బాప్‌రే వడ్డీలు!

ABN , First Publish Date - 2021-10-18T07:26:06+05:30 IST

బాప్‌రే వడ్డీలు!

బాప్‌రే వడ్డీలు!

5 నెలల్లో కట్టిన వడ్డీ 8,187 కోట్లు

ఆదాయం పెరిగినా అప్పులతోనే సినిమా

వచ్చిన ఆదాయం 37,050 కోట్లు

తెచ్చిన అప్పులు 43,593 కోట్లు

నెలకు 833 కోట్ల అసలు చెల్లింపు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్‌ నివేదిక

అందులో కనిపించని అక్రమ అప్పులు

ఏపీఎస్‌డీసీ, ఏపీఆర్‌డీసీ రుణాల ఊసే లేకుండా నివేదిక

కార్పొరేషన్ల అకౌంట్లు ఆడిట్‌ చేస్తే అక్రమాల డొంక కదులుతుంది

ఆ దిశగా అడుగేయనిఆడిటింగ్‌, అకౌంటింగ్‌ అధికారులు


అమరావతి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆదాయం ఓపక్క పెరుగుతున్నా.. జగన్‌ సర్కారు యథేచ్ఛగా అప్పులు తెస్తోంది. వాటిపై వేల కోట్ల వడ్డీ చెల్లిస్తోంది. జూలైలో సొంత ఆదాయం రూ.8,154 కోట్లు రాగా.. ఆగస్టులో అది రూ.8,455 కోట్లకు పెరిగింది. అంటే రూ.301 కోట్లు పెరిగింది. జీఎస్టీ, కేంద్ర పన్నుల్లో వాటాలు కాకుండా సొంత ఆదాయమే నెలలో రూ.301 కోట్లు పెరిగిందంటే పన్నుల బాదుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే పెరిగిన ఆదాయం భారీగా ఉన్నప్పటికీ.. నెలనెలా తెచ్చిన అప్పులపై ప్రభుత్వం చెల్లిస్తున్న వడ్డీ.. ఆ పెరిగిన ఆదాయానికి ఐదు రెట్లకు పైనే ఉంది. రకరకాల పన్నులు, సెస్‌లు, రేట్ల పెంపుతో ప్రజల నుంచి వేల కోట్లు గుంజుతున్నా.. తెచ్చిన అప్పులపై కనీసం వడ్డీ చెల్లింపులకు కూడా అది సరిపోవడం లేదు. ఆగస్టు నెలలో ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి కాగ్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు.. 5 నెలల్లో ప్రభుత్వం రూ.8,187 కోట్ల వడ్డీలు కట్టింది. మార్చి నాటికి.. ఇంకో రూ.16 వేల కోట్ల మేర వడ్డీలు కట్టాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చే సరికి నెలనెలా కట్టాల్సిన వడ్డీ పెరుగుతూ ఉంటుంది. తెచ్చిన అప్పులపై కట్టాల్సిన అసలు కూడా నెలా నెలా చెల్లిస్తుంటారు. ఈ ఏడాది అసలు కింద కట్టే డబ్బు రూ.10 వేల కోట్ల వరకు ఉంటుందని బడ్జెట్‌ అంచనాల్లో పేర్కొన్నారు. ఇందులో రూ.9,000కోట్లు ఆర్‌బీఐ ద్వారా తెచ్చిన అప్పుల అసలు కాగా.. మిగిలిన రూ.1,000కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించిన అసలు. కాగ్‌ నివేదికలో పేర్కొన్న ఈ అసలు, వడ్డీ కాకుండా కార్పొరేషన్ల నుంచి ప్రభుత్వం తీసుకున్న లక్షల కోట్ల అప్పునకు కట్టే వడ్డీలు, అసలు అదనం. కార్పొరేషన్ల అకౌంట్లు పరిశీలించి.. ఆడిటింగ్‌ చేస్తే కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అక్రమ అప్పుల వివరాలు బయటకొస్తాయి. 


