మాతృభాషలో వాదించడం

ABN , First Publish Date - 2022-01-23T09:13:35+05:30 IST

మాతృభాషలో వాదించడం

మాతృభాషలో వాదించడం

కోర్టును అవమానించినట్టు కాదు

స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం

సింగిల్‌ జడ్జి తీర్పును రద్దు చేస్తూ ఉత్తర్వులు


అమరావతి, జనవరి 22(ఆంధ్రజ్యోతి): హైకోర్టులో ప్రొసీడింగ్స్‌ ఆంగ్లంలో జరుగుతున్నప్పటికీ మాతృభాషలో వాదనలు వినిపించడం హైకోర్టును అవమానించినట్లు కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఓ వ్యాజ్యం విచారణ సందర్భంగా న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు న్యాయవాది తెలుగులో సమాధానం చెప్పారు. దీంతో ఆగ్రహించిన సింగిల్‌ జడ్జి హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి నాలుగు వారాల్లో రూ.25 వేలు ఖర్చుల కింద చెల్లించాలని పిటిషనర్‌ జి.భాస్కరరావును ఆదేశిస్తూ 2019 మార్చి 12న ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను ధర్మాసనం రద్దు చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఇటీవల ఆదేశాలిచ్చింది. విశాఖపట్నంలో ఓ భవన నిర్మాణ అనుమతుల వ్యవహారానికి సంబంధించి జి. భాస్కరరావు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. వ్యాజ్యం విచారణార్హత ఏంటి? అంటూ సింగిల్‌ జడ్జి, పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ఆంగ్లంలో ప్రశ్నించారు. దీనికి ‘‘తమరు పేజీ నెంబర్లు 18, 19ని ఒకసారి చూడాలి’’ అని సదరు న్యాయవాది తెలుగులో సమాధానమిచ్చారు. దీంతో సింగిల్‌ జడ్జి పిటిషనర్‌కు రూ.25 వేలు కట్టాలని ఆదేశించడంతోపాటు పిటిషన్‌ను కొట్టివేశారు. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పిటిషనర్‌ అప్పీల్‌ వేశారు. విచారణ సందర్భంగా న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అప్పీల్‌పై విచారణను కొనసాగించాలనే ఉద్దేశం తమకు లేదన్నారు. అయితే, సింగిల్‌ జడ్జి విధించిన ఖర్చులను రద్దు చేయాలని కోరారు. దీంతో ధర్మాసనం సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును పరిశీలిస్తే న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టు విచారణను అవమానించేలా తెలుగులో ఽసమాధానం ఇచ్చినట్లు ఉందని తెలిపింది. అంతే తప్ప మొత్తం కేసులను తెలుగులో వాదించలేదని పేర్కొంది. హైకోర్టులో ప్రొసీడింగ్స్‌ ఆంగ్లంలో జరుగుతున్నా, మాతృభాషలో వాదనలు వినిపించడం హైకోర్టు విచారణను అవమానించినట్లు కాదని తెలిపింది. ఈ నేపథ్యంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 

Updated Date - 2022-01-23T09:13:35+05:30 IST