Abn logo
Oct 24 2021 @ 02:12AM

మీది అత్యుత్సాహం

చట్టబద్ధ పాలనపై గౌరవం లేదు

కోర్టు ఆదేశాలంటే నవ్వులాటా?

పోలీసులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు 

సీఎం నుంచి సామాన్యుడి వరకు అందరూ ఒక్కటే

ప్రతిష్ఠ ముఖ్యమంత్రికే కాదు ప్రతి ఒక్కరికీ ఉంటుంది

పట్టాభి రిమాండ్‌ రిపోర్టులో దర్యాప్తు అధికారి 

పేర్కొన్న అంశాలు ఆత్మహత్యా సదృశం కాదా?

41ఏ నిబంధనల అమలుపై నివేదిక ఇవ్వండి 

రిమాండ్‌ విధించిన మేజిస్ట్రేట్‌కు హైకోర్టు ఆదేశం 

ఏజీ అభ్యంతరాలను తోసిపుచ్చిన న్యాయమూర్తి 

పట్టాభికి బెయిల్‌.. జైలు నుంచి విడుదల


అమరావతి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పోలీసులకు రూల్‌ ఆఫ్‌ లా అంటే గౌరవం లేదని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. చట్టానికి లోబడి అందరూ పని చేయాల్సిందేనని స్పష్టం చేసింది. రూల్‌ ఆఫ్‌ లా అమలు విషయంలో  పోలీసుల వ్యవహారశైలిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ రోజూ పలు వ్యాజ్యాలు విచారణకు వస్తున్నాయని గుర్తుచేసింది. చట్టం ముందు సీఎం నుంచి సామాన్యుడి వరకు అందరూ సమానమేనని, చట్టాని కంటే ఎవరూ ఎక్కువ కాదని వ్యాఖ్యానించింది. గౌరవం, ప్రతిష్ఠ ముఖ్యమంత్రికే కాదు... అందరికీ ఉంటాయని, వాటిని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు నమోదు చేసిన కేసులో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభికి హైకోర్టు శనివారం బెయిల్‌ మంజూరు చేసింది. రూ.20వేల బాండ్‌తో రెండు పూచీకత్తులు సమర్పించాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. పట్టాభి అరెస్ట్‌ సందర్భంగా అర్నేశ్‌కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అనుగుణంగా వ్యవహరించారా? లేదా? అనే విషయంపై నివేదిక సమర్పించాలని విజయవాడ మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ను ఆదేశించింది. బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా పోలీసుల తీరును ధర్మాసనం ఎండగట్టింది. పట్టాభిని అరెస్ట్‌ చేసే ఉద్దేశం ఉంటే 41ఏ కింద నోటీసులు ఎందుకిచ్చారు? ఆ తరువాత ఎందుకు అరెస్ట్‌ చేశారని నిలదీసింది. 41ఏ కింద నోటీసులు ఇచ్చే విధానం ఇదేనా అని ప్రశ్నించింది. ఈ సెక్షన్‌ కింద నోటీసులు ఇచ్చిన తరువాత మేజిస్ట్రేట్‌ అనుమతి లేకుండా పిటిషనర్‌ను ఎలా అరెస్ట్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవైపు పట్టాభిని అరెస్ట్‌ చేయడానికి ఆయన ఇంటికి వెళ్లామని చెబుతూ... మరోవైపు సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ కింద నోటీసులు ఇచ్చామని, సహకరించకపోవడంతోనే అరెస్ట్‌ చేశామని పరస్పర విరుద్ధమైన వివరాలను దర్యాప్తు అధికారి రిమాండ్‌ రిపోర్టులో పేర్కొనడం ఆత్మహత్యా సదృశం కాదా అని ప్రశ్నించింది. రాజ్యాంగబద్ధ సంస్థలు, న్యాయమూర్తులను దూషిస్తున్నవారి విషయంలో చర్యలు తీసుకొనేందుకు ఉత్సాహం చూపని పోలీసులు... పట్టాభి అరెస్ట్‌ విషయంలో అత్యుత్సాహం చూపించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. పోలీసులు అనుసరించాల్సిన విధానం ఎప్పుడూ ఒక్కటే ఉంటుందని... వ్యక్తులను బట్టి అది మారదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత ఆదేశాలిచ్చారు. బెయిల్‌ ఇవ్వడంపై ఏజీ అభ్యంతరం వ్యక్తంచేయగా న్యాయమూర్తి తోసిపుచ్చారు. సీఎం జగన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి గొడవలకు