనుక కూర్చున్నారు. రేగుపాలెం వద్ద రహదారిపై ఆగివున్న లారీని వీరి బైక్‌ వెనుక నుంచి ఢీకొంది. దీంతో కాంతం(68), తన్వితశ్రీ(2) అక్కడిక్కడే మృతిచెందగా, లీలాసంతోష్‌(22), సుజాత తీవ్రంగా గాయడ్డారు. చికిత్స నిమిత్తం వీరిని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ లీలాసంతోష్‌ మృతి చెందాడు. సుజాత చికిత్స పొందుతున్నది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో ఎలమంచిలి మిలిటరీ కాలనీలో విషాదం అలముకుంది. సమాచారం అందుకున్న మృతుల బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. సుజాత అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుండగా, ఆమె  భర్త వెంకటరావు అక్కడే సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. సీఐ నారాయణరావు కేసు నమోదు, చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-10-19T10:39:18+05:30 IST