కార్మికుల నమోదులో తెలుగు రాష్ట్రాల వెనుకంజ!

ABN , First Publish Date - 2021-10-18T07:45:44+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఈ-శ్రమ్‌’ పోర్టల్‌లో అసంఘటిత రంగ కార్మికుల పేర్ల నమోదులో ఏపీ, తెలంగాణ వెనుకబడ్డాయి.

కార్మికుల నమోదులో తెలుగు రాష్ట్రాల వెనుకంజ!

తొలి పది స్థానాల్లో దక్కని చోటు

 ‘ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో 4 కోట్ల మంది

ఏపీ నుంచి 7,08,302 మంది


న్యూఢిల్లీ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఈ-శ్రమ్‌’ పోర్టల్‌లో అసంఘటిత రంగ కార్మికుల పేర్ల నమోదులో ఏపీ, తెలంగాణ వెనుకబడ్డాయి. కనీసం టాప్‌-10 రాష్ట్రాల జాబితాలో కూడా చోటు దక్కలేదు.  అసంఘటిత రంగ కార్మికుల వివరాలు సేకరించి, వారి సామాజిక, ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలన్న లక్ష్యంతో ‘ఈ-శ్రమ్‌’ పోర్టల్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది. ప్రధానంగా ఈ పోర్టల్‌లో పేర్లు నమోదు చేయించుకున్న కార్మికులు.. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2లక్షలు, శాశ్వత అంగవైకల్యం పొందితే రూ.2లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి గురైతే రూ.లక్ష పరిహారం కేంద్రమే చెల్లిస్తుంది. ఇప్పటిదాకా సుమారు 4కోట్లకుపైగా మంది ‘ఈ-శ్రమ్‌’ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ ఆదివారం వెల్లడించింది. అధిక సంఖ్యలో కార్మికులను నమోదు చేయించిన పది రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది. ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్న కార్మికులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సులభంగా పొందగలుగుతారని కేంద్ర కార్మికశాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ ట్వీట్‌ చేశారు.


తొలి పది రాష్ట్రాలు ఇవే..

ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో అధిక సంఖ్యలో కార్మికులను నమోదు చేయించిన రాష్ట్రాల్లో ఒడిసా (85,35,572మంది), పశ్చిమబెంగాల్‌ (80,35,742), ఉత్తరప్రదేశ్‌ (67,02,938), బిహార్‌ (62,44,231), మధ్యప్రదేశ్‌ (15,79,151), రాజస్థాన్‌ (14,18,276), పంజాబ్‌ (10,33,863), అసోం (9,95,707), మహారాష్ట్ర (9,37,054), ఛత్తీ్‌సగఢ్‌ (8,24,254)... తొలి పది స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 7,08,302 మంది (12వ స్థానం), తెలంగాణ నుంచి 85,741 మంది (21వ స్థానం) పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేయించుకుంటున్న కార్మికుల్లో 66శాతం మంది 16-40 ఏళ్ల వయసులో ఉన్నవారేనని ఆ శాఖ పేర్కొంది.  ప్రధానంగా వ్యవసాయం, భవన నిర్మాణ కార్మికులే ఈ-శ్రమ్‌ లో నమోదు చేసుకుంటున్నారని వివరించింది. ఈ పోర్టల్‌లో  పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ త్వరలోనే ఈ-శ్రమ్‌ డిజిటల్‌ గుర్తింపు కార్డులను కేంద్రం జారీ చేయనుంది.

Updated Date - 2021-10-18T07:45:44+05:30 IST