అన్నీ కోతలే!

ABN , First Publish Date - 2021-10-18T07:16:18+05:30 IST

అన్నీ కోతలే!

అన్నీ కోతలే!

విద్యుత్‌ కోతలపై అడ్డగోలు వాదనలు

పల్లెల్లో అనధికార కటింగ్‌ ముమ్మాటికీ నిజం

ఇళ్లకు రెండున్నర గంటలు కరెంటు నిలిపివేత

వ్యవసాయానికి రాత్రిళ్లు మాత్రమే సరఫరా

అందులోనూ పలు అంతరాయాలు

ఫ్యాక్టరీలు, క్వారీలకు 2-3 దఫాలుగా కోత

సాయంత్రం 6-రాత్రి 10 మధ్య పనిచేయొద్దు!

పరిశ్రమలకు విద్యుత్‌ అధికారుల సంకేతాలు

అయినా మంత్రి, ఇంధన సంస్థల బుకాయింపు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో కరెంటు కోతలే లేవని జగన్‌ సర్కారు బుకాయిస్తోంది. థర్మల్‌ విద్యుత్కేందాల్లో ఉత్పత్తి నిరాటంకంగా కొనసాగుతోందని.. బొగ్గు-కరెంటు కొనుగోలుకు అదనపు నిధులిచ్చినట్లు సొంత మీడియాలో ప్రచారం చేసుకుంటోంది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు చూస్తే అవన్నీ కోతలేనని తేలిపోతోంది. అనధికారికంగా గృహాలకే గాక.. వ్యవసాయం, పరిశ్రమలకు కూడా కరెంటు సరఫరా నిలిపివేస్తున్నారు. గ్రామాల్లో రాత్రిళ్లు కోతపెడుతున్నారు. సాయంత్రం ఆరు గంటలు, రాత్రి పది గంటల మధ్య కార్యకలాపాలు నిర్వహించవద్దని పరిశ్రమల యాజమాన్యాలకు ఇప్పటికే అనధికార సూచనలు చేయడం గమనార్హం. మరమ్మతులు, నిర్వహణ పేరిట చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను గంటలకొద్దీ ఆపేస్తున్నారు. మచ్చుకు కొన్ని జిల్లాల్లో పరిస్థితిని చూస్తే.. ప్రకాశం జిల్లాలో వారం పది రోజులుగా ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్‌ కట్‌ చేస్తున్నారు. వ్యవసాయానికి పగటిపూట బదులు రాత్రిపూట సరఫరా చేస్తున్నారు. అందులోనూ రెండు మూడు సార్లు అంతరాయాలు. కనీసం 2 గంటలపాటు కోత ఉంటోంది. ఇళ్లకు, గ్రానైట్‌ పరిశ్రమలకు, క్వారీలకు కనీసం రెండున్నర గంటలు కోత విధిస్తున్నారు. గుంటూరు జిల్లాలో సాయంత్రం ఆరు గంటల తర్వాత 3 గంటల పాటు కరెంటు ఉండడం లేదు. కృష్ణా జిల్లాలోనూ ఇదే పరిస్థితి. సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది గంటల్లోపు పనులు చేపట్టవద్దని విద్యుత్‌ అధికారులు పరిశ్రమల యజమానులకు అనధికార ఆదేశాలివ్వడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లాలో తక్షణ మరమ్మతుల కింద కొన్ని మండలాల పరిధిలోని గ్రామాల్లో ఆదివారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. గోకవరం, అన్నవరం, కోరుకొండల్లో అడపాదడపా కోత విధించారు. రౌతుపూడి మండలంలో గంట సేపు విద్యుత్‌ కోత అమలులో ఉంది. రాజానగరం, జగ్గంపేట తదితర మండలాలలో మరమ్మతుల నిమిత్తం కోతలు విధించారు. 


ఉత్పత్తి, డిమాండ్‌ తేడా స్వల్పమే..

కృష్ణపట్నం, ఆర్‌టీపీపీ యూనిట్లు కూడా ఉత్పత్తిని ప్రారంభించడంతో.. డిమాండ్‌కూ.. ఉత్పత్తికి మధ్య తేడా చాలా వరకు తగ్గింది. రాష్ట్రంలో ఆదివారం 81.970 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. జెన్కో ఽథర్మల్‌ విద్యుత్కేంద్రాల్లో 40.26 మిలియన్‌ యూనిట్లు, జల విద్యుత్కేంద్రాల్లో 26.427 మిలియన్‌ యూనిట్లు, సంప్రదాయేతర ఇంధన వనరుల కేంద్రాల్లో 2.403 మిలియన్‌ యూనిట్ల వరకు ఉత్పత్తి చేశారు. బహిరంగ మార్కెట్లో 12.810 మిలియన్‌ యూనిట్లు కొనుగోలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉత్తరాంధ్ర, చిత్తూరు జిల్లాలోనూ విస్తారంగా వానలు కురుస్తుండడంతో విద్యుత్‌ డిమాండ్‌ తగ్గింది. రాష్ట్రంలో శనివారం నాటికి 188 మిలియన్‌ యూనిట్లు ఉన్న డిమాండ్‌ ఆదివారం 175 మిలియన్‌ యూనిట్లకు తగ్గింది. వాతావరణంలో వచ్చిన మార్పులు కారణంగా.. ఏసీల వినియోగం తగ్గింది. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో కరెంటు డిమాండ్‌ తగ్గడంతో.. అనూహ్యంగా పవర్‌ ఎక్స్ఛేంజ్‌లో యూనిట్‌ ధర రూ.3.75కి పడిపోయింది. దీంతో.. ఇప్పటి దాకా యూనిట్‌ రూ.15 నుంచి రూ.20కి కొనుగోలు చేస్తున్న ఏపీ జెన్కోకు కొంత ఊరట లభించింది. విద్యుదుత్పత్తి, డిమాండ్‌ మధ్య 12 మిలియన్‌ యూనిట్లు మాత్రమే తేడా ఉన్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో అనధికారికంగా కోతలు విధిస్తూనే ఉన్నారు. బయటకు మాత్రం కోతలు విధించడం లేదని, ముందుచూపుతో వ్యవహరిస్తుండడం వల్ల బొగ్గు సంక్షోభం తలెత్తలేదని ఇంధన సంస్థలు బుకాయిస్తున్నాయి. ఇదే సమయంలో.. కరెంటు కోతలపై దుష్ప్రచారాన్ని సహించేది లేదని, బాఽధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించిన మంత్రి బాలినేని.. ఒక్క తెలంగాణ తప్ప అన్ని రాష్ట్రాలూ బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని స్వయంగా చెప్పడం గమనార్హం. నిజంగా విద్యుత్‌ లోటు లేనప్పుడు మెయింటినెన్స్‌ పేరిట గంటల తరబడి పల్లె ప్రాంతాల్లో ఎందుకు కరెంటును తీసేస్తున్నారో ఇంధన సంస్థలు చెప్పడం లేదు. కానీ కోతలపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ సీఎం సొంత మీడియాలో ఊదరగొడుతున్నారు.

Updated Date - 2021-10-18T07:16:18+05:30 IST