ఇదిగో సాక్ష్యం.. మీద ఏం పోసుకొంటావ్‌!

ABN , First Publish Date - 2022-01-23T09:01:40+05:30 IST

ఇదిగో సాక్ష్యం.. మీద ఏం పోసుకొంటావ్‌!

ఇదిగో సాక్ష్యం..  మీద ఏం పోసుకొంటావ్‌!

మంత్రి కొడాలికి టీడీపీ నాయకుల సవాల్‌ 


అమరావతి, విజయవాడ, గుడివాడ, జనవరి 22(ఆంధ్రజ్యోతి): గుడివాడలో కేసినో నిర్వహించినట్టు నిరూపిస్తే పెట్రో ల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానన్న మంత్రి కొడాలి నా ని సవాల్‌ను టీడీపీ నేతలు దీటుగా తిప్పికొట్టారు. కేసినో జరిగినట్టు నిరూపించే సాక్ష్యాల వీడియోలను టీడీపీ సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర శనివారం ప్రదర్శించారు. ‘‘ఇప్పుడు ఆయన మీద ఏం పోసుకొంటారో చెప్పాలి’’ అని మంత్రి నాని ని ఉద్దేశించి సవాల్‌ విసిరారు. ‘‘పబ్లిగ్గా జరిగిన విషయంలో మంత్రి ధైర్యంగా నిజం ఒప్పుకొంటే పోయేది. పిరికితనంతో అక్కడేమీ జరగలేదని బుకాయించే ప్రయత్నం చేశారు. తన సవాల్‌పై నిలబడి ఆయన తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలి’’ అని నరేంద్ర డిమాండ్‌ చేశారు. కేసినో జరగలేదని మంత్రి నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని నరేంద్ర ప్రకటించారు. ‘‘ఒక ఇంట్లో నలుగురు వ్యక్తులు పేకాట ఆడుతుంటే దాడి చేసి పట్టుకొనే పోలీసులు ఇంత బహిరంగంగా మూడు రోజులపాటు కేసినో నడుపుతుంటే ఆ పక్కకు కూడా వెళ్ళలేదు. మంత్రి ఒత్తిడి లేకుండా వాళ్లు అంత మౌనంగా ఉండగలరా? మహిళలను విలాస వస్తువులు, ఆట వస్తువులుగా మార్చి కార్యక్రమాలు నిర్వహించింది చాలక నిస్సిగ్గుగా దబాయిస్తున్నారు. పౌర సరఫరాల మంత్రి చివరకు కేసినో సరఫరాల మంత్రి అయ్యారు.  రాష్ట్రం పరువు రోడ్డున పడినా సీఎం మౌనంగా ఉండటం దురదృష్టకరం’’ అని నరేంద్ర పేర్కొన్నారు. కాగా, మంత్రి కొడాలి నానికి డబ్బు పిచ్చి పట్టిందని, ఆయన నిర్వహిస్తున్న జూద క్రీడలు బయటపడతాయన్న భయంతోనే టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ పర్యటనను వైసీపీ నాయకులు అడ్డుకున్నారని టీడీపీ నేత బొండా ఉమా విమర్శించారు. బొండా ఉమా సహా టీడీపీ నేతలు శనివారం విజయవాడ కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో కలెక్టర్‌ నివా్‌సను కలిసి కొడాలి కేసినో వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘నాని కే కన్వెన్షన్‌ హాల్‌లో కేసీనో నిర్వహించారని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. రాజీనామా చేసి, పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ఆయన సిద్ధమా?’’ అని సవాల్‌ విసిరారు. అఖిల భారత సర్వీస్‌ అధికారులు లేక ఉన్నతాధికారులతోగాని త్రిసభ్య కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కాగా, గుడివాడను నాలుగో రాజధానిగా నిర్ణయిస్తూ ఆ మేరకు బిల్లును కొత్తగా తయారు చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ బిటెక్‌ రవి ఎద్దేవా చేశారు. ‘‘రాష్ట్రానికి గుడివాడను జూద రాజధానిగా చేయండి. కేసినో ఆదాయం చూపించి బ్యాంకులను కొత్తగా అప్పు కూడా అడగవచ్చు’’ అని రవి వ్యాఖ్యానించారు. 


న్యాయ విచారణ జరపాలి : సీపీఎం  

గుడివాడ కేసినో వ్యవహారంపై న్యాయ విచారణ జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో పేకాట సంస్కృతి యువతని పెడదారి పట్టిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పీఆర్సీ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉద్యోగుల పట్ల రాష్ట్రప్రభుత్వం ఘర్షణాత్మక వైఖరితో ఉండటం సరికాదని శ్రీనివాసరావు సూచించారు. 


టీడీపీ నిజ నిర్ధారణ బృందంపై కేసులు

గుడివాడలో టీడీపీ నిజనిర్ధారణ బృందం పర్యటన జరిపిన వ్యవహారంలో 27 మంది టీడీపీ నాయకులపై కేసు నమోదు చేశారు. బృంద సభ్యులు కొనకళ్ల నారాయణ, కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, బొండా ఉమామహేశ్వరరావు, నక్కా ఆనందబాబు, వర్ల కుమార్‌రాజా, తంగిరాల సౌమ్య, ఆచంట సునీత, కాగిత కృష్ణరప్రసాద్‌, దండమూడి చౌదరి, కొనకళ్ల జగన్నాధరావు(బుల్లయ్య), వేములపల్లి శ్రీరామ్‌ప్రసాద్‌, వల్లూరి కుమారస్వామి, గరిమెళ్ల చిన్నా, నందిగం వెంకటశివరా వు, పల్లపోతు శివశంకరరావు, బొర్రా నాగరాజు, వలిశెట్టి విమలేశ్‌, చిన్నం సురేశ్‌, శొంఠి రామకృష్ణ, గోవాడ శివ, మజ్జాడ నాగరాజు, దేవరపల్లి కోటి, కాకరాల సురేశ్‌, అడుసుమిల్లి కృష్ణయ్య, అడుసుమిల్లి శ్రీనివాసరావులపై శాంతిభద్రతలకు విఘాతం కల్గించడానికి ప్రయత్నించారంటూ గుడివాడ ఒన్‌టౌన్‌ పీఎ్‌సలో కేసు నమోదయింది. పోలీసుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించారంటూ వర్ల రామయ్య, దండమూడి చౌదరి తదితరులపై పామర్రు పీఎ్‌సలో కేసు నమోదుచేశారు. తనపై హత్యాయత్నానికి ప్రయత్నించారంటూ బొండా ఉమా ఇచ్చిన ఫిర్యాదుపై వైసీపీ నేత దుక్కిపాటి శశిభూషణ్‌, మరికొంత మందిపై కేసు నమోదు చేశారు. కాగా, నిజ నిర్ధారణ బృందం పర్యటనను అడ్డుకోవడానికి రహదారులపై బైఠాయింపు చేసిన వైసీపీ నాయకులపై టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు మొత్తం 20 మంది నాయకులపై కేసు నమోదు చేశారు. 

Updated Date - 2022-01-23T09:01:40+05:30 IST