Abn logo
Oct 13 2021 @ 02:52AM

ఇంకో 2 వేల కోట్ల అప్పు ఓవర్‌డ్రాఫ్టు పాలు!

జమ చేసుకున్న ఆర్‌బీఐ.. కేంద్రం ఇచ్చిన లోటు గ్రాంటుతోనే జీతాలు, పెన్షన్లు

35 రోజుల్లో అందరికీ తెలిసేలా 9 వేల కోట్ల రుణాలు.. గోప్యంగా మరో 5 వేల కోట్లు


అమరావతి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ఎప్పట్లాగే ఈ మంగళవారం కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ.2,000 కోట్లు అప్పు చేసింది. అంతే యథావిథిగా ఆ అప్పును భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ).. ఓవర్‌ డ్రాఫ్ట్‌ (ఓడీ) కింద జమ చేసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం తాజా అప్పు తీసుకునే సమయానికి రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు రిజర్వు బ్యాంకుకు ఓడీ రూపంలో బకాయిపడినట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు వేలం వేయగా వచ్చిన మొత్తాన్ని ఆర్‌బీఐ జమ చేసుకుంది. ఈ రూ.2,000 కోట్ల అప్పులో రూ.1,000 కోట్లపై 7.14 శాతం వడ్డీ పడింది. ఈ వెయ్యి కోట్ల అప్పును 20 ఏళ్ల తర్వాత వచ్చే ప్రభుత్వం తీర్చాలి. ఈ 20 ఏళ్ల పాటు ప్రతి నెలా వడ్డీ కడుతూ ఉండాలి. మరో రూ.వెయ్యి కోట్లపై 7.13 శాతం వడ్డీ పడింది. ఈ మొత్తాన్ని 15 ఏళ్ల తర్వాత వచ్చే ప్రభుత్వం కట్టాలి. అప్పటి వరకు ప్రతి నెలా వడ్డీ చెల్లింపులు చేస్తూనే ఉండాలి. ఇంకోవైపు.. కేంద్రవా సోమవారం రాష్ట్రానికి రూ.1438 కోట్ల రెవెన్యూ లోటు భర్తీ గ్రాంటు విడుదల చేసింది. ఈ డబ్బులతో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, కార్పొరేషన్‌, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్లు ఇవ్వాలని ఆర్థికశాఖ భావిస్తోంది.  


ఇతర శాఖల నుంచి 1,500 కోట్ల అప్పు!

కేవలం 35 రోజుల్లోనే రాష్ట్రప్రభుత్వం అందరికీ తెలిసేలా రూ.9 వేల కోట్ల అప్పు చేసింది. ఎవరికీ తెలియకుండా అతిరహస్యంగా చేసిన అప్పు మరో రూ.5,000 కోట్ల వరకు ఉంటుంది. ఈ 35 రోజుల్లో రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా బ్యాంకుల నుంచి సెప్టెంబరు చివరి వారంలో రూ.3,500 కోట్లు, ఏపీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంపెనీ పేరుతో ప్రభుత్వంలోని ఇతర శాఖల నుంచి దాదాపు రూ.1,000 కోట్ల నుంచి రూ.1500 కోట్ల రుణాలను తీసుకున్నట్లు సమాచారం. వీటిని ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోంది. సెప్టెంబరు 3వ తేదీన కొత్తగా రూ.10,500 కోట్లు అప్పు చేసుకునేందుకు రాష్ట్రానికి కేంద్రం అనుమతిచ్చింది. సెప్టెంబరు 7న మొదలుకొని ప్రతి మంగళవారం రిజర్వు బ్యాంకు వద్ద సెక్యూరిటీలు వేలం వేస్తోంది. సెప్టెంబరులో రూ.5,000 కోట్లు తీసుకురాగా.. ఈ నెల 5న మొదటి మంగళవారం రూ.2,000 కోట్లు, రెండో మంగళవారమైన 12వ తేదీన మరో రూ.2,000 కోట్లు తెచ్చింది. కేంద్రం ఇచ్చిన కొత్త అప్పుల అనుమతిలో 35 రోజుల్లో రూ.9,000 కోట్లు తెచ్చేశారు. ఇంకా రూ.10,500 కోట్ల అప్పునకు అనుమతి ఉంది.