గప్‌చుప్‌గా భూయజ్ఞం

ABN , First Publish Date - 2021-10-13T07:59:38+05:30 IST

అక్కడ యంత్రభూతాలు రేయింబవళ్లు రొద చేస్తున్నాయి. కొండలను పిండి కొడుతున్నాయి. ఎగుడు దిగుళ్లను చదును చేస్తున్నాయి.

గప్‌చుప్‌గా భూయజ్ఞం

భూములు తమకే అమ్మాలని బెదిరింపులు

అంగీకరించని వారి భూములు ‘బ్లాక్‌లిస్ట్‌’

విశాఖలో వెయ్యి ఎకరాల్లో పక్కాగా పాగా

ఇప్పటికే 200 ఎకరాలకు సేల్‌ అగ్రిమెంట్లు

కొండలు, బంజరు భూములూ చదును

50 ఎకరాల్లోని రంగబోలు గెడ్డ పూడ్చివేత

యంత్రాలతో రేయింబవళ్లు పనులు

పర్యవేక్షిస్తున్న ఇద్దరు వైసీపీ నేతలు

కన్నెత్తి కూడా చూడని అధికారులు


అక్కడ ఏదో జరుగుతోంది! ఒక రహస్య అజెండాతో ‘భూ యజ్ఞం’ సాగుతోంది! పదీ ఇరవై ఎకరాలు కాదు! ఏకంగా వెయ్యి ఎకరాలు సేకరించే లక్ష్యం! అందులో ఇప్పటికే దాదాపు 200 ఎకరాలను స్వాధీనం చేసేసుకున్నారు. రకరకాల గిమ్మిక్కులు, బెదిరింపులతో మిగిలిన భూమినీ స్వాధీనం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. స్థానిక వైసీపీ ముఖ్య నేతలు దీనిని పర్యవేక్షిస్తున్నారు.  విశాఖపట్నం జిల్లా అనకాపల్లి సమీపంలోని కశింకోట మండలంలో జరుగుతున్న రహస్య భూయజ్ఞంపై ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది... 


(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)

అక్కడ యంత్రభూతాలు రేయింబవళ్లు రొద చేస్తున్నాయి. కొండలను పిండి కొడుతున్నాయి. ఎగుడు దిగుళ్లను చదును చేస్తున్నాయి. దారికి అడ్డొచ్చిన ఏర్లూ, వాగులనూ పూడ్చేస్తున్నారు. ఇదంతా చేస్తున్నది ప్రైవేటు వ్యక్తులు! అక్కడ, అంత భూమిలో ఏం చేస్తున్నారు? ఏదైనా ఫ్యాక్టరీ కడుతున్నారా? రిసార్టులు పెడుతున్నారా? అందుకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా? ఇదేది కాకుండా... ‘ఇంకెవరి’ ఆదేశాల మేరకో స్థానికంగా భూములు సేకరించే పని చేస్తున్నారా? ఇవన్నీ ప్రస్తుతానికి పెద్ద ‘మిస్టరీ’! విశాఖ జిల్లాకు చెందిన ఒక ప్రజా ప్రతినిధి, మరో కార్పొరేషన్‌ చైర్మన్‌ కలిసి ఈ భూ యజ్ఞం చేస్తున్నారు. వారికి పార్టీలోని ఒక కీలక నాయకుడు అండదండలు అందిస్తున్నారని సమాచారం. రైతులను అదిరించి, బెదిరించి ఇప్పటివరకు 200 ఎకరాలకుపైగా భూమిని కొనుగోలు చేశారు. ఇంకో 400 ఎకరాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇది పూర్తికాగానే... పక్కనే మరో 400 ఎకరాలకు భూయజ్ఞాన్ని విస్తరించాలన్నది వీరి ఆలోచనగా తెలుస్తోంది. 


ఎక్కడ ఉంది ఈ భూమి...

