ఉద్యోగులు భగభగ

ABN , First Publish Date - 2021-10-13T08:15:29+05:30 IST

సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వ పెద్దలకు సలాం కొడతారా’ అంటూ ఉద్యోగుల ఆగ్రహం ఒకవైపు! కాస్త గట్టిగా మాట్లాడితే ప్రభుత్వ పెద్దలకు ఎక్కడ కోపం వస్తుందో, ఏం చేస్తారో అనే భయం మరోవైపు!

ఉద్యోగులు భగభగ

నేతలకు తాకిన సెగ

జిల్లా పర్యటనలకు వెళ్లినప్పుడు నిలదీతలు


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వ పెద్దలకు సలాం కొడతారా’ అంటూ ఉద్యోగుల ఆగ్రహం ఒకవైపు! కాస్త గట్టిగా మాట్లాడితే ప్రభుత్వ పెద్దలకు ఎక్కడ కోపం వస్తుందో, ఏం చేస్తారో అనే భయం మరోవైపు! దీంతో ఉద్యోగ సంఘాల నేత ల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిపోయింది. ‘స్నేహపూర్వకంగా మెలిగి సాధించుకోవడం! పోరాడి మరీ డిమాం డ్లు నెరవేర్చుకోవడం! ఇప్పటిదాకా ఉద్యోగ సంఘాల నేతలు అనుసరిస్తున్న విధానాలు. కానీ... వైసీపీ సర్కారు ఉద్యోగ సం ఘాల నేతలను పట్టించుకోవడం మానేసింది. ఇక... ‘ప్రభుత్వంపై పోరాటం’ అనే మాటను నేతలు ఎప్పుడో వదిలేశారని ఉద్యోగులు మండిపడుతున్నారు. 


జీతానికీ ఎదురు చూపులా?

రాష్ట్రంలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు కలిపి 9 లక్షల వరకు ఉన్నారు. వీరికి ప్రతి నెలా 1నే ఠంచనుగా జీతాలు, పెన్షన్లు అందేవి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో బాగున్నా.. తర్వాత గాడి తప్పింది. జీతాలు, పెన్షన్లను 1 నుం చి 15వ తేదీ వరకు విడతల వారీగా ఇస్తున్నారు. ‘హమ్మ య్య... మాకు జీతమొచ్చింది. పెన్షన్‌ పడింది’ అని ఊపిరిపీల్చుకునే పరిస్థితి తీసుకొచ్చారు. దీనిపై ఈ రెండున్నరేళ్లలో ఉద్యోగ సంఘాల నేతలు గట్టిగా స్పందించిన దాఖలాలే లేవు. సోమవారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని కలిసి ఇచ్చిన వినతిపత్రంలో... ‘ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లించాలి’ అని కోరారు. 


తెలంగాణలో పీఆర్సీ.. ఇక్కడెప్పుడు?

ఉద్యోగుల 11వ పీఆర్సీ 39 నెలలు ఆలస్యం అయింది. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. పీఆర్సీ నివేదిక సిద్ధంగా ఉన్నప్పటికీ.. ‘ఈ కమిటీ వేశాం.. ఆ కమిటీ వేశాం.. నివేదిక సీఎ్‌స కు చేరింది.. సీఎంకు చేరాలి.. నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’ అంటూ కాలయాపన చేస్తున్నారు. అయినా.. ఉద్యోగ సంఘా ల నేతలు కిమ్మనడంలేదు. పక్క రాష్ట్రం తెలంగాణలో ఇప్పటి కే పీఆర్సీ ఇచ్చారని.. ఇక్కడ ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాల్సిన నేతలు అరకొరగా స్పందించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.  ఇక... కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎ్‌స )ను అధికారంలోకి వచ్చిన వారంలో రద్దు చేస్తానని ఎన్నికల ముందు జగన్‌ గట్టిగా చెప్పారు. ఇప్పటికీ ఆ ఊసు లేదు.


డ్యామేజ్‌ కంట్రోల్‌..