ఐదు నెలల్లో రాష్ట్రానికి సొంతంగా రూ.37,050 కోట్ల ఆదాయం వస్తే రూ.36,993 కోట్ల అప్పులు తెచ్చారు. కానీ ఆ 5 నెలల్లో రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎ్‌సడీసీ) నుంచి రూ.3,000 కోట్లు, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఆర్‌డీసీ) నుంచి రూ.1,100 కోట్లు అప్పు తెచ్చారు. ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి రూ.25,000 కోట్ల అప్పు తీసుకున్నారు. ఈ అప్పుల లెక్కలను ఆర్థిక శాఖ కాగ్‌కు చెప్పలేదు. కార్పొరేషన్ల నుంచి తెచ్చిన అప్పు రూ.6,600 కోట్ల గురించి కాగ్‌ కూడా ఈ నివేదికలో ప్రస్తావించలేదు. ఇవి కూడా కలిపితే ఆ 5 నెలల్లో తెచ్చిన మొత్తం అప్పులు రూ.43,593 కోట్లకు పెరిగాయి. సొంతఆదాయం రూ.37,050 కోట్లు కాకుండా.. జీఎ్‌సటీ కింద మరో రూ.12,575 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద రూ.5,495 కోట్లు వచ్చాయి. అంటే ఈ 5నెలల్లో రాష్ట్రానికి మొత్తం ఆదాయం రూ.53,159 కోట్లు వచ్చింది. అప్పులు రూ.36,993 కోట్లుగా రాశారు. మొత్తం ఖర్చు రూ.84,347 కోట్లు అని.. రెవెన్యూ లోటు రూ.31,188 కోట్లు ఉన్నట్టు కాగ్‌ నివేదికలో పేర్కొంది.


డమ్మీగా ఏజీ కార్యాలయం

రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేలా లెక్కలను పంపిస్తే.. కాగ్‌ కూడా అందుకు అనుగుణంగానే నివేదికలు ఇస్తోంది. కాగ్‌ పర్యవేక్షణ లోపించడం వల్లే రాష్ట్రప్రభుత్వం దొడ్డిదారుల్లో అక్రమంగా అప్పులు తెచ్చి వాటితో రాష్ట్రానికి సంపద సృష్టించకపోగా ఉన్న ఆస్తులను తాకట్టు పెడుతోంది. ఏపీఎ్‌సడీసీ అక్రమ వ్యవహారాలు బయటపడిన సందర్భంలో విజయవాడలో ఉన్న ఆడిటింగ్‌ జనరల్‌ కార్యాలయం కిక్కురుమనకుండా ఉన్నప్పటికీ.. హైదరాబాద్‌లో ఉన్న అకౌంటింగ్‌ జనరల్‌ కార్యాలయం వివిధ రకాల సమాచారం కావాలని, లెక్కలు కావాలని వరుసబెట్టి ఆర్థిక శాఖకు లేఖలు రాసింది. ఆ తర్వాత ఆ కార్యాలయం కూడా నిష్ర్కియగా మారింది. రాష్ట్రప్రభుత్వ నెలవారీ పద్దులపై కాగ్‌ ఇస్తున్న నివేదికల్లో కూడా అనేక అంశాల్లో గందరగోళం నెలకొంటోంది. వీటిపై అడపాదడపా అకౌంటింగ్‌ కార్యాలయం ఆర్థిక శాఖను వివరణ కోరుతోంది. ఆడిటింగ్‌ కార్యాలయం మాత్రం నోరుమెదపడం లేదు. అందుకే కార్పొరేషన్ల ద్వారా రాజ్యాంగ విరుద్ధంగా అప్పులు తెచ్చే తప్పుడు పనిని ఆర్థిక శాఖ ఆస్తులు తాకట్టు పెట్టి మరీ ఇంకా కొనసాగిస్తూనే ఉంది.


Updated Date - 2021-10-18T07:26:06+05:30 IST