కారణమయ్యారంటూ విజయవాడకు చెందిన వ్యాపారి షేక్‌ మస్తాన్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా టీడీపీ నేత పట్టాభిని గవర్నర్‌పేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. బెయిల్‌ కోసం పట్టాభి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, గూడపాటి లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ‘‘నిబంధనలకు విరుద్ధంగా పిటిషనర్‌ను ఆరెస్ట్‌ చేశారు. పోలీసులు నమోదు చేసిన కొన్ని సెక్షన్లు చెల్లుబాటు కావు. కులాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా పిటిషనర్‌ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పిటిషనర్‌పై నమోదు చేసిన సెక్షన్లు అన్నీ 3ఏళ్ల లోపు శిక్షపడేందుకు అవకాశం ఉన్నవే. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా 41ఏ కింద ముందుగా నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలి. 41ఏ నిబంధనలు పాటించినట్లు మేజిస్ట్రేట్‌ ముందు ఉంచిన దస్త్రంలో కొన్ని ఖాళీలు ఉండటంపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. పిటిషనర్‌ను మేజిస్ట్రేట్‌ రిమాండ్‌కు ఇవ్వకుండా ఉండాల్సింది’ అని వాదించారు. పోలీసుల తరఫున అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ... ‘‘పిటిషనర్‌ ముఖ్యమంత్రిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా కుల ప్రస్తావన తీసుకొచ్చారు. పిటిషనర్‌కు బెయిల్‌ మంజూరు చేస్తే పబ్లిక్‌ ఆర్డర్‌కు విఘాతం కలిగే ప్రమాదం ఉంది. దర్యాప్తు అధికారి కౌంటర్‌ వేసేందుకు సమయం ఇవ్వండి’’ అని కోరారు. రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్న వివరాలపై ఏజీని న్యాయమూర్తి వివరణ కోరారు. నిందితుడు విచారణకు సహకరించట్లేదని చెబుతున్న దర్యాప్తు అధికారి 41ఏ కింద నోటీసులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. పోలీసులు ఇచ్చిన నోటీసులో తేదీ, సమయం ఎందుకు పేర్కొనలేదని నిలదీశారు. చట్ట నిబంధనల మేరకు పోలీసులు వ్యవహరించలేదన్నారు. దూషణలకు పాల్పడ్డ నిందితుడు చేసింది తప్పా? ఒప్పా? ఇప్పుడే చెప్పలేమన్నారు. కానీ వారి విషయంలో అనుసరించాల్సిన విధానం ఒకటి ఉంటుందని, పోలీసులు దాన్ని పాటించాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు.


మాపై తప్పుడు కేసు

హైకోర్టుకు టీడీపీ నేతలు

డీజీపీ కార్యాలయంలో రిజర్వు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న జి.సక్రూనాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు సహా తమపై పోలీసులు చర్యలు చేపట్టకుండా నిలువరిస్తూ మఽధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. వీరిపై మంగళగిరి రూరల్‌ పోలీసులు 20న కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో తమపై మోపిన తప్పుడు కేసును కొట్టివేయాలని కోరుతూ ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, టి.శ్రావణకుమార్‌, గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించారు. 


జైలు నుంచి పట్టాభి విడుదల 

 టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. సంబంధిత పత్రాలు శనివారం సాయంత్రం 6:30 గంటలకు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు చేరుకున్నాయి. బెయిల్‌ ప్రక్రియను అధికారులు పూర్తిచేసి రాత్రి 7 గంటల సమయంలో పట్టాభిని విడుదల చేశారు. జైలునుంచి బయటకు వచ్చిన ఆయన కారులో అభివాదం చేస్తూ వెళ్లిపోయారు.