విశాఖపట్నానికి సుమారు 60 కిలోమీటర్ల దూరం... అనకాపల్లి పట్టణానికి 15 కిలోమీటర్లు... జాతీయ రహదారికి ఐదారు కిలోమీటర్ల దూరంలో ఈ భూయజ్ఞం సాగుతోంది. కశింకోట మండలం విస్సన్నపేట, జమాదులపాలెం గ్రామాల పరిధిలోని భూములను కొంటున్నారు. ఈ రెండు గ్రామాల సమీపంలో బయ్యవరం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 195-2లో 609.24 ఎకరాల భూములు ఉన్నాయి. వీటిలో 300 ఎకరాల వరకు జిరాయితీ, మరో 300 ఎకరాలు బంజరు/డి-పట్టా భూములు ఉన్నాయి. జిరాయితీ భూముల్లో రాంబిల్లికి చెందిన కొన్ని భూస్వామ్య కుటుంబాలకు తాత ముత్తాతల నుంచి దఖలు పడినవి ఉన్నాయి. డి-పట్టా భూములు స్థానికుల పేర్లతో ఉన్నాయి. మెట్టప్రాంతం కావడంతో జీడిమామిడి, సరుగుడు తోటలు సాగు చేస్తున్నారు. పక్కనే సర్వే నంబరు 195-2 (ఎ)లో 49.66 ఎకరాలు రంగబోలు గెడ్డగా నమోదైంది. సరిగ్గా ఈ భూముల మీదే నేతలు పడ్డారు. 


బెదిరించి... భయపెట్టి...

భూముల కొనుగోలు కోసం అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలు మరో ప్రజా ప్రతినిధి ద్వారా రాంబిల్లిలోని భూస్వామ్య రైతులతో మాట్లాడించారు. భూములు ఇవ్వబోమని వారు స్పష్టం చేశారు. దీంతో పలు రకాలుగా ఒత్తిళ్లు, బెదిరింపులకు దిగారు. భూములు అమ్మితే తమకే ఇవ్వాలని, ఇతరులకు అమ్మితే వాటికి రిజిస్ట్రేషన్‌ జరగకుండా చేస్తామని భయపెట్టారు. తమ మాట వినని రైతుల భూముల సర్వే నంబర్లను రెవెన్యూ అధికారులకు అందజేసి, వాటిని అనధికారికంగా బ్లాక్‌ లిస్టులో పెట్టించారు. ఇటువంటి భూముల మీద బ్యాంకులు రుణాలు ఇవ్వవు. ఇతరత్రా తనఖాలు కూడా సాధ్యం కాదు. దీంతో చివరకు కొంతమంది రైతులు ‘పెద్దలతో గొడవ ఎందుకు’ అనుకుంటూ మెట్టు దిగి వచ్చారు. ఇక్కడ ప్రస్తుతం ఎకరా కనిష్ఠంగా రూ.15 లక్షలు, గరిష్ఠంగా రూ.30 లక్షలు పలుకుతోంది. అమ్మడానికి అంగీకరించిన వారి నుంచి సేల్‌ అగ్రిమెంట్‌ రాయించుకొని అడ్వాన్సుగా కొంతమొత్తాన్ని చేతిలో పెడుతున్నారు. ఈ సేల్‌ అగ్రిమెంట్‌లన్నీ ఒక నేత భార్య పేరున రాస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికి సుమారు 200 ఎకరాలకు రిజిస్ట్రేషన్‌ పూర్తయినట్లు తెలుస్తోంది. మరో 400 ఎకరాలకు సేల్‌ అగ్రిమెంట్లు చేసుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది మే నెల నుంచే ఈ లావాదేవీలు మొదలయ్యాయి. నేరుగా నేతల పేర్లు కాకుండా... బంధువులు, మిత్రుల పేర్లతో ఈ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. 


కొండలు తవ్వేసి... వాగులు కప్పేసి!

బలవంతంగా భూములు కొనడం మాత్రమే కాదు... మధ్యలో ఉన్న కొండలు, వాగులను కూడా నేతలు అక్రమిస్తున్నారు. సుమారు 600 ఎకరాలను చదునుచేస్తున్నారు. కొండలు, గుట్టలను తవ్వేస్తున్నారు. విస్సన్నపేట నుంచి ‘లేఅవుట్‌’గా చెబుతున్న ప్రాంతానికి వెళ్లే దారిలో ఒక వైపు కొండను తవ్వేశారు. ఆ మట్టి, రాళ్లను పక్కనే 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రంగబోలు గెడ్డలో వేసి... పూడ్చేశారు. కొండలు, గుట్టలు తవ్వడం, భూములను చదును చేసే పని ప్రస్తుతం రేయింబవళ్లు జరుగుతోంది. గ్రావెల్‌లో కొంతమేర అక్కడే వినియోగించుకుంటూ, మరికొంత గ్రావెల్‌ను పరవాడ ఫార్మాసిటీలోని ఒక కంపెనీకి తరలిస్తున్నారు. అక్కడ 100 అడుగుల వెడల్పున మట్టి రోడ్లు వేసుకుంటూ పోతున్నారు.


