రెవెన్యూ కంచే.. చేనుమేస్తోంది!

ABN , First Publish Date - 2022-01-23T09:36:05+05:30 IST

రెవెన్యూ కంచే.. చేనుమేస్తోంది!

రెవెన్యూ కంచే.. చేనుమేస్తోంది!

రిజిస్ట్రేషన్‌ చేయకుండానే మ్యుటేషన్లు

ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ భూములు

సొసైటీ భూములకు డీకేటీ పట్టాలు

ఐదు జిల్లాల్లో తహసీల్దార్ల దందాలు

ఫిర్యాదులొచ్చినా పట్టించుకోని రెవెన్యూ

కలెక్టర్లు నివేదిక ఇచ్చాక నింపాదిగా చర్యలు


భూముల రిజిస్ట్రేషన్‌ అయ్యాకే మ్యుటేషన్‌ చెయ్యాలి. కానీ ఆ ప్రక్రియతో సంబంధం లేకుండానే ఓ తహసీల్దార్‌ మ్యుటేషన్‌ పూర్తిచేశారు. పాస్‌బుక్‌లు ఇచ్చేశారు. ఇది చెల్లదని తెలిసినా అవతలి వారి అవసరం కోసం ఆ పనికానిచ్చేశారు. నెల్లూరు జిల్లాలో సీజేఎఫ్‌ఎస్‌ భూములు అంటే అందరికీ తెలుసు. రైతుల ఉమ్మడి సహకార సొసైటీకి చెందిన భూములను సైతం ఓ తహసీల్దార్‌ డీకేటీ భూములుగా మార్చారు. మరో తహసీల్దార్‌ ఆ కేటగిరీ భూములను ప్రైవేటు భూములుగా మార్చారు. 


విలువైన ప్రభుత్వ భూమిని తక్షణ అవసరం కోసం ఓ తహసీల్దార్‌ ప్రైవేటు వ్యక్తి ఖాతాలో చూపించారు. రాత్రికి రాత్రే రికార్డులు మార్చారు. వెబ్‌ల్యాండ్‌ ఎంట్రీ కూడా చేసేశారు. మరో తహసీల్దార్‌ అస్మదీయుడి బ్యాంకు రుణం కోసం లేని భూమిని చూపించారు. రికార్డులను తారుమారు చేశారు. రుణం మంజూరైంది. మళ్లీ రికార్డులను పాత పద్ధతిలో సెట్‌ చేశారు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ భూములు, రికార్డులకు కాపాలాదారులుగా ఉండాల్సిన రెవెన్యూ అధికారులు కొందరు సొంత ప్రయోజనాలు, ఈజీ మనీ కోసం అక్రమాలకు పాల్పడుతున్నారు. రెవెన్యూశాఖకు ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా అవి విచారణ వరకు రానివ్వకుండా తొక్కిపెట్టించి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూశాఖ పెద్దలు సదరు ఫిర్యాదులను పక్కన పెట్టినా జిల్లా కలెక్టర్లు వాటిపై స్పందించారు. దీంతో చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, తప్పులు చేసిన తహసీల్దార్ల పలుకుబడి చూసి కలెక్టర్లు సైతం కంగుతిన్నారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న తహసీల్దార్లను రెవెన్యూశాఖకు సరెండర్‌ చేసి ఆ తర్వాత భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ)కు నివేదికలు పంపారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని సీసీఎల్‌ఏను కోరారు. 


