వైసీపీ నేత బరితెగింపు

ABN , First Publish Date - 2022-01-28T09:18:02+05:30 IST

వైసీపీ నేత బరితెగింపు

వైసీపీ నేత బరితెగింపు

ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రహరీ నిర్మించిన దొడ్డి కిరణ్‌

తొలగించేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై దాడి


విశాఖపట్నం/గోపాలపట్నం/పెందుర్తి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై వైసీపీ నేత దాడి చేశారు. ఎక్స్‌కవేటర్‌ను కూడా తీసుకుపోయారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సత్తివానిపాలెంలో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సత్తివానిపాలెంలోని సర్వే నంబరు 355లో సుమారు 80 సెంట్ల గెడ్డ పోరంబోకు భూమి ఉంది. దీని విలువ భారీగానే ఉంటుంది. ఈ స్థలంపై పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త, రాష్ట్ర విద్యా వసతుల కల్పన సంస్థ చైర్మన్‌ మళ్ల విజయప్రసాద్‌ ముఖ్య అనుచరుడు, జీవీఎంసీ 88వ వార్డు వైసీపీ ఇన్‌చార్జి దొడ్డి కిరణ్‌ కన్నేశాడు. దాని పక్కనున్న తన రెండు ఎకరాల భూమిలో గెడ్డ పోరంబోకు భూమిని కలుపుకుంటూ ఆరు నెలల కిందట ప్రహరీ నిర్మించాడు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో వారు అక్కడకు వెళ్లారు. ఎక్స్‌కవేటర్‌ సహాయంతో ప్రహరీని కూల్చివేస్తుండగా... కిరణ్‌ ఆర్‌ఐ శివకుమార్‌తోపాటు రెవెన్యూ సిబ్బందిపై దాడికి దిగాడు. వీడియో తీస్తున్న సిబ్బందిపై చేయి చేసుకుని వారి నుంచి సెల్‌ఫోన్‌ లాక్కొన్నాడు. ఆక్రమణలు తొలగించేందుకు వచ్చిన ఎక్స్‌కవేటర్‌ను కూడా అతడి అనుయాయులు తీసుకుపోయారు. దాడిలో గాయపడిన రెవెన్యూ సిబ్బంది ఘటనపై పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు దొడ్డి కిరణ్‌తోపాటు అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమపై దాడికి నిరసనగా రెవెన్యూ సిబ్బంది పెందుర్తి పోలీ్‌సస్టేషన్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దాడిని కలెక్టర్‌ ఎ.మల్లికార్జున తీవ్రంగా పరిగణించారు. దాడికి పాల్పడిన దొడ్డి కిరణ్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలంటూ నగర పోలీస్‌ కమిషనర్‌ మనీశ్‌కుమార్‌ సిన్హాకు లేఖ రాశారు. 

Updated Date - 2022-01-28T09:18:02+05:30 IST