రాష్ట్రంలోకి విదేశీ విష సంస్కృతి

ABN , First Publish Date - 2022-01-23T09:20:06+05:30 IST

రాష్ట్రంలోకి విదేశీ విష సంస్కృతి

రాష్ట్రంలోకి విదేశీ విష సంస్కృతి

అసాంఘిక కార్యకలాపాలకు పోలీసుల సహకారం

వైసీపీ ఆదేశాలతోనే మఫ్టీలో విధులు

కల్లు తాగిన కోతిలా కొడాలి నాని

ఆయనో పనికిమాలిన మంత్రి

టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ విమర్శ

గుడివాడ దాడి ఘటనపై డీఐజీకి ఫిర్యాదు


ఏలూరుక్రైం, జనవరి 22: అసాంఘిక కార్యకలాపాలను నిరోధించాల్సిన పోలీసులే మఫ్టీలో ఆ కార్యకలాపాలకు సహకరిస్తున్నారని టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ ఆరోపించింది. రక్షణ కల్పించలేక వైసీపీ ఆదేశాలను పాటిస్తున్నారని ఆక్షేపించింది. మంత్రి కొడాలి నానికి గుడివాడలో ఉన్న కె-కన్వెన్షన్‌లో కేసినో, జూదం, తీన్‌పత్‌ ఆడిన ఘటనపై టీడీపీ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ శుక్రవారం కె-కన్వెన్షన్‌కు వెళ్తుండగా వైసీపీ మూకలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఘటనపైఫిర్యాదు చేయడానికి నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బొండా ఉమామహేశ్వరరావు, కొనకళ్ల నారాయణరావు, ఆలపాటి రాజా, తంగిరాల సౌమ్య తదితరులు శనివారం ఏలూరు డీఐజీ కార్యాలయానికి వచ్చారు. డీఐజీ కేవీ మోహన్‌రావు కార్యాలయంలో లేకపోవడంతో మేనేజర్‌కు వినతిపత్రాన్ని అందించారు. అనంతరం నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోకి విదేశీ సంస్కృతిని తీసుకొస్తోందన్నారు. ఈ విష సంస్కృతి వల్ల యువత, రాష్ట్ర భవిష్యత్తు నాశనమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. తమపై దాడి జరిగితే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని, ఫిర్యాదు చేయడానికి తాము మెసేజ్‌ పెట్టి వచ్చినా డీఐజీ అందుబాటులో లేరని వాపోయారు. వైసీపీ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాల అనుసారమే అధికారులు నడుస్తున్నారని, రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడం లేదని ఆక్షేపించారు. తెలుగు జాతి గౌరవానికి అవమానం తెస్తున్నారని, పనికిమాలిన మంత్రి గా కొడాలి నాని ఉన్నారని, సీఎం జగన్‌ ఇంతవరకు స్పందించకపోవడం దారుణమన్నారు. కల్లు తాగిన కోతిలా నాని మాట్లాడారని విమర్శించారు. తమపై దాడి సమయంలో డీఐజీకి ఫోన్‌ చేయగా, తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతంలో క్యాంపులో ఉన్నానని చెప్పారని, కానీ 40నిమిషాల వ్యవధిలోనే గుడివాడ చేరుకుని ప్రెస్‌మీట్‌ పెట్టారని, పోలీసులు ఉండబట్టే తాము బయటపడగలిగామని మాట్లాడారని ఆక్షేపించారు. అసలు ఏమి చేయాలని కుట్ర పన్నారో తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఘటనపై తక్షణమే విచారణ జరపాలని, లేదంటే హైకోర్టును ఆశ్రయించి న్యాయం పొందుతామన్నారు.

Updated Date - 2022-01-23T09:20:06+05:30 IST