22 మందిపై ఫిర్యాదులు

భూమి రికార్డులను తారుమారు చేస్తున్నారని ఐదు జిల్లాల పరిధిలో 22 మంది తహసీల్దార్లపై ఆరోపణలు వచ్చాయి. వీరిలో సీసీఎల్‌ఏ కార్యాలయం నుంచి తహసీల్దార్‌ ట్రెనింగ్‌ నిమిత్తం జిల్లాలకు వెళ్లిన ఇద్దరు అధికారులు కూడా ఉన్నారు. విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాల పరిధిలో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పేరిట రికార్డులు మార్చారన్న ఫిర్యాదు ఒకటి. దీంతోపాటు తహసీల్దార్లకు ఇచ్చిన డిజిటల్‌ కీలను దుర్వినియోగం చేస్తూ వెబ్‌ల్యాండ్‌లో అడ్డగోలు ఎంట్రీలు చేశారనేది మరో ఫిర్యాదు. వీటిపై గత ఆగస్టులోనే రెవెన్యూశాఖకు ఫిర్యాదులు వచ్చాయి. నెల్లూరు జిల్లా పొదలకూరు తహసీల్దారు స్వాతిపై ఏకంగా ఆరు ఫిర్యాదులు అందాయి. అయితే రెవెన్యూశాఖ వీటిపై స్పందించలేదు. ఇవే ఫిర్యాదులను సీసీఎల్‌ఏ కార్యాలయానికి పంపించారు. అయితే, ఆమె అక్కడి నుంచే తహసీల్దార్‌ శిక్షణ నిమిత్తం వెళ్లడంతో ఇక్కడా పెద్దగా చర్యలు తీసుకోలేదు. దీంతో అక్కడి ప్రజాప్రతినిధులు నేరుగా జిల్లా కలెక్టర్‌తోపాటు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. కడప, అనంతపురం, విజయనగరం జిల్లాలోని ఐదుగురు తహసీల్దార్లపై కూడా ఫిర్యాదులు అందాయి. వీటిపై జిల్లా కలెక్టర్లు విచారణ జరిపించగా ప్రాథమిక ఆధారాలు బయటపడ్డాయి. అధికారులు రికార్డులను తారుమారు చేసినట్లుగా గుర్తించారు. ఇదే విషయాన్ని సీసీఎల్‌ఏకు కలెక్టర్లు నివేదించారు. 


ఏం చేశారంటే..! 

ఆరోపణలు ఎదుర్కొంటున్న తహసీల్దార్లు మ్యుటేషన్‌లలో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. ఏ భూమి అయినా రిజిస్ట్రేషన్‌ అయ్యాకే మ్యుటేషన్‌ చేయాలి. కానీ, నెల్లూరులో రిజిస్ట్రేషన్‌ కాని భూములను కూడా మ్యుటేషన్‌ చేశారు. దీనివల్ల సర్కారుకు రిజిస్ట్రేషన్‌ ఫీజు రాకపోవడంతోపాటు చట్టాలను ఉల్లంఘించి పాస్‌బుక్‌లు ఇచ్చారు. నెల్లూరు జిల్లా పార్లపల్లి, పుల్లికల్లు, పొంగులూరు తదితర గ్రామాల పరిధిలోని పలువురు రైతుల భూముల రిజిస్ట్రేషన్‌ జరగకుండానే మ్యుటేషన్‌చేసి పాస్‌బుక్‌లు జారీ చేసిన విషయం వెలుగు చూసింది. అసైన్డ్‌ భూముల విషయంలోనూ అక్రమాలు జరిగినట్టు తేలింది. ప్రభగిరిపట్నం, తాటిపర్తి గ్రామాల్లో కొందరికి భూములు కేటాయించినట్లుగా రికార్డులు రూపొందించారు. ఆ తర్వాత వారి పేర్లను రికార్లుల్లో నమోదు చేసినట్లుగా గుర్తించారు. దీనిపై మండల తహసీల్దార్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఐదు జిల్లాల పరిధిలో9 మంది  తహసీల్దారులు వెబ్‌ల్యాండ్‌ ఎంట్రీల్లో తప్పులు చేశారన్న ఫిర్యాదులు వచ్చాయి. అక్రమాలు నిర్ధారణ కావడంతో వీరిలో ఐదుగురిపై చర్యలు తీసుకున్నారు. ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా రికార్డులు మార్చారని ముగ్గురిపై ఫిర్యాదులొచ్చాయి. వెబ్‌ల్యాండ్‌ అక్రమాలు, రికార్డుల తారుమారు కేసుల్లో తహసీల్దార్లపై భారీగా ఫిర్యాదులు ఉంటున్నాయి. అయితే, వాటిపై విచారణ స్వల్పంగా ఉంది. ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ల జోక్యంతో కేవలం ఆరుగురిపైనే విచారణ చేపట్టారు. అవి క్లియర్‌ కేసులు కావడంతో అధికారులను సస్పెండ్‌ చేస్తూ సీసీఎల్‌ఏ ఉత్తర్వులు జారీ చేశారు. కడప-2, అనంతపురం-1, నెల్లూరు-1, విజయనగరం-2 తహసీల్దార్లను సస్పెండ్‌ చేశారు. ఇక, జిల్లాల స్థాయిలో మరో 16 మందిపై విచారణ చేపట్టాల్సి ఉన్నట్లు తెలిసిం

Updated Date - 2022-01-23T09:36:05+05:30 IST