Abn logo
Oct 13 2021 @ 02:34AM

పని.. పోయింది!

రాష్ట్రంలో కాంట్రాక్టర్లకే పెద్ద కష్టం

వారిపై ఆధారపడిన వారి పరిస్థితి కనాకష్టం

కూలీల నుంచి ఇంజనీర్ల వరకు ఉపాధి

పనులు లేక మారిన బతుకు చిత్రం

రోజు కూలీలుగా మారిన డ్రైవర్లు

దిక్కుతోచని స్థితిలో మేస్త్రీలు

ఇంతటి దుస్థితి ఎన్నడూ లేదని ఆవేదన


కాంట్రాక్టర్‌... అంటే ఒక వ్యక్తి కాదు! అదో వ్యవస్థ! స్థాయిని బట్టి పదుల నుంచి వందల మందికి అన్నం పెట్టే ‘ఉపాధి కేంద్రం’! మట్టి ఎత్తే కూలీ నుంచి సివిల్‌ ఇంజనీర్‌ వరకు... నిర్మాణ రంగంతో ముడిపడిన వారికి ఆధారం... ఒక మూలస్తంభం! సర్కారు వారి పుణ్యమా అని ఆ ఆధారమే అయోమయంలో పడిపోయింది. ఆ మూలస్తంభం నిలువునా కూలిపోతోంది. ఇక... వారిని నమ్ముకున్న కూలీలు, మేస్త్రీలు, రాడ్‌ బెండర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, ప్లంబర్ల పరిస్థితి ఏమిటి? వీరి జీవితాలు ఎలా మారిపోయాయి? దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న పరిశీలనాత్మక కథనం...


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

ఒక సీసీ రోడ్డు వేస్తే పది మందికి పని దొరుకుతుంది. ఒక కాలువ తవ్వితే పదుల మందికి ఉపాధి లభిస్తుంది. వంతెనలు, ప్రాజెక్టు పనుల్లో వందలు, వేలమంది జీవనోపాధి పొందుతారు. వీటన్నింటికీ మూలం... కాంట్రాక్టర్‌! ఇప్పుడు... ఆ కాంట్రాక్టర్‌ వ్యవస్థే కునారిల్లిపోయింది. రెండేళ్లుగా వేలకోట్ల బిల్లులు రాకపోవడం, పనులన్నీ ఆగిపోవడంతో కాంట్రాక్టర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఫలితంగా ఆయా పనులపై ఆధారపడి బతుకుతున్న లక్షలాదిమంది ఉపాధికి గండిపడింది. 


వీరికి దిక్కెవరు?

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఒక ప్రముఖ కాంట్రాక్టర్‌కు సొంతంగా 8 లారీలు ఉన్నాయి. 12 మంది డ్రైవర్లు ఆయన వద్ద పనిచేసేవారు. ఆయన చేసిన పనుల బిల్లులన్నీ పెండింగ్‌లో పడ్డాయి. దీంతో కొత్తగా పనులు చేపట్టేందుకు సాహసించడంలేదు. నలుగురు డ్రైవర్లను మాత్రమే విధుల్లో ఉంచి... మిగిలిన ఎనిమిదిమందిని తొలగించారు. ఒకప్పుడు స్టీరింగ్‌ పట్టుకున్న ఆ డ్రైవర్లు ఇప్పుడు కూలీలుగా మారారు. గత 20 ఏళ్లుగా ప్రభుత్వ పనులు చేస్తున్నానని.. ఇంతటి దురవస్థ ఎన్నడూ చూడలేదని ఆ కాంట్రాక్టర్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే దాదాపు 100 మంది కాంట్రాక్టర్లది ఇదే దుస్థితి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల నుంచి దాదాపు రూ.7500 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. వీరి వద్ద పదుల సంఖ్యలో డ్రైవర్లు, ఆపరేటర్లు, కూలీలు ఉండేవారు.  ఇప్పుడు కాంట్రాక్టర్లు వారికి పనులు కల్పించలేని పరిస్థితి ఏర్పడింది. డ్రైవర్‌గా ఉంటే నెలకు రూ.25వేలు సంపాదించుకునేవారమని, ఇప్పుడు రోజు కూలీగా మారిపోవడంతో రూ.12వేలు కూడా రావడం లేదని, కుటుంబ పోషణ కష్టంగా మారిందని తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన డ్రైవర్‌ రామారావు వాపోయారు.