ఇంతకీ... ఎందుకు?

ప్రస్తుతానికి ఆ ప్రాంతాన్ని ‘లే అవుట్‌’ అని పిలుస్తున్నారు. ఇంత భారీ విస్తీర్ణంలో లే అవుట్‌ వేస్తే... రెవెన్యూ, వీఎంఆర్‌డీఏ, పంచాయతీ అధికారుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలి. కానీ, అవేవీ తీసుకోలేదు. పైగా... ‘ఔనా, అక్కడ భూములు చదును చేస్తున్నారా?’ అని క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది ఆశ్చర్యం ప్రకటిస్తున్నారు. మూడు నెలలుగా ఈ పనులు జరుగుతున్నప్పటికీ... రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అయితే... ఈ స్థాయిలో భూములు ఎందుకు సేకరిస్తున్నారనే దానిపై భిన్న వాదనలున్నాయి. అక్కడ ఒక సిమెంట్‌ ఫ్యాక్టరీ రానుందని, దానికోసమే ముందస్తుగా భూములు కొంటున్నారని ఒక వాదన! మరొక ప్రచారం ప్రకారం... ఒడిసాకు చెందిన ఒక బడా వ్యాపారి రిసార్ట్స్‌ ఏర్పాటు కోసం వైసీపీ నేతలు ఈ భూములు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ వ్యాపారితో ఒప్పందం కుదుర్చుకున్నారని చెబుతున్నారు. ప్రభుత్వ, బంజరు భూములనూ కలిపేసి... ఎకరాల వారీగా లాభానికి అమ్ముకునే యోచన కూడా ఉన్నట్లు చెబుతున్నారు. జాతీయ రహదారికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఈ భూములు ఉన్నాయి.  జమాదులపాలెం వద్ద పోలవరం కాల్వకు ఎత్తిపోతల పథకం ఏర్పాటుచేసి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా మూడు జిల్లాల్లో 8 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. ఈ నేపథ్యంలో నీటి కోసం ఎటువంటి ఇబ్బంది ఉండదని పారిశ్రామికవేత్తలకు అధికార పార్టీ నేతలు వివరించినట్టు తెలిసింది. ఉన్నతస్థాయిలో పెద్దలకు సమాచారం ఇచ్చిన తరువాత... పారిశ్రామికవేత్తల నుంచి హామీ తీసుకునే భూములు సేకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ నేతలిద్దరిలో ఒకరు ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడే ఉండి పనులు పర్యవేక్షిస్తున్నారు. మరొకరు మాత్రం... రెండురోజులకోసారి అధికారిక వాహనంలో కాకుండా ‘రహస్యం’గా వచ్చి మొత్తం సమీక్షిస్తున్నట్లు సమాచారం.


లే అవుట్‌ వేయడం లేదు

బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్సన్నపేట, జమాదులపాలెం గ్రామాల జిరాయితీ భూముల్లో లేఅవుట్‌ వేయడంలేదు. కేవలం భూములను చదును చేసుకుంటున్నట్టు తెలిసింది. అనకాపల్లి ఆర్డీవో ఆదేశానుసారం భూములను పరిశీలిస్తాం. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం. లే అవుట్‌ వేస్తే భూమార్పిడికి అనుమతి తీసుకోవాలి.

 - బి.సుధాకర్‌, తహసీల్దారు, కశింకోట


రికార్డులూ మార్చేస్తున్నారు

జమాదులపాలెం సర్వే నంబరు 195-2లో ఉన్న 609.24 ఎకరాల్లో 300 ఎకరాల వరకు జిరాయితీ. అంటే.. పట్టా భూములు. మరో 300 ఎకరాలు బంజరు/డి-పట్టా భూములు. బంజరు/డి-పట్టా భూముల్లో 100 ఎకరాలను జిరాయితీ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో మార్చేసినట్టు తెలిసింది. మరో 200 ఎకరాలకు సంబంధించి కొంతమంది సాగుదారులు అందుబాటులో లేకపోవడంతో వారికి బదులు బినామీల పేర్లతో పట్టాలు సిద్ధం చేసినట్టు సమాచారం. కొద్దిరోజుల్లో వీటిని కూడా జిరాయితీ భూములు మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంలో కశింకోట తహసీల్దారు కార్యాలయం కీలకంగా మారింది.

Updated Date - 2021-10-13T07:59:38+05:30 IST