కొవిడ్‌ కిట్స్‌కూ కటింగ్‌!

ABN , First Publish Date - 2021-10-18T07:35:32+05:30 IST

రాష్ట్రంలో ఆరోగ్యశాఖ పరిస్థితి అధ్వాన్నంగా మారింది. వందల కోట్లు బకాయిలు ఉండడంతో సాధారణ వైద్యసేవల నిర్వహణతో పాటు కరోనా నిర్ధారణ పరీక్షల కొనసాగింపు కష్టతరంగా మారింది.

కొవిడ్‌ కిట్స్‌కూ కటింగ్‌!

పెండింగ్‌లో 300 కోట్ల బిల్లులు

సరఫరా చేయలేమంటూ చేతులెత్తేసిన సప్లయర్స్‌

రెండు రోజుల్లో కిట్స్‌ నిల్వలు ఖాళీ

ఇదే అదునుగా ప్రైవేటు దోపిడీ


అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆరోగ్యశాఖ పరిస్థితి అధ్వాన్నంగా మారింది. వందల కోట్లు బకాయిలు ఉండడంతో సాధారణ వైద్యసేవల నిర్వహణతో పాటు కరోనా నిర్ధారణ పరీక్షల కొనసాగింపు కష్టతరంగా మారింది. గతంలో రోజుకు 70 నుంచి 80వేల మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించేవారు. ఇప్పుడా సంఖ్య 30 వేలకు పడిపోయింది.  గతంలో కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆరోగ్యశాఖ దేశంలోనే మొదటి స్థానంలో ఉండేది. ఇప్పుడు ఏ స్థానంలో ఉందో కూడా తెలియని పరిస్థితి. రాష్ట్రంలో చాలా చోట్ల పరీక్షా కేంద్రాలను ఎత్తేశారు.


కరోనా నిర్ధారణ పరీక్షల కిట్స్‌ కొరత తీవ్రమవడమే దీనికి కారణమని విశ్వసనీయ సమాచారం. ఆర్‌ఎన్‌ఏ ఎక్స్‌ట్రాక్షన్‌, ఆర్టీపీసీఆర్‌, ర్యాపిడ్స్‌ కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం ఉన్న కిట్స్‌ నిల్వలు మరో రెండు రోజులకు మాత్రమే వస్తాయని అధికారులు చెబుతున్నారు. బిల్లుల చెల్లింపులో ఆరోగ్యశాఖ ప్రదర్శిస్తున్న తీవ్ర నిర్లక్ష్యమే దీనికి కారణమన్న వాదన వినిపిస్తోంది. కేవలం కరోనా కిట్స్‌కు సంబంధించిన బిల్లులే రూ.300 కోట్ల వరకూ ఉంటాయని అంచనా. కిట్స్‌ సరఫరా చేసే కంపెనీలకు ఏపీఎంఎ్‌సఐడీసీ అర్డర్లు ఇవ్వడమే తప్ప బిల్లులు చెల్లించడం లేదు. ఇప్పటికే స్థాయిని మించి పెట్టుబడులు పెట్టి కిట్స్‌ సరఫరా చేశామని... ఇక మా వల్ల కాదంటూ సప్లయర్స్‌, ఏపీఎంఎ్‌సఐడీసీ ఎండీకి లేఖలు కూడా సమర్పించారు. ఇదే అదనుగా ప్రైవేటు ల్యాబ్స్‌ దోపిడీకి తెరతీశాయి. అనారోగ్యమేదైనా ఆసుపత్రిలో చేరాలంటే ఆర్టీపీసీఆర్‌ లేదా ర్యాపిడ్‌ పరీక్ష అవశ్యమని ఆసుపత్రులు స్పష్టం చేస్తూ ఆయా పరీక్షలకు అత్యధికంగా రూ.2,500 వరకూ వసూలు చేస్తున్నాయి. రూ.499 తీసుకోవాల్సిన ఆర్టీపీసీఆర్‌ పరీక్షకు ప్రైవేటు ల్యాబ్స్‌ రూ.800 వరకూ వసూలు చేస్తున్నాయి.

Updated Date - 2021-10-18T07:35:32+05:30 IST