రాజంపేటలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-02-13T08:40:33+05:30 IST

రాజంపేటలో ఉద్రిక్తత

రాజంపేటలో ఉద్రిక్తత

జిల్లా కేంద్రం సాధన సమితి నేతల అరెస్టు

రైల్వేకోడూరులో టీడీపీ నేత అదుపులోకి


రాజంపేట/నందికొట్కూరు రూరల్‌, ఫిబ్రవరి 12: కొత్త జిల్లాల ఏర్పాటుపై పలు చోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. కడప జిల్లాను రెండుగా విభజిస్తూ ఏర్పాటు చేయనున్న అన్నమయ్య జిల్లాకు రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఇక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. అయితే.. ఉద్యమంపై పోలీసులు అడుగడుగునా ఉక్కుపాదం మోపుతున్నారు. రాజంపేట జిల్లా కేంద్రం సాధన కోసం ఉద్యమిస్తున్న జేఏసీ నేతలను అరెస్టు చేయడంతో శనివారం రైల్వేకోడూరు, రాజంపేటలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు ఉద్యమంలోకి రావాలని, జిల్లా సాధన కోసం తమ పదవులకు రాజీనామాలు చేయాలని రాజంపేట జేఏసీ ఆధ్వర్యంలో శనివారం భారీ ఎత్తున మహిళలతో కలిసి చేపట్టాలనుకున్న ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. శుక్రవారం డీఎస్పీ కార్యాలయంలో జేఏసీ నేతలు వినతిపత్రం సమర్పించినప్పటికీ ఉద్యమాన్ని అడ్డుకున్నారు. ఇందులో భాగంగా తిరుపతి నుంచి రాజంపేటకు వస్తున్న టీడీపీ నేత బీసీ రాయుడును రైల్వేకోడూరు సీఐ అరెస్టు చేశారు. దీంతో రైల్వేకోడూరులో పలువురు టీడీపీ కార్యకర్తలు హైవేపై ఆందోళనకు దిగారు. దీంతో రెండు గంటల తరువాత ఆయనను విడుదల చేశారు. ఇక, రాజంపేటలో శనివారం ఉద్యమం చేయాలనుకున్న పత్తిపాటి కుసుమకుమారి, మిరియాల సురేఖ తదితర జేఏసీ నేతలను తెల్లవారుజామునే హౌస్‌ అరెస్ట్‌ చేశారు. దీనిని రాజంపేట బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఛాయాదేవి, న్యాయవాదులు ఖండించారు.


ఉరి తాళ్లతో జేఏసీ నిరసన 

నందికొట్కూరు నియోజకవర్గాన్ని కర్నూలులోనే కొనసాగించాలని నందికొట్కూరు జేఏసీ నాయకులు, రైతులు డిమాండ్‌ చేశారు. నందికొట్కూరును నంద్యాలలో కలపడంపై హంద్రీ నీవా ప్రాజెక్టు వద్ద శనివారం ఉరి తాళ్లు తగిలించుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు అబూబకర్‌, రమణ, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నందికొట్కూరు ప్రజలు శ్రీశైలం ప్రాజెక్టు కోసం 84 వేల ఎకరాల భూమి ఇచ్చారని, హంద్రీ నీవా నీటిని అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల వారే ఎక్కువగా వాడుకుంటున్నారని అన్నారు. ఇలాంటి సమయంలో కర్నూలుకు అతి సమీపంలో ఉన్న నందికొట్కూరును 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న నంద్యాల జిల్లాలో కలిపితే పూర్తిగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-02-13T08:40:33+05:30 IST