సీసీ కెమేరాల్లేవ్‌!

ABN , First Publish Date - 2021-10-18T07:34:12+05:30 IST

ఆలయాల పరిరక్షణ విషయంలో వైసీపీ ప్రభుత్వం ఉదాసీన వైఖరిని కొనసాగిస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వంలో పెద్దఎత్తున ఆలయాలపై దాడులు జరిగినా నిఘా ఏర్పాటులో నామమాత్రపు చర్యలకే పరిమితవుతోంది.

సీసీ కెమేరాల్లేవ్‌!

25శాతం ఆలయాల్లోనే నిఘా కెమెరాలు

75శాతం గుళ్లపై దృష్టి పెట్టని సర్కారు 

ప్రైవేటు ఆలయాల్లోనూ అదే పరిస్థితి

ప్రకటనలకే పరిమితమైన ప్రభుత్వం


(అమరావతి - ఆంధ్రజ్యోతి): ఆలయాల పరిరక్షణ విషయంలో వైసీపీ ప్రభుత్వం ఉదాసీన వైఖరిని కొనసాగిస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వంలో పెద్దఎత్తున ఆలయాలపై దాడులు జరిగినా నిఘా ఏర్పాటులో నామమాత్రపు చర్యలకే పరిమితవుతోంది. దాడులు జరిగినప్పుడు మొత్తం ప్రక్షాళన చేస్తామంటూ ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వం.. అమలును మాత్రం పట్టించుకోవడం లేదు. దేవదాయశాఖ పరిధిలోనే 75శాతం ఆలయాల్లో సీసీ కెమెరాలు లేవని తేలింది. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు 17468 ఉంటే, ఇప్పటివరకూ కేవలం 4340 ఆలయాల్లో 18507 కెమెరాలు మాత్రమే ఉన్నాయు. ఇంకా 13128 ఆలయాల్లో 47096 కెమెరాలను ఏర్పాటుచేయాల్సి ఉందని దేవదాయశాఖ చెబుతోంది. దీనికి దాతల కోసం ఎదురుచూస్తున్నట్లు సీఎం సమీక్షలోనే దేవదాయశాఖ తెలిపింది. అంటే దాతలు విరాళాలు ఇస్తే తప్ప ఇప్పట్లో కెమెరాలు పెట్టలేమని స్పష్టంచేస్తోంది. ఇక రాష్ట్రంలో 48162 ప్రైవేటు ఆలయాలుంటే అందులో కేవలం 7403 ఆలయాల్లో మాత్రమే కెమెరాలున్నాయి. ఈ ఆలయాల్లో ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే దానికి ప్రైవేటు మేనేజ్‌మెంట్లు బాధ్యత వహించాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ దేవదాయశాఖ పరిధిలో ఆలయాల్లో ఘటనలు జరిగితే ఎవరు బాధ్యత తీసుకోవాలనే దానిపై మాత్రం ప్రభుత్వం మాట్లాడటం లేదు. 


పోలీసు, దేవదాయశాఖ.. దొందూ దొందే!

కాగా, దాదాపు ఏడాదిన్నర కాలం నుంచి రాష్ట్రంలో ఆలయాలపై దాడులు తీవ్రమయ్యాయి. నెల్లూరులో రథం ధ్వంసం, అంతర్వేది ఆలయం రథం దగ్ధం, విజయనగరంలో విగ్రహాల ధ్వంసం లాంటి ఘటనలు రాష్ట్రంలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. వైసీపీ ప్రభుత్వం హిందూ ఆలయాలను కావాలనే నిర్లక్ష్యం చేస్తోందనే ఆరోపణలు పెద్దఎత్తున వచ్చాయి. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలపై వరుస దాడులు జరిగాయి. దీంతో మొత్తం ఆలయాలను నిఘా నేత్రం కిందకు తీసుకొస్తామని అటు పోలీసు శాఖ, ఇటు దేవదాయశాఖ ప్రకటనలు చేసింది. కానీ ఏడాది దాటినా ఇప్పటికీ ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు. ఎప్పటికి పూర్తిచేస్తారనేది ప్రభుత్వానికీ స్పష్టత లేదు.

Updated Date - 2021-10-18T07:34:12+05:30 IST