‘ఉంటాం సార్‌.. కంట్రోల్‌లోనే ఉంటాం సార్‌’ అని ఉద్యోగసంఘాల నాయకుడు సజ్జలకు ఫోన్‌లో సవినయంగా చెప్పుకొన్న వైనాన్ని ఉద్యోగులంతా చూశారు. ‘శుభాకాంక్షలు చెప్పేందుకే సజ్జల ఫోన్‌ చేశారు’ అని ఆ తర్వాత నేతలు ఇచ్చిన వివరణ సంతృప్తి పరచలేదు. ‘కంట్రోల్‌లో ఉండండి..  అని సజ్జల అనకుండానే.. ఉంటాం సార్‌! కంట్రోల్‌లో ఉంటాం.. అని మా నాయకుడు చెప్పరు కదా! ప్రభుత్వంపై పోరాడేందుకు ఒక్కటి అవుతున్నందుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారా?’’ అని పలువురు ఉద్యోగులు ఎద్దేవా చేస్తున్నారు. ‘తెలంగాణ ఉద్యోగులు మమ్మల్ని చులకనగా చూసే పరిస్థితి ఏర్పడింది. అప్ప ట్లో విభజన కష్టాలు ఉన్నప్పటికీ తెలంగాణతో సమానంగా 42ు ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ఇచ్చారు. అప్పటిదాకా కలిసి పనిచేసిన ఉద్యోగులకంటే తక్కువ జీతం తీసుకునే పరిస్థితి ఉండొద్దనే చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు... తెలంగాణలో ఎప్పుడో పీఆర్సీ ఇచ్చినా ఇక్కడ అతీగతీ లేదు. అక్కడ నా బ్యాచ్‌ ఉద్యోగి నాకంటే రూ.13 వేలు ఎక్కువ వేతనం తీసుకుంటున్నాడు’’ అని ఒక ఉద్యోగి తెలిపారు. 


అప్పుడు కస్సు... ఇప్పుడు తుస్సు!

చంద్రబాబు సర్కారు ఎప్పటికప్పుడు డీఏలు మంజూరు చేసేది. ఒకటి లేదా రెండు మాత్రమే పెండింగ్‌లో ఉండేవి. ఉద్యోగులు ఆశించిన దానికంటే ఎక్కువ ఫిట్‌మెంట్‌ లభించిం ది. హైదరాబాద్‌ నుంచి తరలి వస్తున్నప్పుడు.. ఉద్యోగులు అడిగినవన్నీ చంద్రబాబు ఇచ్చారు. అయినా సరే... సంఘాల పెద్దలు పోరాటాల ప్రకటనలు చేస్తూ, సర్కారుపై కస్సుమనే వారు. ఇప్పుడు.. దేనికీ దిక్కులేకున్నా కిక్కురుమనడంలేదని, తేడా స్పష్టంగా తెలుస్తోందని ఉద్యోగులు పేర్కొంటున్నారు.


సజ్జల చుట్టూ చక్కర్లు...

గతంలో ఉద్యోగ సంఘాల రాష్ట్రస్థాయి నేతలకు సులువుగా సీఎం అపాయింట్‌మెంట్‌ లభించేది. వారిని ప్రభుత్వాలు గౌరవించేవి. జగన్‌ సీఎం అయ్యాక సీన్‌ మారింది. సంఘాల నాయకులు సీఎంను నేరుగా కలిసి సమస్యలను చెప్పుకోలేని దుస్థితి నెలకొందని చెబుతున్నా రు. సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి వినతి పత్రం ఇచ్చి.. సీఎంను కలిసినంత సంతోషంగా వెనుదిరుగుతున్నారని ఉద్యోగులు ఎద్దేవాచేస్తున్నారు. ‘‘సంఘాల నేతలు ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టాల్సిన పనిలేదు. ప్రజల సంక్షేమంతోపాటు ఉద్యోగుల సంక్షేమం బాధ్యత ప్రభుత్వానిదే! దీనిపై గట్టిగా నిలదీసే హక్కు మా నేతలకు ఉంది’’ అంటున్నారు.


నిలదీతల పర్వం

మండల, జిల్లా పర్యటనలకు వెళుతున్న సంఘాల నేతలకు ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. సభ్యత్వాల నమోదు, సంవత్సర చందాలకు వెళ్లిన నేతలను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ‘‘పీఆర్సీ ఎప్పుడు ఇప్పిస్తారు? సీపీఎస్‌ ఏమైంది? డీఏలు ఎప్పుడొస్తాయి? 2 డీఏలకు ఎరియర్స్‌ ఎందుకు పడలేదు? 1నే ఎందుకు జీతాలు రావడంలేదు? ప్రభుత్వాన్ని మీరు గట్టి గా ఎందుకు అడగటంలేదు?’’ అని నిలదీస్తున్నారు. దీం తో.. నేతల్లో దడ మొదలైంది. సమస్యలపై ‘కలరింగ్‌, కవరింగ్‌’ చెల్లదని.. ఉనికిని కోల్పోతామనే బెంగ పట్టుకుంది. దీంతో మంగళవారం సజ్జలకు ఇచ్చిన వినతిపత్రంలో ‘పోరాటం’ అనే ఘాటు పదాన్ని వాడినట్లు సమాచారం.

Updated Date - 2021-10-13T08:15:29+05:30 IST