బతుకు దుర్భరం

కాంట్రాక్ట్‌ పనులు ముమ్మరంగా ఉన్నరోజుల్లో ప్రముఖ కాంట్రాక్టర్‌ వద్ద సూపర్‌వైజర్‌గా పనిచేసే వాడిని. బేటాలు కాకుండా నెలకు రూ.15వేలు వేతనం ఇచ్చేవారు. కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కొత్త పనులు చేపట్టడం లేదు. నాకు జీవనోపాధి కరువైంది. వ్యక్తిగత భవనాలు నిర్మించుకునే వారి వద్ద కాంక్రీంట్‌ పనులు జరిగే సమయంలో రోజువారీ వేతనంపై సూపర్‌వైజింగ్‌కు వెళుతున్నా. నెలకు రూ.6 వేలు కన్నా రావడం లేదు. బతుకు దుర్భరంగా మారింది.

- కాయల నాగేశ్వరరావు, 

తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి జిల్లా


పనులు లేవు..

కాంట్రాక్టర్ల వద్ద కార్పెంటర్‌ పనులు చేసేవాడిని. నాతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించేవాడిని. ప్రభుత్వం బిల్లులు చెల్లించని కారణంగా కాంట్రాక్టర్లు పురపాలకసంఘాల్లో కొత్త పనులు చేపట్టడం లేదు. దీంతో ఇప్పుడు పనులు లేవు. ప్రైవేటు పనులు అంతంత మాత్రంగానే దొరుకుతున్నాయి. ఆదాయం తగ్గిపోయింది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.

- వీరబాబు, పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా


మేస్త్రీ నుంచి కూలీగా..

బడా కాంట్రాక్టర్‌ దగ్గర జట్టు మేస్త్రీగా పనిచేసేవాడిని. రోడ్డు నిర్మాణ పనులకు కూలీలను పురమాయించేవాడిని. కూలీల నుంచి కమీషన్‌ రూపంలో వారానికి ఆరు నుంచి ఎనిమిది వేలు వచ్చేది. ఇప్పుడు బిల్లులు రావట్లేదని కాంట్రాక్టర్లు పనులు చేపట్టడం లేదు. మాకు ఉపాధి పోయింది. కుటుంబ పోషణకు కూలీగా మారా. ఎవరైనా ఇల్లు కట్టుకుంటుంటే వెళ్లి ఇసుక, ఇనుము మొయ్యడం, కాంక్రీటు కలపడం వంటి పనులు చేస్తున్నా. నెలకు పది వేలు కూడా రావడం లేదు. 

- పితాని వెంకటరమణ, అనపర్తి, తూర్పు గోదావరి జిల్లా


ఇల్లు గడవడం కష్టమైంది..

కాంట్రాక్టరు వద్ద ట్రాక్టరు డ్రైవరుగా పని చేస్తున్నా. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఖర్చులకు అప్పుడప్పుడు డబ్బులు ఇస్తుండడంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉంది. మూడేళ్లుగా ఇదే పరిస్థితి.

- బడుగు అశోక్‌కుమార్‌, అమలాపురం, తూర్పుగోదావరి జిల్లా


జీతాలు అడగలేని పరిస్థితి

కాంట్రాక్టరు వద్ద గుమస్తాగా పనిచేస్తున్నా. కాంట్రాక్టరుకు పనులు లేకపోగా, చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో జీతాలు అడగలేని పరిస్థితి ఏర్పడింది. గత మూడేళ్లుగా అప్పులు చేసుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. వడ్డీలు పెరిగిపోతున్నాయి. 

- తులా నాగరాజు, అమలాపురం, తూర్పుగోదావరి జిల్లా


మూడేళ్లుగా గడ్డు పరిస్థితులు..

పదేళ్లుగా జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నా. గతంలో కాంట్రాక్టరు కు పనులు ఉండడంతో మాలాంటి ఎందరికో ఉపాధి దొరికేది. కాంట్రాక్టరుకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో గత మూడేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. 

- సురేశ్‌, అమలాపురం, తూర్పుగోదావరి జిల్లా


అంతంతమాత్రంగా పనులు.. 

కాంట్రాక్టర్లకు కూలీలను సరఫరా చేసే వాడిని. రోజుకు రూ.800 నుంచి రూ.1000 ఆదాయం లభించేది. కాంట్రాక్టర్లకు పురపాలక సంఘాలు బిల్లులు ఇవ్వని కారణంగా కొత్త పనులు నిలిపివేశారు. అభివృద్ధి పనులు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. దీంతో వ్యవసాయ పనులు, వ్యక్తిగత భవనాలు నిర్మించుకునే వారి వద్ద కూలిపనికి వెళుతున్నా. 

- మహాంకాళి, పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా