పీఆర్‌సీ పోరులోకి ‘ఆర్టీసీ’

ABN , First Publish Date - 2022-01-23T08:38:24+05:30 IST

పీఆర్‌సీ పోరులోకి ‘ఆర్టీసీ’

పీఆర్‌సీ పోరులోకి  ‘ఆర్టీసీ’

అందరిబాటలోనే సమ్మెకు సై.. 7 నుంచి బస్సులకు బ్రేక్‌?


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఉద్యోగులకు రివర్స్‌ పీఆర్‌సీ ఇచ్చిన జగన్‌ ప్రభుత్వంపై పోరాటానికి ప్రజా రవాణా సంస్థ(పీటీడీ) సిబ్బంది కూడా సిద్ధమయ్యారు. అన్యాయం చేసిన వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు వెనుకాడబోం అంటున్నారు. ఎన్‌జీవోలతో కలిసి సమరానికై సై అంటున్నారు.  పీఆర్‌సీ సాధన సమితి పిలుపు మేరకు ఆదివారం(23న) రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు మొదలుకొని ఫిబ్రవరి 7న సమ్మె(బస్సులు ఆపేయడం) వరకూ పోరాటంలో కలిసి వస్తామని చెబుతున్నారు. ఏపీఎ్‌సఆర్టీసీలోని బలమైన అసోసియేషన్లలో ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఇప్పటికే ప్రత్యక్ష పోరాటంలో పాల్గొంటుండగా, ఎన్‌ఎంయూ శనివారం ముఖ్యమంత్రికి లేఖ రాసింది. ఎస్‌డబ్ల్యూఎఫ్‌ కూడా ఎన్‌జీవోల పోరాటానికి మద్దతు తెలిపింది. దీంతో ఫిబ్రవరి 7 నుంచి  బస్సులు ఆగిపోతే ఏం చేయాలన్న ఆందోళన ఆర్టీసీ ఉన్నతాధికారుల్లో మొదలైంది. రెండేళ్ల క్రితం వరకూ ఆర్టీసీ(కార్పొరేషన్‌) సిబ్బందిగా ఉంటూ 2020 జనవరిలో ప్రభుత్వంలో విలీనమై పీటీడీ ఉద్యోగులుగా మారిన యాభై వేల మంది ఉమ్మడి పోరులో భాగస్వాములయ్యేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం అన్ని జిల్లాల్లో నిర్వహించనున్న రౌండ్‌ టేబుల్‌ సమావేశాలకు పీటీడీ ఉద్యోగ సంఘాల నేతులు కూడా హాజరుకానున్నారు. పాత పెన్షన్‌ అమలు చేసి ప్రస్తుత వేతన సవరణలో ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌కు నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు పీవీ రమణా రెడ్డి, వై.శ్రీనివాసరావు శనివారం లేఖ రాశారు. ప్రభుత్వ విలీనమైన తమకు ప్రస్తుతమున్న ఇంటి అద్దె శ్లాబులే(12ు నుంచి 30ు) కొనసాగించాలని కోరారు. ఈ రెండింటితో పాటు విలీనం నాటికి ప్రభుత్వ ఉద్యోగులతో వెనుక బడి ఉన్న 19శాతం భర్తీ చేయాలని కోరారు. మరో పెద్ద యూనియన్‌ ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.రావు ఇప్పటికే బొప్పరాజు జేఏసీతో కలిసి ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఉద్యోగుల న్యాయమైన హక్కులు, అలవెన్స్‌ల విషయంలో తాము రాజీపడే ప్రసక్తేలేదని ఈయూ ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర్‌రావు ఇప్పటికే స్పష్టం చేశారు. కాగా, ఉద్యోగుల ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్దతిస్తున్నట్లు ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుందరయ్య ఓ ప్రకటన విడుదల చేశారు. 


సమస్యలపై ఎన్నిసార్లు విన్నవించినా..

వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీ సిబ్బందికి ఏ విషయంలోనూ స్పష్టత ఇవ్వడంలేదు. ప్రభుత్వ పెద్దలకు ఎన్నిసార్లు తమ సమస్యలు విన్నవించినా మంత్రి తీయని మాటలు తప్ప, చేతల్లో అడుగు ముందుకు పడటంలేదు. ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే కార్పొరేషన్‌ సిబ్బంది అయిన ఆర్టీసీ ఉద్యోగులకు సదుపాయాలు ఎక్కువగా ఉండేవి. అయినా విలీనానికి అన్ని యూనియన్లు ఒప్పుకోవడానికి ప్రధాన కారణం పాత పెన్షన్‌ లభిస్తుందన్న ఒకే ఒక్క కారణం. అయితే, ప్రభుత్వం తమను రెండేళ్ల క్రితమే ప్రభుత్వంలో విలీనం చేసినా ఎటువంటి స్పష్టమైన జీవో ఇవ్వక పోవడంపై ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-01-23T08:38:24+05:30 IST