కట్ట తెగేవరకు ఏం చేస్తున్నారు?

ABN , First Publish Date - 2021-11-29T08:07:13+05:30 IST

కట్ట తెగేవరకు ఏం చేస్తున్నారు?

కట్ట తెగేవరకు ఏం చేస్తున్నారు?

భారీ వరదను ముందే ఊహించలేకపోయారా?

ముందు జాగ్రత్తలు తీసుకొంటే ప్రాణనష్టం ఎలా జరిగింది?

వైఫల్యంపై నిలదీసిన కేంద్ర బృందం?.. అన్ని జాగ్రత్తలు 

తీసుకున్నామన్న అధికారులు.. అన్ని ప్రశ్నలకూ అదే జవాబు

మళ్లీ ముంచుకొస్తున్న ముప్పు.. అయినా కానరాని సన్నద్ధత

 భారీ వరదను ముందే ఊహించలేకపోయారా?

వైఫల్యంపై నిలదీసిన కేంద్ర బృందం?


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

భారీ వరద వచ్చి కట్ట తెగే వరకు ఏం చేస్తున్నారని అధికారులను కేంద్ర బృందం నిలదీసినట్టు తెలిసింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఇంతటి ప్రాణనష్టం ఎందుకు జరిగేదని ప్రశ్నించినట్లు సమాచారం. కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర బృందం అక్కడి అధికారులతో మాట్లాడింది. 13వ తేదీ నుంచే భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు, భారీగా వరద వస్తుందని ఊహించలేకపోయారా? డ్యాం సామర్థ్యం మించి వరద చేరుతుందని ముందుగానే గుర్తించలేకపోయారా? మట్టికట్ట తెగే వరకు మీరేం చేశారు?’ అని కేంద్ర బృందంలోని ఓ అధికారి ప్రశ్నించినట్లు తెలిసింది. అన్ని ప్రశ్నలకూ ‘జాగ్రత్తలు తీసుకున్నాం’ అని అధికారులు బదులిచ్చినట్లు తెలిసింది. ‘ముందస్తు సన్నద్ధత ఉండాలి కదా! మీ దగ్గర ఎస్‌డీఆర్‌ఎఫ్‌ టీమ్స్‌ ఉన్నాయి. వర్షం రాక గురించి తెలుసు. వరద భారీగా వస్తుందని తెలిసినా, సకాలంలో ప్రజలనెందుకు అప్రమత్తం చేయలేదు?’ అని కేంద్ర బృందం ప్రశ్నించినట్లు తెలిసింది. ‘ఈనెల 13 నుంచే చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లా నుంచి కడపలోని చెయ్యేరు, బహుదా నదులకు భారీగా వరద వస్తోంది. అన్నమయ్య ప్రాజెక్టు సామర్థ్యం 2.23 టీఎంసీలు కాగా, ఈనెల 17వ తేదీ నాటికే 2.90 టీఎంసీల వరద నీరు వచ్చింది. శుక్రవారం ఉదయానికే ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను అప్రమత్తం చేసి ముందుజాగ్రత్తగా ఖాళీచేయించాల్సి ఉంది. కానీ, ఆ పనిచేయలేదు. మట్టికట్ట తెగిపోడానికి గంటన్నర ముందు రెవెన్యూ సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేశారు. పాజెక్టులకు ముప్పు పొంచి ఉందని 17వ తేదీనే మీడియాలో కథనాలూ వచ్చాయి. అయినా సీరియ్‌సగా తీసుకున్నట్టు లేదు. ఫలితంగా శుక్రవారం అర్ధరాత్రికి కట్టతెగి ఊహించని నష్టం వాటిల్లింది’ అని ఓ సీనియర్‌ అధికారి చెప్పారు. 


పొంచి ఉన్న మరో ముప్పుపై సన్నద్ధత ఏదీ?

ఇటీవల కురిసిన వర్షాలు, వాటి వల్ల సంభవించిన వరదలతో భారీ ప్రాణనష్టం సంభవించి కోలుకోలేని దెబ్బతిన్న ప్రజలకు ఇప్పుడు మరో ముప్పు ముంచుకొస్తోంది. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో ఆదివారం సాయంత్రం నుంచి మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. మరో 48 గంటలపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ సారైనా సర్కారు ముందస్తు సన్నద్ధత చర్యలు తీసుకుంటుందా? అన్న సందేహాలు వెంటాడుతున్నాయి. కొత్తగా వచ్చే ముప్పును ఎలా ఎదుర్కోవాలి? ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలన్న సన్నద్ధత కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2021-11-29T08:07:13+05:30 IST