ఏఎంఆర్డీయే.. ఒక ఉడానే!

ABN , First Publish Date - 2020-08-03T09:21:42+05:30 IST

ఏఎంఆర్డీయే.. ఒక ఉడానే!

ఏఎంఆర్డీయే.. ఒక ఉడానే!

ఏపీసీఆర్డీయే స్థానంలో కొత్తగా ఏర్పాటు

కానీ దాని స్థాయి గణనీయంగా తగ్గింపు 

డిప్యూటీ చైర్‌పర్సన్‌ సహా 11 మంది సభ్యుల నియామకం

త్వరలో చైర్మన్‌, ఇతర సభ్యులు కూడా...


అమరావతి, (ఆంధ్రజ్యోతి): అమరావతి హోదా మారింది. ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఏపీసీఆర్డీయే కూడా రద్దయిపోయింది. కొత్తగా అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(ఏఎంఆర్డీయే) ఏర్పడింది. అయితే ఏపీసీఆర్డీయేకు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి, ప్రాధాన్యం, గుర్తింపును ఏఎంఆర్డీయేకు కూడా యథాతథంగా కొనసాగిస్తామని చెప్తూ వచ్చిన ప్రభుత్వ పెద్దల ప్రకటనలో వాస్తవం లేదు! కొత్తగా ఏర్పాటు చేసిన ఏఎంఆర్డీయే ఒక ‘ఉడా’ లాంటిదే తప్ప... ఏపీసీఆర్డీయేకు ఏ మాత్రమూ సరిపోలిన సంస్థ కాదని తేటతెల్లమవుతోంది. దాని నియామకమే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ప్రపంచంలోని అత్యుత్తమ 5 రాజధాని నగరాల్లో ఒకటిగా అమరావతిని రూపొందించాలనే లక్ష్యంతో అప్పట్లోని ‘వీజీటీఎం ఉడా’ (విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ) స్థాయిని గణనీయంగా పెంచుతూ తెలుగుదేశం ప్రభుత్వం 2014లో ఏపీసీఆర్డీయేను ఏర్పాటు చేసింది. వీజీటీఎం ‘ఉడా’తో పోల్చితే సీఆర్డీయే పరిధిని కొన్ని రెట్లు పెంచి, దేశంలో అత్యంత అధిక విస్తీర్ణమున్న పట్టణాభివృద్ధి సంస్థల్లో ఒకటిగా మార్చింది. తదనుగుణంగానే అప్పటి వరకూ నామినేటెడ్‌ పోస్ట్‌గా ఉన్న వీజీటీఎం ‘ఉడా’ చైర్మన్‌ స్థానాన్ని ఏకంగా ముఖ్యమంత్రితో భర్తీ చేయడంతోపాటు ఐఏఎస్‌ అధికారులు ఉంటున్న వైస్‌ చైర్మన్‌ స్థానాన్ని పురపాలకశాఖ మంత్రికి కేటాయించింది. వీరి సారథ్యంలో పని చేసేలా అఖిల భారత సర్వీస్‌ అధికారులను సీఆర్డీయే కమిషనర్‌, అడిషనల్‌ కమిషనర్లుగా నియమించింది. అదనంగా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న అనుభవజ్ఞులు, నిపుణులైన అధికారులతోపాటు వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన ప్రైవేటు సంస్థల్లోని పలువురిని సీఆర్డీయేలో నియమించింది. వీరందరి సమష్ఠి కృషి, మేథోమదనంతో సుమారు ఐదున్నరేళ్ల తన ప్రస్థానంలో ఏపీసీఆర్డీయే పలు ఘనతలు సాధించి, దేశ, విదేశీ ప్రభుత్వాలు, సంస్థలు, నిపుణుల ప్రశంసలు చూరగొంది. ఇదిలావుండగా, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుతోపాటు ఏపీసీఆర్డీయే చట్టం-2014 రద్దు బిల్లుకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ శుక్రవారం ఆమోదముద్ర వేయడంతో శనివారం రాత్రి ‘కాన్ఫిడెన్షియల్‌’గా పేర్కొంటూ ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. అయితే ఆదివారం నాడు ప్రజలు దానిని చూసే అవకాశం కల్పించింది. ఏపీసీఆర్డీయే చట్టం రద్దు బిల్లు గవర్నర్‌ ఆమోదం పొందినందున అది గత నెల 31వ తేదీ నుంచే అమలులోకి వచ్చినట్లు పేర్కొంది. దానిని అనుసరించి చేపట్టాల్సిన ఏపీసీఆర్డీయే రద్దు ప్రక్రియకు సంబంధించిన ఉత్తర్వులను త్వరలో వెలువరిస్తామంటూనే, సీఆర్డీయే స్థానంలో ఏర్పాటు చేయదలచిన ఏఎంఆర్డీయేకు సంబంధించిన కొన్ని కీలకాంశాలను సదరు ఉత్తర్వుల్లో ఉటంకించింది. 


ప్రస్తుత సభ్యులు వీరే..!

మొత్తం 11మంది సభ్యులతో ఏఎంఆర్డీయేను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటి ప్రకారం పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా, ఏఎంఆర్డీయే మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ మెంబర్‌ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లు, డీటీసీపీ, గుంటూరు జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌, గుంటూరు-కృష్ణా జిల్లాలకు చెందిన ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈలు, ఏపీ ట్రాన్స్‌కో ఎస్‌ఈ(విజయవాడ), ఏపీసీపీడీసీఎల్‌ ఎస్‌ఈ(విజయవాడ) ఉంటారు. కాగా చైర్‌పర్సన్‌తోపాటు సభ్యులుగా పర్యావరణశాఖ, పురపాలక వ్యవహారాలు, పట్టణ ప్రణాళిక, ఇంధన పొదుపు, రవాణా రంగాలకు చెందిన నిపుణులను నియమిస్తూ రానున్న రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వనుంది. 


జీవోలోని ప్రధానాంశాలు ఇవీ..

ఏపీసీఆర్డీయే పరిధి అంతా తాజాగా ఏర్పడే ఏఎంఆర్డీయే పరిధిలోకి వస్తుంది. 


 ప్రస్తుతం సీఆర్డీయే కమిషనర్‌గా ఉన్న ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ పి.లక్ష్మీ నరసింహం ఏఎంఆర్డీయే మెట్రోపాలిటన్‌ కమిషనర్‌గా కొనసాగుతారు.


ఇప్పటి వరకూ సీఆర్డీయే చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రికి ఏఎంఆర్డీయేలో స్థానం లేదు! ఆయనకు బదులు ఏఎంఆర్డీయే చైర్‌పర్సన్‌గా రాష్ట్ర ప్రభుత్వం తనకు ఇష్టమైన వారిని నియమిస్తుంది. అంటే.. రాష్ట్రంలోని ఇతర అన్ని ‘ఉడా’ల తరహాలోనే ఏఎంఆర్డీయేకూ చైర్‌పర్సన్‌గా రాజకీయ నాయకుడినో లేదా విశ్రాంత అధికారినో నియమిస్తారు! ఏపీసీఆర్డీయేకు వైస్‌ చైర్మన్‌గా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వ్యవహరించగా, తాజాగా ఏఎంఆర్డీయేలోని ఆ పోస్టు స్థాయిని కూడా తగ్గించి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శితో సరిపుచ్చడం గమనార్హం! 

Updated Date - 2020-08-03T09:21:42+05:30 IST