శాస్త్రీయంగా కొత్త జిల్లాలు

ABN , First Publish Date - 2022-01-28T08:49:14+05:30 IST

శాస్త్రీయంగా కొత్త జిల్లాలు

శాస్త్రీయంగా కొత్త జిల్లాలు

26 జిల్లాల్లో విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లాలుగా ఒంగోలు, అనంతపురం ఉంటాయి. చిన్న జిల్లాగా విశాఖపట్నం ఉంటుంది. 


విస్తీర్ణం తక్కువైనా ఎక్కువ జనసాంద్రత ఉన్న జిల్లాలుగా  పశ్చిమగోదావరి (భీమవరం), తూర్పు గోదావరి (రాజమహేంద్రవరం) ఉంటాయి. ఇక్కడ సగటున 20 లక్షల మంది జనాభా ఉన్నారు.  


ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ప్రతిపాదిత జిల్లా సరిహద్దు పరిధిలో ఉండాలి. ప్రతి జిల్లాలో కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఉండాలి. 

 

రాష్ట్రంలో 26 జిల్లాలు, 62 రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. ప్రస్తుతమున్న 51 రెవెన్యూ డివిజన్లకు తోడు కొత్తగా 15 ఏర్పాటు చేయాలి. 4 డివిజన్లను ఇతర వాటిల్లో విలీనం చేయాలి. 


అభ్యంతరాలుంటే నెల రోజుల్లో తెలపాలి

ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌


అమరావతి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సేవలను మరింతగా ప్రజల చెంతకు తీసుకెళ్లేందుకు, పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రణాళిక శాఖ కార్యదర్శి ఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. అత్యంత శాస్త్రీయ పద్ధతిలో కొత్త జిల్లాల ప్రతిపాదన చేపట్టామన్నారు. జిల్లా కేంద్రాలు, ప్రాంతాల భౌగోళిక విస్తీర్ణం, జనసాంద్రత, సామాజిక, సాంస్కృతిక అంశాలు, చారిత్రక నేపథ్యాలు, ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకున్నట్టు వెల్లడించారు. వీటిపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే నెలరోజుల్లోగా జిల్లా కలెక్టర్లకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరారు. గురువారం ప్రణాళికా విభాగం కార్యాలయంలో స్టేట్‌ డెవల్‌పమెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ డైరెక్టర్‌ కె.శివశంకరరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటు నోటిఫికేషన్‌ అనంతరం ప్రజల్లో మిశ్రమ స్పందన రావడం, పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతుండటం, రాజకీయ కోణంలో విభజన చేపట్టారని వైసీపీ నేతలే ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆయన ద్వారా వివరణ ఇప్పించింది. ‘‘జిల్లాల స్వరూపం ఎలా ఉండాలన్న దానిపై భారీ కసరత్తు చేశాం. పార్లమెంట్‌ నియోజకవర్గాల ప్రకారం 25 కాకుండా, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా 26 జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాం. ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు లేకుండా జిల్లాకు కనీసం రెండు రెవెన్యూ డివిజన్‌లు ఉండేలా, అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ఒకే జిల్లాలో ఉండేలా చూశాం. రాష్ట్రంలో గిరిజన ప్రాంత పరిధి ఎక్కువగా ఉంది. సీఎం అభీష్టం మేరకు రెండు గిరిజన జిల్లాలు ఏర్పాటు చేస్తున్నాం. రంపచోడవరం రాజమండ్రికి దగ్గరగా ఉన్నప్పటికీ అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేర్చాం. పేరున్న ఇన్‌స్టిట్యూట్‌లన్నీ ఎచ్చెర్లలో ఉన్నందున శ్రీకాకుళం జిల్లాలో కలిపాం. విజయనగరం విస్తీర్ణం కోసమే రాజాం, శృంగవరపు కోట నియోజకవర్గాలను చేర్చాం. పెందుర్తిని తీసేస్తే అనకాపల్లి వెనుకబడే అవకాశం ఉన్నందున దాన్ని కొనసాగించాం. గత ప్రాముఖ్యత దృష్ట్యా భీమిలిని రెవెన్యూ డివిజన్‌ చేశాం. కోనసీమ ప్రాంతాన్ని జిల్లాగా చేయాలని అక్కడి ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. అందుకే అమలాపురం కేంద్రంగా దాన్ని ప్రతిపాదించాం’’ అని ఆయన చెప్పారు. 


ఉద్యోగుల విభజనపై కసరత్తు 

‘‘కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగుల విభజనపై దృష్టిపెట్టాం. రాష్ట్రంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇతర కేడర్‌ పోస్టులు అదనంగా రావు. ఉన్నవాటినే సర్దుబాటు చేసుకోవాలి. జిల్లాల వారీగా ఉద్యోగుల విభజన చేపట్టాలి. దీనిపై కమిటీ పరిశీలన చేస్తోంది. ప్రస్తుతమున్న 13 జిల్లాల్లో ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్‌, ఎస్పీ, ముగ్గురు జేసీలు ఉన్నారు. ఇప్పుడు కేడర్‌ పోస్టులను కూడా సర్దుబాటు చేసుకోవాలి. అదనంగా ఉద్యోగులను తీసుకోవాల్సిన విషయంపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. ఆఫీసుల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కోసం నిధుల అవసరం ఉంటుంది. దీనిపై కూడా కమిటీ కసరత్తు చేస్తోంది’’ అని చెప్పారు. 


చివరి నిమిషంలో పేర్లు మార్పు 

మంత్రివర్గం ఆమోదించిన ఫైలులో ఉన్న పేర్లు, ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌లో లేవు? ఏం జరిగిందన్న ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ప్రజల విన్నపాలను పరిగణనలోకి తీసుకొని చివరి నిమిషంలో ప్రభుత్వం పేర్లు మార్చిందని చెప్పారు. ‘‘కొన్ని జిల్లాల పేర్లు చివరి నిమిషంలో మార్చాల్సి వచ్చింది. పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా వంటి జిల్లాలపేర్లు ప్రముఖంగా ప్రజల్లో పాతుకుపోయాయి. వాటిని తొలగిస్తే ఎలా అన్న చర్చ జరిగింది. అందుకే వాటిని కొనసాగించాలని చివరి నిమిషంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’’ అని ఆయన చెప్పారు.

Updated Date - 2022-01-28T08:49:14+05:30 IST